Thursday 28 June 2018

కవిత నెం :322(నా జ్ఞాపకం)

కవిత నెం :322
* నా జ్ఞాపకం *

పుస్తకంలోని కొన్ని పేజీలు తిరగేస్తుంటే
ఆ పేజీల మాటున ఒక ఫోటో (చిత్రం)
అమాంతం గాలికి ఎగిరి
నా ఎదపై వచ్చి వాలింది

దాన్ని తిప్పి చూస్తే నీ రూపం
ఆ రూపం ఎప్పటికైనా అపురూపమే
అది చూసిన నేను కాసేపు విస్మయంలో
మరికాసేపు ఆనంద క్షణాల ఊడలలో
నెమరువేసుకుంటున్నా నీ జ్ఞాపకాల వలపులనీ
నిగ్రహించుకుంటూ నేటి నేనున్న పరిస్థితినీ

అవి ఎలా ఉన్నాయంటే సుమీ !
కొన్ని కుసుమాల పరిమాళాల గంధంలా
కొన్ని వెన్నెల కాంతుల ఆమని గ్రంధంలా
ఎండమావుల వర్షపు నీటి చినుకుల్లా
ఎడారిదారుల మధ్య ఇసుకతుఫానులా
ఎప్పుడో చెప్పుకున్న సంగతులు జ్ఞాపకం
నా ఎదురుగా నీవున్నట్టే కల ఓ జ్ఞాపకం
నీ అడుగుల గుర్తులను వెంటాడిన జ్ఞాపకం
నీ ఊపిరి శబ్దాలను కొలిచిన జ్ఞాపకం

ఇన్ని రోజులు ఏమయ్యావు
ఎందుకిలా ఈ పుస్తకంలో దాక్కున్నావు
నిన్ను విడిచిన నేను నిన్ను మరిచిపోవాలనా
నిన్ను మరిచానో లేదో అని తొంగి చూడాలనా
ప్రణయ విరహంతో పావులమయిన మనము
జీవన ప్రయాణంలో రెండు నావలమయ్యాము

చూసావా నిన్ను చెలీ అనాలా ఇది కలీ అనాలా
తెలియనే తెలియట్లేదు ఇన్నాళ్ల తర్వాత
నీతో గడిపిన ప్రతీ క్షణాలన్నీ
ఒక్కసారిగా నా ముందు ఫ్లాష్ బ్యాక్ రింగ్ లా
నువ్వు నాతో పలికిన ప్రతీ మాటలన్నీ
నా చెవులలో ఏవో వేద మంత్రాలుగా
అల్లరి చేద్దామని వచ్చావా ?
నన్ను హత్తుకుని ఏడుద్దామని వచ్చావా?

నిన్ను చూడగానే మరీ
గుండెలోతుల్లోంచి భావాలు
ఊటబావిలోనుంచి ఊరుతున్నట్టుగా
ఒక్కసారిగా వెనక్కి తగ్గిన సముద్రపు అల
ఎంతో వేగంతో ముందుకు విరుచుకుపడ్డట్టుగా
నాలో తుఫాన్ ని సృష్టించింది నీ జ్ఞాపకం
నన్ను నేనే మై మరచిపోయేంత జ్ఞాపకం

ఎన్ని జ్ఞాపకాలు నా మదిలో ఉన్నా
నాతో నీవున్నావనేదే అతి పెద్ద జ్ఞాపకం
నిన్ను ప్రేమించినా ,నిన్ను విడిచినా
ఎప్పటికీ నువ్వంటే నాకు ఏదో వ్యాపకం












Saturday 2 June 2018

కవిత నెం :321(మౌనం చెప్పే మాట

కవిత నెం :321
* మౌనం చెప్పే మాట *

మన చుట్టూ ఉన్న వారి నడవడి
సక్రమంగా లేనప్పుడు
వ్యంగంలో వక్రమార్గంలో పోతున్నప్పుడు
మన మనసు స్పందన
అందంగా లేనప్పుడు
కళావిహీనమైన మనుషుల మధ్య
చిన్ని స్థానం స్నేహానికి నోచుకోనప్పుడు
అప్రశాంతని అద్దం ముందుంచి
ప్రశాంతమైన చిరునవ్వుని చిందించ లేదు
ఎందుకో నచ్చవు కొన్ని మనసుకి
మనమెంత నచ్చ చెబుదామనుకున్నా
తన సేచ్ఛను తను నిర్మించుకునే
సౌలభ్యంలో,లాబోపేక్షణ కోరుకోలేదు
కూసింత కాలక్షేపం కోసం
అశాశ్వతమైన ఈ జీవన పయనంలో
మరికాసేపు ఏదో కాలయాపన కొనసాగిస్తూ
సమూహాలు నిర్మించుకునివాటి మధ్యే
గిరిగీసుకుని ఉండే కౌరవులని చూస్తుంటే
ఈ మనసు అభిమన్యుడిలా పద్మవ్యూహంలో
వీక్షించటం తప్ప ,యుద్ధం చెయ్యలేదు