Tuesday 28 October 2014

కవిత నెం61:అంతరంగాలు

కవిత నెం :61

అంతరంగాలు 
************************

హృదయాంతరమున కదిలే తరంగాలు 

మనసు మనసుతో మెదిలే భావాతరంగాలు
అంతుచిక్కని అనంత మౌన చదరంగాలు  
అంతర్ముఖాన్ని అద్దంలా చూపే ప్రతిరూపాలు  
ఆలోచనల అలజడిలో చేసే సుదూరప్రయాణాలు
కనపడీ కనపడనట్టు ఉండే ఎండమావులు 
భూత ,వర్తమానాల మధ్య జరిగే  రాయభారాలు  
నిజానికి ,కల్పితానికి మద్య జరిగే సంఘర్షణలు 
ఊహలను ఊరించేసి ఉరితీసే కలల సౌధాలు 
ఏకాంతాన్నివింతగా ప్రేమించే  ప్రేమికులు 
భాద పొంగుకొస్తే కన్నీటి జలపాతాలు 
కోపం తన్నుకొస్తే ప్రళయ సమీరాలు 
ఆనందం అందిన వేళ పరిమళపుష్పాలు 
ఆహ్లాదం చేరిన వేళ ఆకాశ విహంగాలు 
మనసులోని ఆంతర్యాలు  పలు పలు రూపాలు
బాహ్యా ప్రపంచానికేమో  ఏకముఖి రుద్రాక్షలు 
ఆ అనుభూతులను వర్ణన చేస్తే అవే అంతరంగాలు 
మన భావాల చిత్ర విచిత్ర కావ్యాలే అంతరంగాలు
మనసుకి తెలియని ''గమనాంతరంగాలు''
వాటిని పరిశోధిస్తే  అవి నీకు మధుర తరంగాలు 

Monday 27 October 2014

కవిత నెం60:బాల్య - భారతం

కవిత నెం :60
బాల్య - భారతం 
**********************************
ఓ అందమైన చందమామ కధ లాంటి పుస్తకం 
ఒక అపురూపమైన అద్దం లాంటి జ్ఞాపకం 
ఆ అనుభూతులనే నెమరువేసుకుంటే మనస్సు
ఆ తన్మయత్వంతో మరలా పురుడు పోసుకుంటుంది వయస్సు 
ఒక్కసారి ఎదలోతుల్లోకి చూసే బాల్యపు చూపులు 
కాలాన్ని నిలిపివేసి చెప్పుకుంటాయి ఎన్నో కబుర్లు 
గోరుముద్దల కేరింతలు - జోల పాటల లాలింతలు 
అమ్మ దగ్గర సుకుమారం - మారం చేసే గారాభం 
చిలిపి ఆటల కోలాహలం - అలసిపోని మది సంబరం 
పొంగిపోయే ఉత్సాహం - నిలచిపోయే సంతోషం 
మాటలకుండే మాయాజాలం - నడక నేర్చుకునే పసిపాదం
ఆ  మనసు స్వేచ్చా పావురం - కపటమెరుగని కర్పూరం 
స్వార్ధం లేని స్నేహాలవనం - కుళ్ళు లేని ఊహా ప్రపంచం 
విధేయత కల్గిన విత్తనం - సుగుణాలున్న గంధం 
ఆకర్షణల హరివిల్లు - ఏ ఘర్షణ లేని పొదరిల్లు 
ఏ భాద్యత తెలియని బంధం  -కష్టమెరుగని రూపం 
అనంతమైన ఆకాశం - అనురాగవల్లిత దరహాసం
బాల్యం  నుంచే జీవనం - ఎదుగదలకి ఆరంభం
బంగారు కలల సామ్రాజ్యం  - భవితకి మూల స్తంభం 
ఎప్పటికీ తిరిగి రాని బాల్యం - మలచబడిన ఓ శిల్పం 
కాని అందరికీ ఒకలాగా ఉండదు కదా ఈ బాల్యం 
పుట్టుకతోనే తోడులేని చెత్త కుప్పల పాలు ఒక బాల్యం 
అనాధలుగా అవతరించి ఆకలి కేకలతో మరో బాల్యం 
సుఖపడే స్థోమత లేక దుః ఖం తో రోదించే  బాల్యం 
బ్రతుకు నావ కోసం బిక్షాటన చేసే బీద బాల్యం 
కాలాన్ని ఎదురించి నేరగాళ్ళుగా మారి నేరచరితలో  బాల్యం 
లోకాన్ని చూడలేక అంధకారంలో అలమటించే బాల్యం 
స్వార్ధపరుల చేతుల్లో నలిగిపోతూ దిక్కులేని బాల్యం 
విది చేతిలో ఒక వస్తువులా దైవానుగ్రహం లేని బాల్యం 
ఏది ఏమైనా బాల్యం ఒకరికి స్వర్గం ... మరొకరికి నరకం 

//రాజేంద్ర ప్రసాదు // 28. 10. 2014//
సాహితీ సేవ చిత్ర కవితల పోటీ -5 కొరకు 











  

Friday 24 October 2014

కవిత నెం59:ప్రకృతి వైపరీత్యాలు


కవిత నెం :59
ప్రకృతి వైపరీత్యాలు
***************************
ప్రకృతి మనకు సహజంగా లభించిన సంపదైతే
ఆ ప్రకృతి  ప్రళయాగ్నికి మానవ తప్పిదాలు ఎన్నో
ప్రకృతి ప్రకంపిస్తుంది సునామీగా ,తుఫాన్ గా, భూకంపంగా
ప్రజల ఆర్తనాదాలు ఆందోళనగా ,అందకారంగా
మండే ఎండలు ,అకాల వరదలు ,బీడు భూములు
ఎవ్వరు రాసుకున్నవి ఈ కలియుగ విధ్వంసాలు
చెట్లు నరుకుట , కలుషిత నీరు ,కాలుష్యమే ఫైరు
గాలిలో మేడలు ,అణు పరీక్షలు ,గనుల తవ్వకాలు
విద్యుత్ ప్రాజెక్టులు ,వ్యర్ధ పదార్ధాలు ,విరిగే కొండలు
మట్టిని మరచి మార్బుల్స్ , మూగజీవాల హంటింగ్స్
నాగరికతను విడచి కృత్రిమ జీవనంకై పరుగులు
వనారణ్యాలను ఖబ్జా చేసి స్మగ్లింగ్ దందాలు
మన ఎదగటమే ముఖ్యం  మన చర్యలే ప్రకృతికి శాపం
రోదిస్తోంది ఆకాశం ప్రకృతి విలయతాండవం చూసి
కన్నెర్ర చేసింది కాశ్మీరం మన కార్య కలాపాలను కాంచి
అమ్మ ఒడి లాంటిదిరా ప్రకృతి పాడుచేయకు 
సోమ్ములకోసం ఆశపడి ప్రకృతిని అమ్ముకోకు 
అందంగా ఉంచావో అది పర్యావరణం లేకుంటే రణం 
సహజ వనరుల నిక్షేపం అది మార్చకు దాని  ఆకృతి
పర్యావరణ క్షేమమే ప్రజా సంక్షేమము ,దేశ సౌభాగ్యము 

Wednesday 22 October 2014

కవిత నెం58:భళా భళి దీపావళి

కవిత నెం :58

దీపావళి
********************************************
ఇంటింటా ఆరంభమయ్యే ఆనంద హేళీ ''దీపావళి  ''
అమావాస్య చీకట్లను మాపే  నూతన వెలుగుల జాలీ ''దీపావళి ''
చెడును చంపి మంచిని పుట్టించే శోభావళీ ''దీపావళి ''
ప్రమిదల కాంతులు ,దీపాలంకరణలతో  పుట్టేదే ''దివ్య దీపావళి ''
అనేక విజయోత్సాహాల కధలను కల్గియున్న ''దివ్య చరితావళీ''
జాతి కుల మత భేదాలు లేనిది ఈ  ''నవ్య దీపావళి ''
కష్టాల్ని కాల్చేసి మందహాసాన్ని మదికి  చేర్చే ''కిరణావళీ ''
శ్రమల్ని కరిగించి ఆశల్ని అందించే ''రూపావళీ''
అల్లర్ని కల్పించి ఆహ్లాదాన్ని నిలిపింపచేసే ''రంగేళీ ''
చిరునవ్వులు పూయించి వెన్నలకాంతులనిచ్చే ''తారావళీ''
సకుటుంబ సంతోషాల ఉషస్సుల ''ప్రవాహహేళీ''
సంబరాల సరదాల అనురాగాల రవళి ''దీపావళి ''
ప్రతి ప్రతి ఘటనలో ఉదహరించే పదం ''దీపావళి ''
ఒక్క రోజుకే కాదు ప్రతి రోజూ ప్రతి ఇంటా ఇది వెల్లివిరియాలి 
అధికమైన ఖర్చుతో భాణసంచా చేసే ''భారీ దీపావళి ''
బ్రతుకు బండి సాగలేక బిక్కుమనే వారికి రావాలి ''దీపావళి ''
అన్యాయముతో అనగదొక్కబడే వారికి కావాలి ''దీపావళి ''
ఆత్మస్థైర్యముతో అడుగిడే ఆడపడుచులకు రావాలి  ''దీపావళి ''
మానవాళి మనుగడ ప్రశాంతతకు కావాలి ''దీపావళి ''
ఈ సమస్తలోకాన్ని సంరక్షిచుటకు రావాలి ''దీపావళి ''

ప్రపంచానికే మార్గదర్శక మౌళి ''దీపావళి ''
మన భారత్ దేశ సంసృతి ఇచ్చిన పండుగ ఇది భళా భళి 

సాహితీ సేవ దీపావళి కవిత పోటీ కొరకు 
//రాజేంద్ర ప్రసాదు // 23. 10 . 2014//











Sunday 19 October 2014

కవిత నెం57:బందాలు .... అనుబందాలు

కవిత నెం :57

బందాలు .... అనుబందాలు 
*************************************
బందాలు అనుబందాలు బహు సుందర కావ్యాలు 
ఆత్మీయత నిండి యున్న అనురాగపు కెరటాలు 
మమతలు పంచే మనోహర  మధుర భావాలు 
మరచిపోలేని అందమైన అద్బుతమైన  అనుభవాలు 
జననం నుంచి మరణం దాకా వీటితోటే మన జీవనం 
అమ్మ పాల నుంచి ..అక్క ,చెల్లెల అనుబందం దాకా 
సోదరుడి ప్రేమ నుంచి స్నేహితుడి సహవాసం దాకా 
ప్రియురాలి వలపు నుంచి భార్యామణి పిలుపు దాకా 
అత్తా మామల గౌరవం నుంచి అల్లుళ్ళ ఆర్బాటం దాకా 
నాన్న స్థానం నుంచి తాత ,ముత్తాత ల ప్రస్తానం దాకా 
మన వస్తువు నుంచి మనం పెరిగిన ఊరి దాకా 
ఉవ్విల్లూరుతూనే ఉంటాయి బందాలు 
మనల్ని పెనవేసుకుని ఉంటాయి అనుబందాలు 
అర్ధం చేసుకుంటే తెలుస్తుంది వాటి విలువ 
లైట్ లే అని అనుకుంటే అది మన ఖర్మ 
బిజీ లైఫ్ లో ,డబ్బు జబ్బులో బంధాలను మరువొద్దు 
అవి లేకపోతె నీకు మేడలు వాటి కొరత తీర్చలేవు 
ఎంత పేరు నీకున్న బందాలు లేని దారి ఎడారి 
మన సంసృతి సంప్రదాయాలు వీతితోటి పుట్టినవే 
మన భారతదేశ అనుబందం మనకు గర్వకారణం 





Wednesday 15 October 2014

కవిత నెం56:నువ్వంటే నా ''మనసు ''


కవిత నెం :56
నువ్వంటే నా ''మనసు ''
**************************
నువ్వంటే నా మనసు 
నా మనసు నీకు తెలుసు 
నా మనసులోని మాట 
నీకు మనవి చేసుకున్నా 
మన్నించి దరిచేర్చవా నన్ను 
నీ మనసులోని మాట చెప్పవా 

నా మనసులోని రూపం నువ్వు 
నా మనసుచుట్టూ ఊపిరి నువ్వు 
నా మనసు పడే ఆరాటం నువ్వు 
నా మనసే నీ వశమయ్యిందే
నీ మనసేదో మాయచేసిందే 

నువ్వన్నది నా మనసే 
నేనంటే  చిన్న అలుసే 
నేనంటే పట్టనట్టు ఉంటదే 
నన్నేదో కనికట్టు చేస్తాదే 

నా మనసే నీవైనప్పుడు 
నా మనసే నీదైనప్పుడు 
ఎందుకే ఇలా అప్పుడప్పుడు 
చేస్తున్నావు గుండె చప్పుడు 

కాని 
నీ (నా ) మనసులోని మాట
ఒక్కటే అని తెలుసుకున్నా ఈ పూట 
అదే నా (నీ )మనసులో .ఉందని నేనని 
నీ (నా ) మనసంతా నీవని 
ఒకరి మనసులో ఒకరిలో ఒకరిమని 
మన మనసుల బంధం అది మరి 

//గరిమెళ్ళ గమనాలు // 15. 10. 2014// 

కవిత నెం 55:ఓ సైనికా ..... నీకు సలామ్

కవిత నెం :55

ఓ సైనికా  ..... నీకు సలామ్ 
***********************

దేశ సంతోషం కోసం సమిదిలా నిలుస్తావు 

దేశ సంరక్షణ కోసం ఫిరంగిలా మారతావు 
నీ ఆనందాన్ని ఎవ్వరూ చూడరు నీ సామర్ధ్యాన్ని తప్ప 
నీ జీవితం రణరంగమే కాని కుటుంబాన్ని చూడలేవు 
చెమటోర్చి ఎదురీదుతావు చెక్కు చెదరకుండా 
నీ నెత్తురోడినా శత్రు సైన్యాన్ని గెలువనీయవు 
ఆత్మస్థైర్యంతో నీ అడుగుని కదుపుతావు 
అణుశక్తిలా మారి ఆయుధమై  పోరాడతావు
అలుపెరుగని సూరీడల్లే  శ్రమిస్తుంటావు 
అహోరాత్రులు మరచి గమిస్తుంటావు 
నీ త్యాగఫలంతో దేశ యాగం చేస్తుంటావు 
నీ సహనం అనే వాహనంతో దేశ సంపదను నిలిపేవు 
నిన్ను పొందిన భూమాతకు  నీవు ఒక వరం 
అందుకే భరతమాత ముద్దుబిడ్డగా నీ జననం పుణ్యం 
ఏ భాద,కష్టమూ తెలియకుండా ఉన్నాము మేము 
మా సుఖ సంతోషాలకు కారణజన్ముడవు నీవు
దేశ భక్తితో దేశ  సేవకే సాగెనుగా  నీ జీవితం 
జైహింద్ జై జవాన్ అని సెల్యూట్ నే చేస్తున్నా 
విజయమో ,వీరస్వర్గమో ... కాని నీకు వందనమయా 
నీ లాంటి వారందరే ఈ దేశానికే కవచ కుండలాలయ్యా 

//రాజేంద్ర ప్రసాదు // 15. 10.2014//

- సాహితీ చిత్ర కవిత పోటీ కోసం 



   

Thursday 9 October 2014

కవిత నెం 54: ఇల్లాలి చదువు - ఇంటికి వెలుగు

కవిత నెం :54

ఇల్లాలి చదువు - ఇంటికి వెలుగు 
*******************************
ఆడపిల్లకు చదువెందుకంటూ
వంటిట్లో కుందేలుగా మార్చే వెర్రిబాగులు
ఆడపిల్ల అక్షరమే ఆయుధమని తెలుసుకోవాలి
ఆడపిల్ల చదువే తమ జీవితాలకు వెలుగని
ఆడపిల్ల చదువే జ్ఞాన జ్యోతులు వెలిగించే దీపమని
తెలుసుకుని , తనకు విలువనిచ్చే సమాజం రావాలి
తను అమ్మలాగా లాలిస్తూ మొదటి గురువవుతుంది
భార్యలాగా సమదీటుగా నీ భాద్యతలను స్వీకరిస్తుంది
ఇంటికి ఇల్లాలే ఆధారం , ఆమెతోనే సంతోషం
తను చేసే  ప్రతి పనిలోన ఉంటుంది ''చదువు ''
 ఆ చదువుని మనకిచ్చిన సరస్వతీ రూపం తాను
పుట్టినింటి మహాలక్ష్మీ ఆడదిరా
మెట్టినింటి లక్ష్మీ సౌభాగ్యవతి ఆడదిరా
అన్ని రంగాలలోను ఆడవారు ముందుండే కాలమిదిరా
ఆమెలోని జ్ఞానాని బందించి చీకటిలోకి తోయకురా
ఆత్మీయత ,అనురాగాలు ఆమె నేర్పినవేగా
సహనం ,సౌశీల్యం ఆమె తరువాతనేగా
ఆడపిల్ల చదువు ప్రతి కుటుంబానికి అవసరం
ఆడపిల్ల చదువు సమాజ శ్రేయస్సుకే చైతన్య రధం
కాబట్టి ఆడపిల్లను చదివించండి .. ప్రోత్సహించండి 

- //గరిమెళ్ళ గమనాలు // 09. 10. 2014//
మన తెలుగు మన సంస్కృతి చిత్ర  కవిత పోటీ కోసం


Sunday 5 October 2014

కవిత నెం53:మన చేతిలో పర్యావ ''రణం''

కవిత నెం :53

*** మన చేతిలో పర్యావ ''రణం'' ****
ఓ మనిషీ ఆలోచించు నీ అవసరతను అన్వేషించి 

వరమైన ప్రకృతినే పదిలంగా మలుచుకొంటూ 
పర్యావరణం - అది పంచ భూతాల సమ్మేళనం 
పర్యావరణం - అది సహజ వనరుల నిక్షేపం 
చేయకురా కలుషితం అది చూడలేని  వికృతం 
పెంచకురా  కాలుష్యం అది నీ పాలిట విషం
చెట్టు ఉన్ననాడు అది నీకు ఇచ్చే గూడు 
ప్రాణవాయువును పంచి అది నీ ఊపిరికే తోడు 
నీటి కొరత చూడు అది భూమాతకే  చేదు 
నీరు ఉంటేనేగా కూడు పండే దండుగా 
రణగొణమను ధ్వనులతో చెయ్యకు యుద్ధం 
ఆ ధ్వనుల ఆక్రోశం మన పాలిట అనారోగ్యం 
పుడమితల్లి పసిడి కాంతులను బూడిద చేస్తూ 
వ్యర్దాలను పుట్టించే పరిశ్రమలకు పునాదులు వేస్తూ 
శాంతికపోతములైన పావురాలు మనము 
అహింసను సృష్టించే అణు భాంబు కూడా మనము 
ఎటు వెళ్ళిపోతున్నాం విమానా రెక్కలతో మనము 
విష క్రోరల ఉష్ణమునే మనలో విలీనం చేస్తూ 
భావితరాలకు అందించు భవితనే బంగారు దీపంగా 
పాటిస్తూ నీ విధులు ఈ పర్యావరణ సంరక్షకునిగా 

//రాజేంద్ర ప్రసాదు //07. 10. 2014

సాహితీ చిత్ర కవితల పోటీ కోసం  






Wednesday 1 October 2014

కవిత నెం52:ఓ బాపు......

కవిత నెం :52

ఓ బాపు .... వస్తావా మా కోసం 
*************************
ఓ బాపు మహాత్ముడా ..... మహానీయుడా 
నీలా ఉండటం ఈ రోజుల్లో ఎవరి తరమయా 
సత్యమన్నావు ... ఏది సత్యమో తెలియలేకున్నది 
నిజం  చెప్పే దైర్యం గాని ,అవసరం కాని ఎవరికున్నది?
అహింసా అన్నావ్ ... హింస లేకుండా మా బ్రతుకులేవి 
ఒక చెంప మీద  కొడితే ఇంకొక చెంప ఊరుకుంటుందా ?
 సావధానంగా చెబితే వినేది ఎవరు ?
సామరస్యంగా చర్చించుకునేది ఎందరు?
అర్దరాత్రి ఆడ పిల్ల నడిచిన రోజే స్వాతంత్రం అన్నావు 
నేటి ఆడ పిల్లల జీవితాలకు నూరేళ్ళు ఉన్నాయా బాపు ?
అన్ని చోట్లా నీ పేరు వాడుకుంటారు 
కరెన్సీ నోట్ల మీద నీ ప్రతిమ లేకుంటే చెల్లదు 
నీ ఆదర్శాలను పాటించేది ఎందరు ?
డబ్బుకోసం చేసే దురాగతాలు చూడు బాపు నేడు 
మమ్ములను  భారతీయులుగా ,స్వేచ్చా జీవులుగా చేసావు  
ఆ స్వేచ్చా స్వాతంత్రాన్ని స్వలాభాలకు వాడుకొంటున్నారు నేడు 
మంచి అనే వేషంతో ముసుగు కప్పుకుని మృగాలు అవుతున్నారు 
అన్యాయాలు ,అక్రమాలకు ఎదురుతిరిగినావు 
నేడు న్యాయ దేవతకే కళ్ళు కప్పి వికృత పనులు చేస్తున్నారు
శత్రువుల్ని మార్చటానికి ధర్మ యాగాన్ని నీవు నమ్ముకుంటే 
నేడు ఒకరిని ఒకరు చంపుకోవటానికి రుధిర యాగం చేస్తున్నారు 
తలయెత్తి జీవించు తెలుగోడా అనే స్థాయికి  నీవు తీసుకెళ్తే 
కుల మత ప్రాంతాల కోసం కుమ్ముకునే  స్థాయికి నేడు ఎదిగారు 
నీ బోసి నవ్వులను తిరిగి అందించేది ఎవ్వరు ?
నీ అంగిలను సైతం లాక్కొనే కటిక పేదరికం మాది 
సత్యమేవ జయతే అనే నినాదం చదువుల వరకే 
అబద్దపు ప్రమాణాలు ఈ తరం వారికి అలవాటే 
విదేశీ వస్త్ర బహిష్కరణ వంట బడింది ఎవరికీ 
స్వదేశీ వస్తాలంకరణలో సాంప్రదాయం ఎగదుడుపే 
భూమి రోదిస్తున్నదయ్యా పాపభారం మోయలేక 
ప్రకృతి ప్రళయిస్తున్నది మానవత్వం జాడ లేక 
అవినీతిపరుల ఆస్తుల మూతలు - అన్నార్తల ఆకలి చావులు 
బడా బాబుల రాచలీలలు - బక్కోడికి మారని తలరాతలు 
సనాతన ధర్మం -శాంతి మార్గాలు నీ చేతి కర్ర వరకే 
ఈ కర్మ భూమిలో నువ్వు తెచ్చిన స్వరాజ్యం పడిగాపే 
నీవు తెచ్చిన స్వాతంత్రం కేలండర్ కే పరిమితం 
మరలా జన్మిస్తావా  బాపు ... నీ జన్మభూమి కోసం 
స్వతంత్రంలో ఉన్న తంత్రాన్ని మార్చటం కోసం 
నిస్సహాయత తో నిలుచున్న నీ రామ రాజ్యం కోసం 

//గరిమెళ్ళ గమనాలు // 02. 10. 2014 //









కవిత నెం51:ఒక మైలు రాయిని నేను

కవిత నెం :51

ఒక మైలు రాయిని నేను
******************

ఒక మైలు రాయిని నేను 
నా  ప్రయాణంలో
కాని కదిలే మైలు రాయిని నేను
నా ఎదురుబాటలో
ఇది నిజమా  ? భ్రమయా ? అనే ఊహ కాసేపు
ఇది అవునా ? కాదా ? అనే యోచన మరి సేపు
ఏది తప్పో ఏది ఒప్పో అనే స్నిగ్దత  కాసేపు
ఏది తత్వం ? ఏది వేదం ? అనే సంశయం మరి సేపు
ముళ్ళ బాటలో
మెత్తని పువ్వుల తోటలో
తెలిసి తెలియకున్నట్లు సాగుచున్న
నా అంతరంగం ఇచ్చే జావాబు ద్వారాల వెనుక
ఏ  అంతర్యామి లేని ఈ స్వామీ నన్ను
కనుగొంటాడా అని
అలుపు లేని మలుపుల వేకువ
నిచ్చెనతో నడుస్తున్న
తెలిసి తెలియకనే
ప్రశ్నల వర్షాలు
నా హృదయవాకిట
ఆనందాక్షింతలు
నా మనసు తోటన  నా అడుగు
అభిమన్యుడిగానే సాగుచున్నది
ఒక్క అడుగుతోనే కాస్త ముందుకు
వెనుక తిరగని విక్రమార్కుడుని కాను
సొమ్మసిల్లని  ధర్మరాజుని కాను
పెను తలంపుల పెమ్మట
పెను తుఫాను జోరిట
ప్రేక్షకుడిలా నా పాదం
కదిలేనుగా  ఓ పద కవితలా
ఓ చిన్ని తత్వమున్న
ఓ మరమనిషినే నేనిలా

!!!!!!!!!!!!!!!!!
//గరిమెళ్ళ గమనాలు //02. 10. 2014