Tuesday 13 December 2016

కవిత నెం 248 ( ఒక చిన్న మాట)

కవిత నెం : 248

మాట మాట ఒక చిన్న మాట 
మనసుని హత్తుకున్న మాట 
మౌనంలోన దాగి ఉన్న మాట 
గొంతు గ్రంథిలో తిరుగుతున్న మాట 

గుప్పెడంత గుండెలో గుప్పుమన్న మాట 
సహస్ర భాషలో చెప్పదగ్గ మాట 
తుళ్లి తుళ్లి పడే తుంటరి మాట 
మళ్లీ మళ్లీ చెప్పాలనే మధురమైన మాట 

కలలోనైనా వెంటాడే కమ్మనైన మాట 
ప్రతి రోజూ వినాలనే పరిపూర్ణమైన మాట 
మల్లెలాంటి సొగసైన స్వచ్ఛమైన మాట 
తేనెలాంటి తియ్యనైన అమృతమైన మాట 

రేయిలో హాయినిచ్చే వెన్నెల మాట 
నీ నవ్వుని చూడగానే వికసించే మాట 
నాలోన ఇన్నాళ్లు నలుగుతున్న మాట 
ప్రతి పూట ఎదలోన తడుతున్న మాట 

ఒకే ఒక మాట పెదవి  పంచుకునే మాట 
ఒకే ఒక మాట మనవి చెయ్యాలన్న మాట 
మరి ఇంతకీ ఏ మాటో చెప్పగలవా నీ నోట నా మాట ?

- గరిమెళ్ళ గమనాలు // 14. 12. 2016//





Friday 9 December 2016

కవిత నెం 247 :అంతర్యుద్ధం మనసుతో

కవిత  నెం  : 247

*** అంతర్యుద్ధం మనసుతో ******

ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది
కుదురుగా ఉండదు కదా ఈ మనసు
పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల అలజడి
అన్నీ ఉన్నా ఎదో లోటును వెంట తీసుకువస్తుంది
ఉన్నట్టుండి కొత్తగా ఎదో చెయ్యమని తంతూఉంటుంది
నాకు నేను నచ్చుతూనే ఉంటాను కాని
నాపై నాకే తెలియని ఖచ్చి పుట్టిస్తుంది
మనసు భావాల దొంతరలు బుర్రను తొలిచేస్తున్నాయి
కలంతో సేద్యం చేసి అక్షరాల్ని రూపొందించమంటున్నాయి
మరి మంచిదేగా అనుకుంటారేమో అక్కడే ఉంది చిక్కు
ఒక ఆలోచనకి ఏదైనా విరామం ఉంటుంది , ఒక పద్దతి ఉంటుంది
పద్ధతీ - పాడు లేని ఆలోచనలు కవిత్వమా అంటే ఒప్పుకోవు
ఇరగబడి రాసేద్దామంటే కుదురుగా అవి కూకోవూ
ఏమిటి చెప్మా అంటే నా జుట్టు మొత్తం అక్షరాలుగా అలికిడి
ఎప్పుడూ లేని నాలో ఏ తలనొప్పి లేని ఈ తలపోటు ఏంటో !
హుషారుగానే ఉన్నా , ఆరోగ్యంగానే ఉన్నా అందులో తేడా లేదు
కోటి భావాల కేరింతలు ఒకటే సారి నాపై దాడి చేస్తున్నట్టుగా
అక్షరాలు కొట్లాడుకుంటూ నాలోనే కాపురం చేస్తున్నట్టుగా
ఇది దేనికి సంకేతం , దీనినే కపిత్వం అంటారో - ఆ భావం అనుకోమంటారో
ఎప్పుడూ రాస్తూ ఉన్నా కొత్తగా ఇప్పుడే రాస్తున్నట్లుగా
పుడుతున్నానా నాకు నేనే మళ్లీ ఒక కవిలా ........ కపిలా ........
అద్భుతంగా ఉంది నాకు ఈ వింత అనుభూతి
పంచుకోటానికి మనసు నాతో ఇంకోలా జతకూడి
మీకు సోదిలా ఉన్నా .... నాకు ఒక వ్యాధిలా ఉంది
కానీ కీడు చేసే వ్యాధి  కాదు అని గట్టిగా ఒక నమ్మకం
ఇప్పటికిప్పుడే కొన్ని పేజీలు రాసేయాలని ఉంది
సమయం చిన్నది , తొందరది కదా నాతో దాగుడుమూటలు ఆట మొదలెట్టింది
క్షణం .... ఒక క్షణం .... మరో క్షణం .... మరో మరో క్షణం వెరసి నా గమనం
నా కలంతో పోరాటమో .. అక్షరకూర్పు లో నా ఆరాటమో తెలియదు కాని
భలే భలేగుంది ... బాగుంది ఈ బాధ .... ఒక కార్యం క్రమం లోకి చేరువేళ
చూస్తూ ఉండిపోతాను ... నా మనసు చెప్పేది వింటూ పోతాను మరి
అది గమ్యం అవుతుందో ఈ కాలంతో చేరే మార్పులలో నా కలం గమనం అవుతుందో


// గరిమెళ్ళ గమనాలు // 09. 12. 2016//










కవిత నెం 246 :నువ్వే నా చిరుజల్లు

కవిత నెం : 246
* నువ్వే నా చిరుజల్లు *

నువ్వు పలికితే - నా గుండె జల్లు
నువ్వు నవ్వితే - ముత్యాల జల్లు
నువ్వుంటే చాలు - నాకు చిరుజల్లు
నీకోసమే ఉంది - ఆ హరివిల్లు

పాలమీగడ లాంటి - నీ చెక్కిళ్లు
నువ్వు తలుచుకుంటే - నాకు ఎక్కిళ్లు
నిన్ను చూడకుండా ఉండలేవు - నా కళ్లు
నీ రాక కోసం వేచాయి  - నా ఎద వాకిళ్లు

నీ హృదయం నాకు - ఒక పొదరిల్లు
నీ ప్రేమతో నిండింది - ఈ పాలవెల్లు
నీ కాలులోన గుచ్చుకుంటే - ఒక ముల్లు
నా మనసంతా వేదనతో - చెమ్మ గిల్లు











Monday 5 December 2016

కవిత నెం 245 :నా మది అలా - నా మాట ఇలా

కవిత నెం : 245
*నా మది అలా - నా మాట ఇలా *

గుండె గోదారిలా
నువ్వు కావేరిలా
మనసు మయూరిలా
కదిలే భూగోళంలా

నీ నవ్వు కోయిలా
నీ నడక హంసలా
నువ్వు కోవెలలా
నేను జాబిలిలా

నువ్వు చిరుగాలిలా
నేను సెలయేరులా
నువ్వు తుళ్లింతలా
నేను కవ్వింతలా

చెరగని కలలా
కురిసే  వర్షంలా
విరిసే కుసుమంలా
మురిసే ముత్యంలా


వెన్నంటే నీడలా
నా చెలిమి నీడలా
నాకుండే తోడులా
నాకన్నీ నీవులా


మరువని గుర్తులా
విడువని సొత్తులా
నా ఎద సంపెంగలా
నా హిమ బింధువులా


కడలిలో అలలా
నువ్వు చెరువులా
గువ్వా గోరింక లా
మన జత కేరింతలా


తొలివలపులా
పసి తలపులా
చిరు గెలుపులా
గొప్ప మలుపులా


ఆ కొండ కోనలా
ఆ వాగు వంకలా
ఆ మావి చిగురులా
ప్రకృతి ప్రేమలా


నీకు నేను శ్వాషలా
నా కంటి భాషలా
ఒకరు ఒకరు రెండులా
నువ్వు నేనూ ప్రేమలా

- గరిమెళ్ళ గమనాలు // 05. 12. 2016















కవిత నెం 244 :నీలాంటోడు మరొకడు

కవిత నెం  : 244

*నీలాంటోడు మరొకడు *

సరదాగా చెప్పుకున్నా
గొప్పగా చెప్పుకున్నా
మనకు మనమే సాటి అని
మనలాంటి వాడు ఉండడని
మన వ్యక్తిత్వాన్ని
మన ఆత్మాభిమానాన్ని
మన అహంకారాన్ని
అన్నీ కలిపి ఒకటే తాటిపై నిలిపి
మనకు మనమే వాదించుకుంటాం
మనకు మనమే పొగుడుకుంటాం
నిజమైనా , అబద్దమైనా
మనకి  మనం మన తప్పుని త్వరగా ఒప్పుకోం
కానీ అన్ని వేళలా అది చెల్లదు మిత్రమా
ఎంతటి వాడైనా సరే ఎత్తు తగిలితే తలవంచాల్సిందే
అంతెందుకు పెళ్లి లో తాళి కట్టేటప్పుడు బెండుకావాల్సిందే
జీవితంలో మనతో మనం పోరాటంలో
ఎప్పుడో ఒకప్పుడు రాజీ పడాల్సిందే
నీ అంతవాడు లేడని అందరితో అనిపించుకున్నా
మనకంటే మరొకరితో మనం  పోటీ పడాల్సిందే
మనల్ని మనం అర్ధం చేసుకుని మలుచుకోవటం వేరు
ఎదుటివారిని లెక్క చెయ్యకుండా ఉండటం వేరు
ఈ క్రమంలో నీకు శత్రువులు పెరగవచ్చు
మరొక దారిలో మిత్రత్వం పెరగవచ్చు
మనం మన దారినే ఒప్పు అనుకుని
ఎదుటివారితో పనిలేదు అని భావించనూవచ్చు
ప్రతి ఒక్కరికి ఆటిట్యూడ్ (attitude) స్పెషల్ గా ఉంటుంది
కాకపోతే కొందరు వ్యక్తపరుచుకుంటారు
మరికొందరు వ్యక్తపరచకుండా చూపిస్తారు
సరైన పట్టుదలతో సాదించుకునేది కొందరు
వేగంగా ముందుకెళ్లి కాళ్లకు బంధం వేసుకునేది కొందరు
మనలాంటి వారు ప్రపంచంలో 7 గురు ఉంటారు అని వింటూంటాం
వారిని మనం చూస్తామో లేదో తెలియదు  కాని
మనం తాటిని తంతే మన తలదన్నే వాళ్ళు మాత్రం
మనలానే కాసుకొని కూర్చుంటారు అని మరువకండి
ఇది చెప్పటానికి వేదాంతం కాదు
చెప్పించుకోటానికి భాగవతం కాదు
మీరు , నేను మరెవ్వరైనా ఇలానే ఉంటాం
ఇది ఒక పరిశీలన మాత్రమే .....
ఎవ్వరినీ ఉద్దేశించి లిఖింపబడినది కాదు

-  గరిమెళ్ళ గమనాలు // 05. 12. 2016 //


Saturday 3 December 2016

కవిత నెం 243 :బురదలోకి రాయి

కవిత నెం : 243

బురదలోకి రాయి
నువ్వేస్తేనోయి
బురద చిందునోయీ
నీ కంటునోయి
గమ్మునుండవోయి
దుష్టులకు భాయి
జగడమాడకోయి
అది నీకు కీడు భాయి
అందరూ ఒకలా ఉండరోయి
ఈ నిజాన్ని తెలుసుకోవోయి
ఏనుగు గుంపు ముందు ఉండకోయి
ఎలక మాదిరిలా చితుకుతావోయి
నువ్వెంత వాడివైనా ఏమిటోయి
మొండివాడు ముందు నువ్వు పిండే భాయి
నీకు నువ్వు గొప్పేనోయి
మరి వాడి సంగతి నీకు తెలియదోయి
నిన్ను నమ్మించునోయి
నీతో మంచిగుండునోయ
వాడి అవసరం తీరాక నిన్ను ముంచునోయి
అనవసరమైన వాదాలు ఎందుకోయి
పోన్లే అని పక్కకి తప్పుకోవోయి
వాడి నోరు అసలే మంచిది కాదోయి
నీ మంచితనం మట్టి పాలే భాయి
గుర్రపు స్వారీ సంతోషమేనోయి
ఆంబోతుతో పందెం వద్దురోయి
తాటాకు చప్పుళ్లు వాడి బడాయి
దానికి పోటీ పడి చెయ్యకు లడాయి
ఓరోరి పిల్లకాయి
ఇన్ని సంగతులెందుకోయి
ఒక్కటంటే ఒక్కమాట చెబుతానోయి
చెడ్డవాళ్లకి దూరంగా ఉండవోయి 
వారి జోలికెళితే మనకే హాని భాయి 


- గరిమెళ్ళ గమనాలు // 03. 12. 2016

కవిత నెం 242 మన క్రియలే -మన ఖర్మలు

కవిత నెం  : 242
*మన క్రియలే -మన ఖర్మలు *
మనం ఏం చేస్తే అదే తిరిగి పొందుతాం
అంటే ''బంతి సిద్ధాంతం '' ఒక నిర్వచనం
 నువ్వు తిడితే తిరిగి తిడుతుంది ఈ లోకం
నువ్వు చెయ్యి లేపితే చితక్కొడుతుంది ఈ ప్రపంచం
అంటే హింస కు పాల్పడినప్పుడే నండోయ్
నువ్వు పొగిడితే తిరిగి పొగుడుతుంది
నువ్వు తింటేనే అందరూ తింటారు అని మాత్రం అనుకోకండి
నువ్వు మంచి చేస్తే నీకు మంచే కలుగుతుంది
నువ్వు చెడు ఒకరికి చేస్తే ఎదో రూపేణ నిన్నే తాకుతుంది
నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమ ఎదుటివారిలో కనపడుతుంది
నువ్వు కఠినంగా ప్రవర్తిస్తే లోకం ఘాటుగానే స్పందిస్తుంది
ఇది ఎవ్వరికీ తెలియనివి అని కొట్టి పారేయకండి
మనకి మనం ఆలోచన చేస్తే అర్ధమవుతుంది
ఎదో పాట ఉంది  కదూ నేను పుట్టాను లోకం ఏడ్చింది
అది చూసి ఇది తప్పు అని వాదించకండి
మనం చేసిన కర్మలే మనకు తగులుతాయి అని
పురాణాలు , పెద్దలు చెప్పకనే చెప్పారు
నిజమే నువ్వు ఏడిస్తే నవ్వే లోకం
నువ్వు నవ్వితే ఏడ్చే లోకం ఉంది
కాని నువ్వు చేసే పనులలో నీ ఫలితం ఉంటుంది
అపకారికి ఉపకారం చెయ్యమని ఉంది కదా
నేడు మంచి కి మంచే - చెడుకి చెడే
చెయ్యాలి నేటి ప్రపంచంలో .... వాస్తవం ఇది
నీకు తోచింది నువ్వు చేసుకుంటూ పోతావు
అదే నీవు చేసే వాటిలో ఒక మంచి ఎందుకు ఉండకూడదు
నీ దినచర్యలో నీతిని పాటించు అదే  నీకు ఖ్యాతి తెస్తుంది
నీకు మానవత్వం ఉందని మరువకు నిన్ను మనిషిలా చూపిస్తుంది
ఎవరికీ హాని చెయ్యాలని తలవకు నీకు ఎన్నడూ కీడు కాదు
ఒకరిపై పడి రోదించకు - నీకున్న దానిలో సంతృప్తి ని చూస్తావు
ఈర్ష్యా -ద్వేషాలు లేకుండా చూసుకో అందరికీ నచ్చుతావు
కులాలు - మతాలు అంటూ పోకు నీ వెంట నలుగురు ఉండేలా చూసుకో 
సహనం అవసరం - అసహనం తో ఊగిపోకు ఖచ్చితంగా గెలుస్తావు 
గెలుపు - ఓటమిలను పట్టించుకోకు నీ గమ్యం సక్రమమా కాదా చూడు 
నీవు చేసే క్రియలే నీకు భవిషత్తు నిర్దేశిస్తాయి 
నీవు పాటించే మంచి పద్ధతులే నిన్ను స్థిరంగా నిలబెడతాయి 
నువ్వు రాయి ఎలా విసిరితే అలానే వెళ్తుంది 
నువ్వు నడక ఎలా సాగిస్తే నీ నడత అలానే సాగుతుంది 
మనం రాసుకునే సిద్ధాంతాలే మనమూ పాటించాలి కదా !!!!

- గరిమెళ్ళ గమనాలు // 03. 12. 2016//





Friday 2 December 2016

కవిత నెం 241 : బంధాలు అనుబంధాలు

కవిత నెం  : 241

బంధాలు అనుబంధాలు అంటే నాకిష్టం 
కొత్తవారినైనా త్వరగా అల్లుకోగలనేమో 
అల్లుకున్న బంధం మామిడి తోరణంలా 
 పచ్చగా  పది కాలాలు పాటు సాగాలని 
నా మనసుకు  ఉంటుంది ఆరాటం 
కానీ ప్రతీ బంధమూ మనది కాదు , మనదై పోదు 
స్నేహాలు కొన్ని , సంతోషాలు కొన్ని 
అవమానాలు కొన్ని , ఆశలకెరటాలు కొన్ని 
ఆత్మీయతలు కొన్ని , అంతరంగాలు కొన్ని 
అభిమానాలు కొన్ని , అంతమయ్యేవి కొన్ని 
అద్భుతాలు కొన్ని , అంతమయ్యేవి కొన్ని 
ఈ బంధాలలో రక్త సంబంధాలు కొన్ని 
ఏ సంబంధం లేకుండా పుట్టేవి కొన్ని 
ఆకర్షణకు గురి కావటం మానవ నైజం 
తేడా వస్తే ఘర్షణ జరిగి సంఘర్షణకు గురి కావటం 
సమాజం లో నిజంగా సంభవించటం అది సహజం 
కొన్ని పరిచయాలు శాశ్వతంగా 
పరిచయం ఉన్నవే మనకు దూరంగా 
దూరమైనవి దగ్గరగా , దగ్గరగా ఉన్నవి దూరంగా 
అంతులేని బంధాల సమూహకార్యాలాపన 
అందమైన మానవ సంభంధాల సమారాధన 
ఎంతోమంది మనచుట్టూ ఉన్నా
మనకంటూ చెప్పుకునే వారు ఎందరున్నా 
అయినవారు మన బంధం కోరుకోకపోయినా 
కానివారు మనస్సుకు  చేరువై బరువుగా మారినా 
గుండెల్ని పిండేసేలాగా బంధాలు మారినా 
తట్టుకోలేని జీవన విధానం మానవ చక్రం 
మనిషి ఎక్కడున్నా , ఏ మూలానున్నా 
తన చుట్టూ ఎదో ఒక బంధం పెనవేసుకునే ఉంటుంది 
బాధ్యతతో వాటికి బానిస కూడా మనిషి 
అస్సలు ఈ బంధాలు ఏమిటి అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి 
కానీ బంధమే లేనిదే మనిషి బ్రతకటం అసాధ్యమే 
అది ఈ సృష్టితో దాగియున్న ఒక బంధం 
అయినా వాళ్ళని లెక్క చెయ్యని బంధాలు కొన్నైతే 
కాని వారితో సంబంధాలు కలుపుకుని బ్రతికేవారు కొందరు 
ఎక్కువగా ఎవ్వరూ పరిచయం అవ్వకపోయినా 
మనవారు ఎవ్వరూ మనల్ని చూడకపోయినా 
పరవాలేదు కాని    ....... ....... 
మనకోసం వచ్చి , మనల్ని మెచ్చి ,
తరువాత వారికి వెగటు వచ్చి 
ఒంటరిగా చేసే వారు మాత్రం లేకుండా ఉంటే చాలు 
అలానే పిచ్చి పిచ్చి సంబంధాలు లేకుంటే చాలు 
సరదాగా , సంతోషంగా ఉన్నన్నాళ్లు తోడుంటే చాలు 


- గరిమెళ్ళ గమనాలు // 02. 12. 2016 //