Monday, 1 September 2025

368 (గణపతి వందనాలు)

 గురుదేవా! ఆదిదేవా! నమస్తుభ్యం,

మా హృదయమంతా నీవే వెలసిన స్వరూపం.

అలరించావు మాతో, ఆడుకున్నావు మాతో,
పూజలందుకున్నావు మాతో, పరమానందముతో.

నీ రాక మాకొక వేడుక, నీ ఉనికి మాకొక శక్తి,
నీ ప్రేమకు, నీ కృపకు లేవు ఎప్పటికీ పరిమితి.

నీవుంటే సంబరం, నీవే మాకు అంబరం,
భక్తితో నిన్ను కొలవడమే మా జీవిత ధ్యేయం.

శ్రద్ధగా పూజించగలగడం మాకొక మహా వరం,
ఇంకేమీ అవసరమూ లేదు తండ్రి వినాయక వరసిద్ది!

మనసంతా నీ ధ్యాసతో నిండిపోయినప్పుడు,
కోరికలకీ, ఆలోచనలకీ చోటుండదు ప్రభూ.

ప్రధమ పూజలందుకునే మా బుజ్జి గణపతి,
శతకోటి ప్రణామాలు నీకే మా బొజ్జ గణపతి.

వందనాలు వందనాలు – ఓ మా గణపతి,
ప్రణమ్యం శిరసా దేవం, గౌరిపుత్ర గణపతి.


Wednesday, 20 August 2025

367 (అద్భుతం)

 ఎండమావిలో నేనుంటే

వెన్నెలలా వచ్చావు

ఏడారిలో నేను అలమటిస్తుంటే

వర్షమై వర్షించావు

నా పెదవి చివర నీ పేరు

రివ్వున జారుతుంటే,

నా మౌనం నీ ధ్యానంలో

తపన చేస్తుంది

నా భాష నీ శ్వాసలో చేరి

నాకే ఊపిరినిస్తుంది

నీ ప్రేమలో పడి
నా పాదాలు కదలలేకున్నాయి.

సముద్రం అంతా ఉప్పు ఉన్నా

ఉప్పెనలా నీ ప్రేమ నన్ను చుట్టేస్తుంది


ఈ లోకం ఒక అద్బుతం అని

నిన్ను చూసాక తెలిసింది

ఆ అద్భుతమే నా జీవితమని
నీ స్పర్శ నాతో చెప్పింది.

నీ సేదలో, నీ మాయలో
నన్ను నేనే కోల్పోతున్నా,
నీ ప్రేమలో, నీ యాదలో
ప్రతి క్షణం నన్ను కనుగొంటున్నా.

Sunday, 13 July 2025

366(చలించని మనసు)

చెప్పినా విననంటివి — ఈ వెర్రి మాటలు,
ఆపినా ఆగనంటివి — ఇదే ఆఖరి చూపులు.
ఒక్కసారి ప్రేమగా పిలుపైనా లేదేమో,
నే పిలుస్తుంటే నీ గుండె తాకలేదేమో…

ఏదో ఏదో పిచ్చిగా పోతుందే చెదిరిపోతూ,
ఏంటో ఏంటో వింతగా – నీ యవ్వారం తంటగా.
చినుకైనా చెంపను తాకి – చిరు ప్రేమను పంచుతుంది,
కునుకైనా నిద్రపోమ్మని – జోలపాడుతుంది.

నువ్వుంటే చాలనేల – చిరుగాలి సంగీతం,
నేనుండే చోటనేగా – వెన్నెల హాయివాటం.
ఏది ఏమైనా పట్టనే పట్టదు,
ఎవ్వరేమన్నా మళ్లీ తిరిగి చూడని నీ మనసు.

ఎదగోల పెట్టి – ఎవ్వరు నువ్వంటూ,
ఎగురుకుంటూ పోతున్నావు.
తెలుసుకుంటావో? లేక తెలియనట్టే ఉంటావో?
మన మధ్య దాగి ఉన్న ఈ ప్రేమే నిజమని…

Monday, 4 November 2024

365

365 (

 నిశబ్దం నిశీధిలో నిలచి చూస్తుంది
నా మౌనం నీడలో చేరి వెక్కిరిస్తుంది
కొన్ని సార్లు అంతే ఉత్వర్వులేని ప్రశ్నలే
కొన్ని సార్లు అంతే కిక్కిరిసే ఆలోచనలే

ఈ ఖగోళమే ఒక గంధరగోళం
ఈ ప్రపంచమే ఒక మాయాజాలం
మాయ చేయటం నేర్చుకున్నావా
మచ్చలేకుండా బ్రతికేస్తావ్
మోసపోవటం నేర్చుకున్నావా
విస్ఫోటనంలో చిక్కుకుంటావ్

మనుజులం కదా మనము
ఏ అవసరం లేకుండా గడపలేము
ఏ స్వార్ధపు ఎరకు దూరంగా ఉండజాలము
నీవు చేసే పనులకు పేరు నీతి
ఆ నీతి నీ చెంత జరగలేదా అది అపకీర్తి

సర్లే ఎన్నిచెప్పుకున్నా ఏముంది
ఇది కదా నేటి సమాజం
బాధ్యతనెరిగి మసిలితే  బంధం బిగుస్తుంది
నిన్ను నువ్వు నమ్మితే
నీ జీవితం బాగుంటుంది





Thursday, 5 September 2024

నందమూరి తారకరామారావు (364)

 ఆత్మగౌరవానికి నిలువెత్తురూపం

యావత్ తెలుగుజాతికి మణిరూపం

అజరామరం ,అద్వితీయం ఆయన సుందరరూపం

ప్రతీ తెలుగోడి గుండెల్లో ద్వనించే తారకమంత్రం


వెండితెరపై తిరుగులేని కధానాయకుడు

రాజకీయతెరపై ఎదురులేని మహానాయకుడు

తెలుగు ప్రజలందరికీ ఆధ్యుడు ,ఆరాధ్యుడు


NTR కేవలం ఇవి మూడు పదాలు మాత్రమే కాదు

ఘనకీర్తి కల్గిన మన తెలుగు చరిత్రకు భాష్యాలు

ఆ పేరులో ప్రభంజనం ,ఆ పేరుతో సంచలనం 

అన్నగారు అని పిలుచుకునే ఆత్మీయుడు

ఎంటీవోడు గా అభిమానం చూపించుకునే అందరివాడు

నాటికీ ,ఏనాటికి తెలుగుప్రజల గుండెచప్పుడు NTR


నవశకానికి నాందిపలికిన యుగపురుషుడు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు





Tuesday, 12 March 2024

ఎవర్రా మీరంతా (363)

ఎవర్రా మీరంతా! 

నీ పుట్ట - పొట్ట నువ్వు చూసుకోకుండా

ఎదుటివాడి తలరాత మారుద్దామనుకుంటావా

నీ గొప్పలు - నువ్వు చెప్పుకో అబ్బీ

ఎదుటివాడి తిప్పల లెక్కలు నీకెందుకు సుబ్బీ

కష్టపడదామనుకో తప్పులే

ఎదుగాదమనుకో అదీ తప్పులే

నువ్వు పడేది మాత్రమే కష్టమనుకుంటే ఎలాగే?


ఎన్నెన్ని వేషాలు ఎంతెంతమంది దగ్గర

నీ అస్సలును కప్పెట్టి

రంగులు మార్చుకుంటూ 

నీ రంగుప్రదర్శన భలేగుందమ్మీ


నీ పేరుకై ప్రాకులాడతావు

పక్కోడికి పేరొస్తే విలవిలలాడతావు

నీవంటే మంచి ,కుంచి అని మార్క్ ఉండాలని

ఎదుటోడినే నీ మాటల బందీగా చేసి 

తియ్యగా చెవిలో జోరీగలా చేరి

మొత్తానికే మనవాడినే మార్చేస్తావు


నిన్ను నమ్మి ,నీతో స్నేహం చెస్తే 

నమ్మినోడికే పంగనామం పెట్టి

నవ్వుతూ వాడినే వెన్నుపోటుల పొడిచి

కాటువేసి ఒంటరిగా చేస్తావు


ఏముంటుంది ఈ జీవితంలో

కాసింత హాయి ,కూసింత మాయే కదా

ఒకర్ని సంతోషంగా ఉంచలేవా ? నీకు చేతకాదా?

సంతోషపు నవ్వులు కూడా నువ్వు చూడలేవా?

అందరినీ ఆ జీవుడు ఆడిస్తుంటే
నీకు తెలిసిన మనిషితోనే నీ ఆట భలా భళి
నువ్వేదో కారణజన్ముడిలా
నువ్వేదో గొప్ప మనుజుడులా
నీ చుట్టూ అందర్నీ తిరిగేలా చేసుకుంటూ
నువ్వుండేది మాత్రం  పదిలంగా నలుగురిలో
నువ్వు మిగతావారిని చూసేది మాత్రం
ఒంటరిగా ,ఒక్కడిగా అందరిలో





Wednesday, 7 February 2024

భయంలోనే మనం (362)

 గతాన్ని తలుచుకుంటూ

వర్తమానాన్ని వృథా చేయరాదు;
వర్తమానంలో కాలయాపన చేస్తూ
భవిష్యత్తుని కాలరాయరాదు.

నువ్వు భ్రమపడిన సంఘటనలనుంచి,
నువ్వు భయపడిన ఘట్టాల దాకా—
ఆ క్షణం, ఆ నిమిషం వరకే తప్ప
భ్రమలకు, భయబ్రాంతులకు ఆస్కారం లేదు.

నువ్వు భయపడేవి నిన్ను భయపెట్టలేవు,
నీ కల్పితమైన ఆలోచనలు తప్ప.
అసంకల్పిత ప్రతీకారచర్యలు ఎన్నున్నా,
నీ సంకల్పబలం ముందు అవి అల్పమే.

డబ్బులతో పుట్టుకొచ్చే జబ్బులెన్నో,
చికిత్సకు లొంగని వ్యాధులెన్నో;
ప్రశాంతంగా నీవుంటే ప్రకృతి వరమవుతుంది,
ఆస్వాదించే గుణముంటే నీ బాధ కూడా మాయమవుతుంది.

కంగారు పడి నీ ఖర్మని మార్చుకోకు;
చంద్రుడిలా వికసిస్తూ, సూర్యుడిలా ప్రకాశించు.
ఉజ్వలమైన భవిష్యత్తు నీకుండగా
ఉరుము, మెరుపులకే ఉలికిపాటు ఎందుకు?

జన్మనిచ్చాడు కదా ఆ జీవుడు,
అందమైన జీవితానికి ఆహ్వానం పలుకుతూనే.
పోరాటాలు, యుద్ధాలు చేయనవసరం లేదు;
పూజలు, యాగాలు చేయనవసరం లేదు.

అంతా మంచికేనని నమ్మి, అడుగేస్తూ ముందుకు సాగిపో;
'భయం' అనే అనుభూతి కూడా ఒక ఆటవస్తువు.
ఈ ఆటలో గెలుపుకోసం అన్వేషించరా?
నీ ధైర్యంతో భయమనే బలహీనతని గెలిచిపో.

మిటుకు మిటుకుమంటూ మొద్దుబారిపోకు;
ఆ కిటుకును తెలుసుకుంటూ, కృష్ణలీలను చూడు.