Thursday 31 December 2015

కవిత నెం 212:వీడ్కోలు 2015- స్వాగతం 2016

కవిత నెం :212

వీడ్కోలు 2015- స్వాగతం 2016

గతాన్ని విడనాడాలి కాని గత సృతులు కాదు
కష్టాల్ని మరువాలి కాని కష్టపడటం కాదు
చెడు నుంచి నేర్చుకోవాలి కాని చెడిపోకూడదు
ఆనందాన్ని ఆహ్వానించాలి కాని అందరికీ అది పంచాలి

ఎన్నో చూసాం పాత సంవత్సరంలో
కష్టాలు - కన్నీళ్లు
నేరాలు -ఘోరాలు
అన్యాయాలు - అక్రమాలు
చోరీలు - కబ్జాలు
మాన భంగాలు - అత్యా చారలు
భూకంపాలు - వరదలు
చావులు - ఆత్మ హత్యలు


ఎన్నో చూసాం పాత సంవత్సరంలో

మంచి - మంచితనం
సంతోషం -సంబరం
ఉల్లాసం - ఉత్సాహం
స్నేహాలు - మంచి బంధాలు
ప్రేమలు - ఆప్యాయతలు
అదృష్టం - దురదృష్టం


ఏది ఏమైనా పాత సంవత్సరం
365 రోజులు మనతో చేసిన కాపురం
ఒక కాలెండర్ జీవిత కాలం
చెడు - మంచిల సంగమం
తీపి - చేదుల మిశ్రమం

ఏడిపించినా - నవ్వించినా
ఆశలు రేపించినా - గమ్యం చేర్చినా
వింత వింత సంఘటనలు చూపించినా
ఒక స్నేహానుబంధమే ఈ 2015

కాబట్టి పాత సంవత్సారానికి
సరదాగా
సంతోషంగా
వీడ్కోలు పలుకుతూ

రాబోవు నూతన 2016 సంవత్సరంకు
అదే నూతన ఉత్సాహంతో
అదే నూతన ఆశల కెరటాలతో
అదే నూతన సంతోష ప్లకార్డ్ లతో

స్వాగతాన్ని పలకండి
మీ నిండు మనస్సుతో
నాకు - మీకు
మన అందరికీ
కీడు లేని  మేలు తేవాలని
భాద లేని సంతోషం తేవాలని
మన జీవితపు దారులలో
మనం చెప్పుకోదగ్గ ,గర్వంగా చూపుకోదగ్గ
మధురమైన మంచి రోజులు రావాలని

సుస్వాగతం చెబుతూ
అందరికీ
''నూతన సంవత్సర శుభాకాంక్షలు ''


Tuesday 22 December 2015

కవిత నెం 211:నిజం అబద్దంల నిజం

కవిత నెం :211

నిజం అబద్దంల నిజం  

నిజమెప్పుడూ లోపలే దాగుంటుంది 
ఎందుకంటే అబద్దం అందంగా ఉంటుంది కాబట్టి 

నీకు తెలిసింది కాబట్టి అది నిజమనుకుంటే 
తెలియకుండా దాగున్న విషయం మాటేమిటి ?

నిజమెప్పుడూ నిప్పులా మండుతూ కనిపిస్తుంది 
అబద్దం ఆవలింపులా నీతోనే ఉంటుంది 

ఒక్కసారి నిజం చెబితే ,చరిత్ర మారుతుంది 
కాని అబద్దం అలవాటైతే ,చరిత్రనే దహిస్తుంది 

కనపడకుండా పోయేది ''నిజం '' నేటి కాలంలో 
కనిపిస్తూ ,కవ్విస్తూ ఉండేది ''అబద్దం '' ఈ కలికాలంలో 

నిజాన్ని నమ్మలేని జనాలున్న కాలంలో 
అబద్దాన్ని నిజం చేసే మహాత్ములు ఎందరో 

మనం జీవిస్తున్నది నిజంలోనా ? అబద్దంలోనా ?
మనం చూస్తున్నదంతా నిజమా ? అబద్దమా ?

మీరు చెప్పగలరా ? చూపించగలరా ?
అలా చేయగల్గితే మీరు మాట్లాడేది ఒక్కటే ఉండాలి 
అది నిజమా (లేక ) అబద్దమా ?

మనిషి పుట్టుక ఒక నిజం 
మనిషి చావు ఒక నిజం 
మధ్యలో జరిగే జీవితం ఒక ''కల్పితం ''
ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా !

నిజాన్ని అబద్దమనుకుని 
అబద్దాన్ని నిజమనుకుని 
మన జీవితం కొన్ని కొన్ని సార్లు బోల్తాకొడటం నిజమే కదా 

నిజాన్ని చెప్పాలంటే ధైర్యం ఉండాలి 
అబద్దాన్ని చెప్పాలంటే చిన్న కారణం చాలు 

అవసరం ''అబద్దాన్ని '' పలికిస్తుంది 
భాద్యత ''నిజాన్ని '' బోదిస్తుంది 
ఏది పాటించాలో కాలమే మనకు నేర్పిస్తుంది 

కాని మన జ్ఞానంతో చేసే పని 
నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది 

నిజంలో హాయి నిలుస్తుంది 
అబద్దం భయాన్ని కల్గిస్తుంది 
నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది 

నిజం మంచి బంధాలను ఏర్పరుస్తుంది 
అబద్దం అందరినీ దూరం చేస్తుంది 
అబద్దం అలవాటైతే 
నీ బ్రతుకుకు ఉండబోదు విశ్రాంతి 


Friday 11 December 2015

కవిత నెం 210 :ఒక్కడినే

కవిత నెం :210

ఒక్కడినే 

నాలో నేనే ఒక్కడినే 
నాతో నేనే ఒక్కడినే 
నా ముందు నేను 
నా వెనుక నేను 
నా చుట్టూ నేను 
నేనంతా ఒక్కడినే 

కాసేపు ఒక్కడినే 
క్షణకాలం ఒక్కడినే 
కాలంతో ఒక్కడినే 

అన్వేషిస్తూ ఒక్కడినే 
ఆలోచిస్తూ ఒక్కడినే 
ప్రేమిస్తూ ఒక్కడినే 
విరోధిస్తూ ఒక్కడినే 

అటువైపు ఒక్కడినే 
ఇటువైపు ఒక్కడినే 
ఎటువైపైనా ఒక్కడినే 

సంతోషంలో ఒక్కడినే 
భాదలో ఒక్కడినే 
లౌక్యంలో ఒక్కడినే 
లోకంతో ఒక్కడినే 

పోరాడినా ఒక్కడినే 
ఓడినా ఒక్కడినే 
గెలిచినా ఒక్కడినే 
గేలిచేసినా ఒక్కడినే 

నాడు ఒక్కడినే 
నేడు ఒక్కడినే 
మరోనాడైనా ఒక్కడినే 
మారనివాడిని ఒక్కడినే 

అందరిలో ఒక్కడినే 
కొందరిలో ఒక్కడినే 
నలుగురిలో ఒక్కడినే 
కాని నేనొక్కడినే 

ఒక్కడినే నేనొక్కడినే 
కాదు మరి ఒంటరినే 





Tuesday 1 December 2015

కవిత నెం 209:అసహనం

కవిత నెం :209

//అసహనం //

చంటి పిల్లవాడికి 
తను అడిగింది ఇవ్వకపోతే 
వాడు అసహనమే చూపుతాడు 

పిల్లలు తమ మాట విననప్పుడు 
చెప్పి చెప్పి విసిగిపోయి 
తల్లిదండ్రులు అసహనం అవుతారు 

ప్రొద్దున్నే లేవగానే 
తన భార్య కాఫీ ఇవ్వకపోతే 
భర్త అసహనానికి గురవుతాడు 

ఒకరోజు పనమ్మాయి రాకపోతే 
ఆ పని ,ఈ పని ఏ పని చెయ్యాలో తెలియక
ఆ ఇల్లాలు అసహనమైపోతుంది 

నెల తిరిగేసరికి 
ఇంటి బిల్లులు కట్టలేక 
ఆ యజమాని అసహనం చూపుతాడు 

చేసిన అప్పులు తీర్చలేక 
అప్పుల గోల భరించలేక 
ఆ వ్యక్తి అసహనమే చూపుతాడు 

జీతాలు సమయానికి రాకపోతే ''అసహనం ''
ఉద్యగంలో ప్రమోషన్ రాకపోతే ''అసహనం ''
పెన్షన్ లు సరిగ్గా రాకపోతే ''అసహనం ''
ఫీజు రీయంబ్రెస్మెంట్ రాకపోతే ''అసహనం ''
సకాలంలో వర్షాలు రాకపోతే రైతన్నకి ''అసహనం''
రైతు పంట చేతికి అందకపోతే ''అసహనం ''
అందుకే నేడు రైతన్నల ఆత్మహత్యలు 
పెరిగిన ధరలు చూసి వినియోగదారుడికి  ''అసహనం ''
ఒకరి మతంపై మరొకరికి ''అసహనం ''
అందుకే మత ఘర్షణలు జరిగేది 
ఏ సంసార జీవితం  ఉండదు ''అసహనం ''
అందుకే కదా విడాకుల శాతం పెరిగేది 
ఒకరి కులంపై మరో కులం వారికి ''అసహనం ''
మా కులం మా కులం అంటూ నినాదాల హోరు 
ప్రభుత్వం తీరుపై ఒక్కొక్కసారి ప్రజల ''అసహనం ''
విపక్షాల గోలపై అధికార పక్షం వాళ్లకి ''అసహనం ''
వృద్ధులైన తల్లిదండ్రులను సాకలేక పిల్లలకి ''అసహనం ''
అందుకే అనాధాశ్రామల బాట పెరిగింది 
ఓడిన వాడికి గెలిచిన వాడిపై ''అసహనం ''
ఒక దేశంపై మరో దేశం ''అసహనం ''
నేటికి ఇరుదేశాల మధ్య కొనసాగే యుద్ధాలు 



ఎక్కడైనా అంతరంగముగా ఈ ''అసహనం ''కొనసాగుతూనే ఉంటుంది 
''అసహనం '' ముందు పుట్టిందే కొత్తగా ఏమీ పుట్టలేదు 
దీనికి అంతు అంటూ లేదు కాని దీనికి ఆజ్యం పోయటం తగదు 
ఇది ఒక చిన్న విషయమే కాని ఫలితాలు పెద్దవి 
అందుకే అందరిలో చర్చనీయాంశం అయ్యింది 
పార్లమెంట్ ని సైతం కుదిపేస్తుంది 
దీనిని పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు 
బ్రతికేవాళ్లు ,బ్రతకగల్గిన వాళ్లు బాగానే బ్రతుకుతున్నారు