22, మే 2026, శుక్రవారం

372 కవితా శీర్షిక : నీకై...తపన

 

కవితా శీర్షిక : నీకై...తపన

జట్టుగా కలిసి

చెట్లూ పుట్టా తిరిగిన మనం

ఈ రూమ్‌లోనే
నేను ఒక్కడినే
తిరుగుతూ ఉన్నా

ఏం చేస్తున్నావో అని
ఆలోచిస్తూ
నాకే తెలియకుండా
నీకు కాల్ చేస్తున్నా

హార్ట్ అంటే తెలుసు కానీ
హార్ట్ అటాక్ ఒకటుంటుందని
ఈ లవ్ పెయిన్ అటాక్
అయినప్పుడే తెలిసింది మా.

నీ కళ్లలోనే
ప్రపంచాన్ని చూసాను
ఇప్పుడు ఏ ప్రపంచమైనా
నీవే అనిపిస్తున్నావ్ మా.

ఆకలి కేకలు పెడుతున్నా
నువ్వు తిన్నావో లేదో అని
నా ఆకలినే ఆపేస్తున్నా.

నిన్న కాక మొన్ననే
కలిసిన మనం
నీవు నా చెంత లేని ఈ క్షణం
నీకోసం పరితపించే నా హృదయం
నీకోసం ఆరాటపడే నా ప్రాణం

నా తనువు ఇక్కడున్నా
నా మనసు నీ మదిలో
నా భావాలు నీతో
ఆడుకుంటున్నట్టు
మాట్లాడుకుంటున్నట్టు

నీవే నేనైనట్టు
ఒకరికోసం ఒకరన్నట్టు
ఒకేలా మన ఆలోచనలు
ఒకేలా మన కదలికలు

మౌనం మాట్లాడుకుంటుంది
అని మొదటిసారిగా తెలిసింది

ప్రియతమా.. నా ప్రాణమా
త్వరగా ఈ దూరం తగ్గాలని
మరింత వేగంగా నేను నిన్ను చూడాలని
ఆశతో.. నీ శ్వాసతో ఎదురుచూస్తూ ఉంటా మా


గరిమెళ్ళ రాజేంద్రప్రసాదు

9100068768

16, ఏప్రిల్ 2026, గురువారం

371 (మారని ప్రేమ రేఖ)

 మారని ప్రేమ రేఖ

తొలిసారి పుట్టిన ప్రేమ

తుదివరకు చావదు
ఏ చరిత్రలోనూ మారదు…

ఆరాధనో… ఆలాపనో…
నీ నీడలో, నీ ఒడిలో గడిపిన సాంగత్యం
నాకు జీవితకాలం సరిపోయే సంతోషం…

నువ్వు ఔనన్నా… కాదన్నా…
నీ ప్రేమలోనే నిలిచిపోతాను
నీ ప్రేమతోనే సాగిపోతాను…

నువ్వు నాకోసం ఉన్నావన్న ఉనికి చాలు
నాకు నాకోసం ఉంటావన్న ఊహ చాలు…

అమాంతం నీ గుండెలపై వాలి
నీ స్పర్శని బంధించాలని ఉంది…
కాసేపైనా… మరి కాసేపైనా…
నీ కబుర్లతో పొద్దు గడపాలని ఉంది…

ఏకాంతం మనకు వస్తుందో రాదో
ఈ క్షణమైనా చాలులే…
నీ పిలుపుకి అదే దారి…

తనివితీరా చూడమనే నా కళ్ళు
నువ్వు కనపడితే స్థంబాలైపోతాయి…

వరమో… కలవరమో…
ఈ జన్మకి ఇదే కారణమో…
నువ్వక్కడ… నేనిక్కడ…
మారని రాతేమో…

మన ప్రేమకు మాత్రం
ఏ విధి కూడా అడ్డుకాలేదు…

నా బంధమా… అనుబంధమా…
నా ప్రాణమా… నా రూపమా…

స్వాగతం నా హృదయంలోకి…
సుమస్వాగతం నా గతంలోకి…

నువ్వు ఆనందంగా…
నీ జీవితం అందంగా ఉండాలని కోరుకునే
నీ ప్రేమకు రాజుని…
నీ ప్రేమలో రారాజుని…

18, మార్చి 2026, బుధవారం

370 (నాన్న… నా ప్రతి ఊపిరిలో నీవే)

 నాన్న

పదే పదే వినిపించే నీ పేరు
పదే పదే కనిపించే నీ తీరు
పదే పదే నీ జ్ఞాపకాలే నన్ను నిమిరుతుంటే

నీ రూపులో… నీ చూపులో…
నేనే ఉన్నాను — మొత్తంగా నీవుగా

జీవితం ఎలా ఉన్నా… ఎటు పోతున్నా…
చిన్న కునుకేసే క్షణంలో కూడా
కలలా వచ్చి తాకి వెళ్లిపోతావు నాన్న…

ఎందుకో గుబులనిపిస్తుంది…
ఎందుకో గుండె బరువనిపిస్తుంది…
ఎందుకో నీవు నా పక్కనే ఉంటే
ఎంత బాగుంటుందో అనిపిస్తుంది…

జీవితం ప్రశ్నగా కనిపించే వేళ
సమాధానం నీవే అనిపిస్తావు…

నీ ఆశలు… ఆశయాలు ఎక్కడ ఆగిపోయాయో తెలియదు కానీ
నీ అడుగులో అడుగునై
నీవు చూపిన బాటలో — ఓ నాన్నగా
కాలంతో కలిసి సాగిపోతున్నాను…

నువ్వెలా చూసుకున్నావో తెలియదు కానీ
అమ్మ ఆలాపనలో
నీ గారాబం… నీ మమకారం
చూపుల మధ్య దాగి ఉన్నాయనిపిస్తుంది నాన్న…

నీవిచ్చిన జీవితంతో…
నీవిచ్చిన పేరుతో…
మన పేరు పదిలంగా నిలిచేలా
శ్రమిస్తా… శాసిస్తా…

నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ…
నీ కొడుకుగా జీవిస్తా…
నీ కొడుకునై రాణిస్తా…

12, నవంబర్ 2025, బుధవారం

369 (ఓ అందెశ్రీ… ప్రజా హృదయ కవి!)

అందెశ్రీ ఎవరో నాకు తెలియదు,

కానీ ఆయన ప్రతి మాట విన్నప్పుడల్లా,
ప్రతి వాక్యం చదివినప్పుడల్లా,
నా రోమాలు నిక్కబడి నిలిచాయి.

ఆయనలోని ఆ ప్రజాహృదయం
నాలో ఆసక్తిని మదిలించింది.

ప్రజా కవి అంటే ఇలానే ఉండాలి,
అది ప్రకృతివరం — ఆయనకే సాధ్యం.

నాకు తెలంగాణ అంటే ఇష్టం —
ఇక్కడ ఉంటున్నందుకే కాదు,
ఇక్కడ ఉన్న ఆ ఆర్ధ్రత, ఆ ఉద్యమ స్పూర్తి
ఈ నేల మట్టివాసనతో నా మనసును లేపాయి.

ప్రజలే సైనికులై,
తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్నది —
ఈ మహోన్నత తెలంగాణ!

"నాది కవిగానం కాదు — కాలజ్ఞానం"
అని అన్నావయ్యా అందెశ్రీ…

జయ జయహే తెలంగాణం!
తన నుదుటి రాతను తానే రాసుకున్న మహాకవి,
మన అందెశ్రీ!

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించి,
జయజయ ద్వానాలతో భవిష్యవాణి చెప్పినావయ్యా —
నీకు వందనం! 🙏

చదువులేకపోయినా విద్యావంతుడవయ్యా,
నదీమ తల్లుల వెంట నడుస్తూ,
ప్రపంచవ్యాప్త పర్యటన చేసినవయ్యా!

అంబరాన్ని తాకిన సంబరమాయే —
నీ తెలంగాణ జాగృతి!
నీ ఉద్యమబాటలోంచి,
ప్రతీ అక్షరం మాతోటి నిండిపోయెను.

నీ స్వరం — నరనరాల్లో ప్రవహిస్తోంది చూడు అయ్యా
నీ ఉనికి — ఉబికి ఉబికి నేడు శాసిస్తోంది అయ్యా!

యువతను ఉర్రూతలూగించిన ఆ గొంతుక నేడు మూగబోయెను,
పల్లెపదం నేడు విశ్రాంతి తీసుకుంది —
పామరుడి పదం దివికెగిసింది.

ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి
నీ పల్లకిని స్వయంగా మోసినాడంటే —
అది నీ స్నేహం, నీ త్యాగం యొక్క ప్రతీకం!

నేడు అవి ఆదర్శప్రాయమయ్యాయి —
నీకు నీరాజనాలు మహానుభావా! 🙏

నేను నీకు తెల్వదు,
నీవు నాకు తెల్వదు సారు,
అయినా ప్రతి అక్షరంలో, ప్రతి ఆలోచనలో
నీ జాడను తెలుసుకుంటున్నా.

నా కలం యాదిలో నీవుండాలని తలచుకుంటున్నా,
తెలంగాణ గుండెని తాకే ప్రయత్నం చేస్తున్నా —
ఓ అందెశ్రీ!

నీలా ఉండాలి,
నీలా జీవించాలి,
నీలా పోరాడాలి,
నీలా వ్యక్తిత్వం వికసించాలి! 🌺

మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు,
మచ్చుకైనా లేడు చూడు —
మానవత్వం ఉన్న వాడు,
నూటికో, కోటికో ఒక్కడే ఒక్కడు!

💐 అందెశ్రీ గారికి నివాళి 💐

1, సెప్టెంబర్ 2025, సోమవారం

368 (గణపతి వందనాలు)

 గురుదేవా! ఆదిదేవా! నమస్తుభ్యం,

మా హృదయమంతా నీవే వెలసిన స్వరూపం.

అలరించావు మాతో, ఆడుకున్నావు మాతో,
పూజలందుకున్నావు మాతో, పరమానందముతో.

నీ రాక మాకొక వేడుక, నీ ఉనికి మాకొక శక్తి,
నీ ప్రేమకు, నీ కృపకు లేవు ఎప్పటికీ పరిమితి.

నీవుంటే సంబరం, నీవే మాకు అంబరం,
భక్తితో నిన్ను కొలవడమే మా జీవిత ధ్యేయం.

శ్రద్ధగా పూజించగలగడం మాకొక మహా వరం,
ఇంకేమీ అవసరమూ లేదు తండ్రి వినాయక వరసిద్ది!

మనసంతా నీ ధ్యాసతో నిండిపోయినప్పుడు,
కోరికలకీ, ఆలోచనలకీ చోటుండదు ప్రభూ.

ప్రధమ పూజలందుకునే మా బుజ్జి గణపతి,
శతకోటి ప్రణామాలు నీకే మా బొజ్జ గణపతి.

వందనాలు వందనాలు – ఓ మా గణపతి,
ప్రణమ్యం శిరసా దేవం, గౌరిపుత్ర గణపతి.


20, ఆగస్టు 2025, బుధవారం

367 (అద్భుతం)

 ఎండమావిలో నేనుంటే

వెన్నెలలా వచ్చావు

ఏడారిలో నేను అలమటిస్తుంటే

వర్షమై వర్షించావు

నా పెదవి చివర నీ పేరు

రివ్వున జారుతుంటే,

నా మౌనం నీ ధ్యానంలో

తపన చేస్తుంది

నా భాష నీ శ్వాసలో చేరి

నాకే ఊపిరినిస్తుంది

నీ ప్రేమలో పడి
నా పాదాలు కదలలేకున్నాయి.

సముద్రం అంతా ఉప్పు ఉన్నా

ఉప్పెనలా నీ ప్రేమ నన్ను చుట్టేస్తుంది


ఈ లోకం ఒక అద్బుతం అని

నిన్ను చూసాక తెలిసింది

ఆ అద్భుతమే నా జీవితమని
నీ స్పర్శ నాతో చెప్పింది.

నీ సేదలో, నీ మాయలో
నన్ను నేనే కోల్పోతున్నా,
నీ ప్రేమలో, నీ యాదలో
ప్రతి క్షణం నన్ను కనుగొంటున్నా.

13, జులై 2025, ఆదివారం

366(చలించని మనసు)

చెప్పినా విననంటివి — ఈ వెర్రి మాటలు,
ఆపినా ఆగనంటివి — ఇదే ఆఖరి చూపులు.
ఒక్కసారి ప్రేమగా పిలుపైనా లేదేమో,
నే పిలుస్తుంటే నీ గుండె తాకలేదేమో…

ఏదో ఏదో పిచ్చిగా పోతుందే చెదిరిపోతూ,
ఏంటో ఏంటో వింతగా – నీ యవ్వారం తంటగా.
చినుకైనా చెంపను తాకి – చిరు ప్రేమను పంచుతుంది,
కునుకైనా నిద్రపోమ్మని – జోలపాడుతుంది.

నువ్వుంటే చాలనేల – చిరుగాలి సంగీతం,
నేనుండే చోటనేగా – వెన్నెల హాయివాటం.
ఏది ఏమైనా పట్టనే పట్టదు,
ఎవ్వరేమన్నా మళ్లీ తిరిగి చూడని నీ మనసు.

ఎదగోల పెట్టి – ఎవ్వరు నువ్వంటూ,
ఎగురుకుంటూ పోతున్నావు.
తెలుసుకుంటావో? లేక తెలియనట్టే ఉంటావో?
మన మధ్య దాగి ఉన్న ఈ ప్రేమే నిజమని…