నాన్న
పదే పదే వినిపించే నీ పేరు
పదే పదే కనిపించే నీ తీరు
పదే పదే నీ జ్ఞాపకాలే నన్ను నిమిరుతుంటే
నీ రూపులో… నీ చూపులో…
నేనే ఉన్నాను — మొత్తంగా నీవుగా
జీవితం ఎలా ఉన్నా… ఎటు పోతున్నా…
చిన్న కునుకేసే క్షణంలో కూడా
కలలా వచ్చి తాకి వెళ్లిపోతావు నాన్న…
ఎందుకో గుబులనిపిస్తుంది…
ఎందుకో గుండె బరువనిపిస్తుంది…
ఎందుకో నీవు నా పక్కనే ఉంటే
ఎంత బాగుంటుందో అనిపిస్తుంది…
జీవితం ప్రశ్నగా కనిపించే వేళ
సమాధానం నీవే అనిపిస్తావు…
నీ ఆశలు… ఆశయాలు ఎక్కడ ఆగిపోయాయో తెలియదు కానీ
నీ అడుగులో అడుగునై
నీవు చూపిన బాటలో — ఓ నాన్నగా
కాలంతో కలిసి సాగిపోతున్నాను…
నువ్వెలా చూసుకున్నావో తెలియదు కానీ
అమ్మ ఆలాపనలో
నీ గారాబం… నీ మమకారం
చూపుల మధ్య దాగి ఉన్నాయనిపిస్తుంది నాన్న…
నీవిచ్చిన జీవితంతో…
నీవిచ్చిన పేరుతో…
మన పేరు పదిలంగా నిలిచేలా
శ్రమిస్తా… శాసిస్తా…
నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ…
నీ కొడుకుగా జీవిస్తా…
నీ కొడుకునై రాణిస్తా…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి