Monday 5 December 2016

కవిత నెం 244 :నీలాంటోడు మరొకడు

కవిత నెం  : 244

*నీలాంటోడు మరొకడు *

సరదాగా చెప్పుకున్నా
గొప్పగా చెప్పుకున్నా
మనకు మనమే సాటి అని
మనలాంటి వాడు ఉండడని
మన వ్యక్తిత్వాన్ని
మన ఆత్మాభిమానాన్ని
మన అహంకారాన్ని
అన్నీ కలిపి ఒకటే తాటిపై నిలిపి
మనకు మనమే వాదించుకుంటాం
మనకు మనమే పొగుడుకుంటాం
నిజమైనా , అబద్దమైనా
మనకి  మనం మన తప్పుని త్వరగా ఒప్పుకోం
కానీ అన్ని వేళలా అది చెల్లదు మిత్రమా
ఎంతటి వాడైనా సరే ఎత్తు తగిలితే తలవంచాల్సిందే
అంతెందుకు పెళ్లి లో తాళి కట్టేటప్పుడు బెండుకావాల్సిందే
జీవితంలో మనతో మనం పోరాటంలో
ఎప్పుడో ఒకప్పుడు రాజీ పడాల్సిందే
నీ అంతవాడు లేడని అందరితో అనిపించుకున్నా
మనకంటే మరొకరితో మనం  పోటీ పడాల్సిందే
మనల్ని మనం అర్ధం చేసుకుని మలుచుకోవటం వేరు
ఎదుటివారిని లెక్క చెయ్యకుండా ఉండటం వేరు
ఈ క్రమంలో నీకు శత్రువులు పెరగవచ్చు
మరొక దారిలో మిత్రత్వం పెరగవచ్చు
మనం మన దారినే ఒప్పు అనుకుని
ఎదుటివారితో పనిలేదు అని భావించనూవచ్చు
ప్రతి ఒక్కరికి ఆటిట్యూడ్ (attitude) స్పెషల్ గా ఉంటుంది
కాకపోతే కొందరు వ్యక్తపరుచుకుంటారు
మరికొందరు వ్యక్తపరచకుండా చూపిస్తారు
సరైన పట్టుదలతో సాదించుకునేది కొందరు
వేగంగా ముందుకెళ్లి కాళ్లకు బంధం వేసుకునేది కొందరు
మనలాంటి వారు ప్రపంచంలో 7 గురు ఉంటారు అని వింటూంటాం
వారిని మనం చూస్తామో లేదో తెలియదు  కాని
మనం తాటిని తంతే మన తలదన్నే వాళ్ళు మాత్రం
మనలానే కాసుకొని కూర్చుంటారు అని మరువకండి
ఇది చెప్పటానికి వేదాంతం కాదు
చెప్పించుకోటానికి భాగవతం కాదు
మీరు , నేను మరెవ్వరైనా ఇలానే ఉంటాం
ఇది ఒక పరిశీలన మాత్రమే .....
ఎవ్వరినీ ఉద్దేశించి లిఖింపబడినది కాదు

-  గరిమెళ్ళ గమనాలు // 05. 12. 2016 //


0 comments:

Post a Comment