Tuesday 29 August 2017

కవిత నెం : 298(కోరిక)

కవిత నెం : 298
* కోరిక *

మొగ్గలా మొలుస్తుంది పువ్వులా విచ్చుకుంటుంది
ఆశలా పుడుతుంది గమ్యం కోసం పరిగెడుతుంది
గుండెలోతుల్లో దిగులుగా , మెదడు మలుపుల్లో నరంలా
ఆలోచనల వేడితో ముందుకు సాగిపోతుంటుంది
శూన్యంలోనుంచి గగనతలం చేరేదాకా
లోలోపల కొత్త ఉత్ప్రేరకాలను చేర్చుతూ వస్తుంది
కనిపించనిదేదో మన కళ్ళముందుకు తెచ్చేదాకా
కకావికలమవుతూ అలజడి రేపి అదృశ్యమవుతూ ఉంటుంది
నీ సంకల్పం ఏమిటో దిశా ,నిర్ధేశం నీకు తెలిస్తే
దానికై నిరంతరం నీ శ్రమ విద్యుత్తులా ప్రవహిస్తే
నీవు కన్న కల , నీ నిజమైన కోరిక రూపంలో
నీ ముందు నిజంలా నిలుస్తుంది
అదే కోరిక గుఱ్ఱమై పరిగెడితే
అది మితి మీరు నిన్ను నాశనం చేస్తుంది

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
29. 08. 2017

Monday 14 August 2017

కవిత నెం : 297 (మన స్వాతంత్రం)

కవిత నెం : 297

*మన స్వాతంత్రం *

తరాలు మారినా ,యుగాలు మారినా
ఓ భావి భారత పౌరుల్లారా
మన దేశంపై పొరుగు దేశాల దండయాత్రలు
ఇంకా పుంకాలు పుంకాలుగా
మనమేమో స్వాతంత్రం అంటే
మన ముందు తరాలు వారు తెచ్చిపెట్టారు
మన స్వేచ్ఛ అంటూ ,ఏదో మచ్చ అంటూ
బద్దకంగా బ్రతికే మూగ జీవుల్లారా లేవండి

మన ఇంట్లో వారితోనో
మన పక్కింట్లో వారితోనో
మన కులం కాదనో
మన మతం కాదనో
నీకెక్కడో అహం అడ్డువచ్చిందనో
నీకేదో అవమానం జరిగిపోయిందనో
రగులుతూ ,నిప్పులు రాచుకుంటూ చావకు

మన దేశంలో పుట్టిన వారు ఎందరో
పొట్టకూటి కోసం పొరుగుదేశం పోయి
పడే అవస్థలు గుర్తుతెచ్చుకో
భగ భగ మండే వారి హృదయాల ఆవేదన తెలుసుకో


తెలివిలో ముందుంది భారతీయమే
విలువలో ముందుంది భారతదేశమే
చరిత్రపుటలను తవ్వితే అది మనకు గర్వమే
మన దేశ ఐకమత్యాన్ని , మన జాతి ఔనత్యాన్ని
చూసి తట్టుకోలేని కొన్ని దేశాలు
మన అంతం కోసం వారి పంతాలను పెంచుకుంటున్నాయి

వారి గడ్డపై వారి దేశపు పౌరులే ఉండాలని
మన విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ తో ఆపుతున్నాయి

మన భారత దేశపు సరిహద్దులను చెరిపేద్దామంటూ
మన సైన్యపు బలగాలకే సవాల్ విసురుతున్నాయి

మనమేమో వారి వస్తువులనే విక్రయిస్తూ
మన విలాసాల సరదాల కోసమో
మనకు మనమే ఆ దేశానికే అమ్ముడుపోతున్నాం

మనకు ఒకడికి వాడి వ్యాపారం బాగుండాలి
మరొకడికి వాడి రాజకీయజీవితం రాణించాలి
ఇంకొకడికి బెట్టింగ్ లని , స్మగ్లింగ్ లని కోట్లకు కోట్లు రావాలి

చిన్నప్పుడు టీవీ లు ఎక్కువగా లేనప్పుడు
మనతో పెరిగిన ,మనలో నలిగిన దేశభక్తి ఇప్పుడు లేదే

మీడియా ప్రచారాల కోసం ఈ దేశ భక్తిని కూడా వారి వారి
T R P ల రేటింగ్ కోసం మాత్రమే చూపెడుతున్నాయి

స్వాతంత్రం అంటే మనకోసం సంపాందించబడింది కాదు
మనం మన వారి కోసం ,మన దేశం కోసం ఇవ్వగలిగేది

ప్రతి ఒక్కరూ సైనికుడై పోరాడాల్సిన పనిలేదు
మనం ఒక భారతదేశ పౌరునిగా మన భాద్యత తెలుసుకుంటే చాలు

నీ చేతులో కలం ఉన్నదా అదే నీ ఆయుధం
నీ మాటలో పట్టు ఉన్నదా అదే నీ శాసనం
నీ కండలో సత్తువ ఉన్నదా అదే నీ రాజసం

మనమంతా ఒకటిగా ఉంటే ఎవడేం పీకుతాడు
తిరుగుబాటు అంటే యుద్దాలే రావాల్సిన అవసరం లేదు
మన సంస్థల ,వ్యవస్థల సవరణలకై చేసే పోరాటం చాలు

అందరికీ స్వాతంత్ర పండుగ శుభాకాంక్షలతో
మీ భారతీయుడు !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

జై హింద్ జై భారత్