Thursday 28 May 2015

కవిత నెం 157:మండే సూరీడు

కవిత నెం : 157

మండే సూరీడు 

భగభగమంటూ ,ఎర్రటినిప్పై మండుతూఉంటాడు 

సెగలనుకక్కుతూ,  ప్రపంచానికే వెలుతురునిస్తాడు 
ఉదయంలా వచ్చి , ఉషాకిరణమై మెరుస్తూఉంటాడు 
సమస్తలోకాలకు సారదై , సప్తఅశ్వాలపై స్వారీచేస్తాడు 
చీకటిని త్యజించి , అంధకారాన్ని పోగొట్టే ప్రభాకరుడు 
అందరికీ ఆరాధ్యదైవం , ప్రతి రోజూ వారితోనే గమనం 
గ్రహమండలాలకు అధిపతియై , సంచరిస్తుంటాడు 
బ్రతుకు నిచ్చేది  సూరీడు , భష్మం చేసేది సూరీడు 
ఆయన రూపం ''వృత్తాకారం '' , ఆయన తేజం ''ఉష్ణం ''
కరుణిస్తే కారుణ్యం చూపి ,ఆరుణోదయాన్ని చూపుతాడు 
ఆగ్రహిస్తే అగ్నిజ్వాలలు విసిరి ,అతలాకుతలం చేస్తాడు 
మన  స్వార్ధపు చర్యలతో ,సూర్యతాపానికి బలవుతున్నాం 
పచ్చదనాన్ని పెకిలించి ,ఉష్ణతీవ్రతను పెంచుకుంటున్నాం 
కాలుష్యాన్ని సృష్టించి , సూర్యునికి మండేలా చేస్తున్నాం 
వడగాలులు , వడదెబ్బలతో ,వడబడిపోతున్నాం 
భయంకరంగా ఉష్ణంతో ,రగిలిపోతున్నాడు సూరీడు 
ఆదర్శవంతుడైన ఆదిత్యుడు , దిశను తప్పుతున్నాడు 
ఎప్పటికీ చల్లారును తన మనస్సు చలించి ,శాంతించి 
మానవ తప్పిదములతో జరిగిన అపరాధమును మన్నించి 




Monday 25 May 2015

కవిత నెం156:నా అభీష్టం

కవిత నెం : 156

నేను మాటలే కాని చేతలకి చొరవ చూపే వాడిని కాను 
నేస్తం నా జీవితపయనం ఇక  కాబోదు  నా సన్నిహితం 
నా ప్రాణ ప్రపంచం నా కలల మందిరం 
ఒక దేవత గుడివుండగా నా గుండెలో 
ఎందుకు ఆడాలి నేను గుడు గుడు గుంచం 
నా జ్ఞాపకం నాతొ ఉండగా ఎందుకు నాకు మరోప్రపంచం 
వేకువ చూస్తుంది తన రూపాన్ని
ప్రతి వాకిలి పిలుస్తుంది ఆమె పాదాన్ని 
నా మనసు కోరుతుంది ఆమె పరువాన్ని
మా ప్రేమ ప్రణయాన్ని 
నెలవంకకు తెలుసు తన కురుల అరవిందం 
హరివిల్లుకు తెలుసు తన సోయగాలమకరందం 
పున్నమికి తెలుసు తన పువ్వుల చందన పరిమళం 
అలా చూడు ఆలోకం అందంగా ఉంటుందా నా చెలి కన్నా 
అలా చూడు ఏమైనా ఉంటుందా నా చెలి నవ్వు కన్నా 
అలా చూడు ఎటువైపైనా ఉంటుందా నా చెలి జాడ కన్నా 
ఇవన్నీ ఉండగా 
నేనెందుకు నేస్తం నడవాలి నీ వెంట
ఇదంతా ఉండగా 
నేనెందుకు చూడాలి మరో నయనం 
అప్పటికి ,ఇప్పటికి ,మరెప్పటికీ 
కదా తనే నా సర్వస్వం 
అదే నా అభీష్టం 
నా చెలి మధుర భింద  బావం

!!!!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

కవిత నెం155:అంతరంగసరాగాలు

కవిత నెం : 155

ఎన్నో పరిచయాలు వాటితో ఎన్నెన్నో ప్రయాణాలు 
మెలివేసుకునే స్నేహ సాంగత్యాలు ,
ఆ స్వర రాగం లోనుంచి పుట్టే హావ భావాలు,
అంతరంగ అబిరుచుల సరాగాలు,
అందుకునే ఆమనీ అందసోయగాలు ,
ఆహ్లాదబరిత రూపాలు ,మనసును లాలించే మనసు ఉల్లాస ఉద్యానవనాలు. వాటితోటి సాగే మన జీవనవిదాన విహార వినోద వెండితెర మబ్బుల పల్లకి రాగ మయూరి రసరమ్య బంధాలు 
పరిచయాలు పాపం కాదు వాటికేవి అడ్డు కాదు .
పరిచయాలు మన జీవన విదానాలు .
పరిచయాలు మన స్నేహబంధ సుపరినామాలు
సాగించు ఓ నేస్తం నీ జీవితాన్ని పరిచయమనే పల్లకిలో
తీర్చిదిద్దుకో నేస్తం నీ జీవన విదానాన్ని పరిచయమనే సంగములో
................................

కవిత నెం154:మనతో మండిన గ్రీష్మం

కవిత నెం :154

మనతో మండిన  గ్రీష్మం 

గుండెలు  అదిరిపడేలా ఎండలు మండిపోతున్నాయి
దప్పికను తీర్చే నీరు దాహాన్ని తీర్చనంటున్నాయి
అదికమవుతూ ఉష్ణం ఊపిరిని ఆపేస్తున్నాయి
మన అడుగులు ముందుకెల్లకుండా అదిరిపడుతున్నాయి
ఏ మూలన ఉన్నా సూర్యరశ్మి మాడుకెక్కుతుంది
ఏ .సి లు ,కూలర్లు కూడా సూర్యుని స్పర్శకు చతికిలపడ్డాయి
పచ్చదనం  లేక భూమాత వేడికి బోరుమంటుంది
ఎటుచూసినా ఈ సమస్యకు మార్గం ఉంటుందా ?
ఎవరువచ్చినా ఈ వేసవిని వెన్నెలగా మార్చగలరా ?
ఎవరో చేసుకున్న కర్మ  కాదు మది ఇది మనకు రాసుకున్న తలరాత
స్వార్ధం పెరిగి మన వనరులను మనమే దోపిడీ చేసుకుంటున్నాం
పచ్చదనానికి  పసుపుకొమ్ము కట్టి నరికేసుకుంటున్నాం
చెరువులను మూసివేసి ,బిల్దింగులను కట్టుకుంటున్నాం
భూమిలో నిల్వ ఉన్న నీటినితోడి వ్యాపారం చేస్తున్నాం
లేని పోనీ కాలుష్యాలను సృష్టించి ఓజోన్ పొరను తగలబెడుతున్నాం
ఔషధప్రాయమైన నీటికి బదులు కృత్రిమ రాసాయనాలకు అలవాటుపడుతున్నాం
రాను రాను ఎండ తీవ్రత పెరుగుతూ మన మాడు పగలగొడుతుంది
వేసవి తాపానికి తట్టుకోలేక వడబడిపోతున్నాము 
ఎంతో జాగ్రత్త తీసుకుంటే గాని ఈ వేసవి విడిది ని తట్టుకోలేని పరిస్తితి నేడు 
పిల్లల నుంచి పెద్దల దాకా నీరసించే వారు ఎంతమందో ?
ప్రతి రోజూ పేపర్లో ఏదో ఒక చోట మరణసంఖ్యలు ఎన్నో ?
ఆలోచించండి మనం ఎలా మరలా మన తలరాతలు రాసుకోవచ్చో 
మార్పు ఒకేసారి మంచి పని తేలేదు . మొదటి మంచి పని మన చేతిలో లేదంటారా ?
సూర్యుడు మారడు , ఈ ఎండలు మారవు 
మారాల్సింది మనమే 
మార్చాల్సింది మరొకరిని మనమే 
నీటిని అదుపుగా వాడండి 
ప్రతి ఒక్కరు ఒక మొక్కనైనా పెంచండి 
చల్లటి నీరుని కాకుండా ,కుండనీటికి అలవాటు పడండి 
మీ దినచర్యలో నీరుని  ఎక్కువగా త్రాగండి ,త్రాగించండి 






Friday 22 May 2015

కవిత నెం153:ప్రశ్న

కవిత నెం :153
ప్రశ్న 

ఆదినుంచి ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి 

మనలో మనకి కలిగిన సందేహాల హారం ''ప్రశ్న ''
ఏదో తెలుసుకోవాలని మెదిలే కుతూహలం ''ప్రశ్న ''
ఒకరి గురించి ఒకరికి  పరిచయం కావాలంటే ఎవరు నువ్వు అనే ''ప్రశ్న ''
మనం విన్నది అర్ధంకాలేదంటే ఏమిటి అనే ''ప్రశ్న''
ఒక సంఘటన గురించి ప్రస్తావన వస్తే ఎందుకు అనే ''ప్రశ్న ''
ఇలా చెప్పుకుంటూ పొతే ''ప్రశ్న '' అనేది పలుమార్లు పుడుతూనే ఉంటుంది 
జావాబుకు అంతం అంటూ ఉంటుందేమో కాని ''ప్రశ్న '' కి ఆరంభం మాత్రం రొటీనే 
మన జననం నుంచి మరణం దాకా ''ప్రశ్న'' తోనే ప్రస్థానం కొనసాగుతుంది 
చిన్న చిన్న విషయాలలో నుంచి పెద్ద పెద్ద మూలాల దాకా ''ప్రశ్న '' కావాల్సిందే 
అదంతా ఎందుకు దేవుడు ఉన్నాడా అన్నది ఒక ''ప్రశ్న ''
ఈ సృష్టి ఎలా ఆరంభమయ్యింది అన్నది ఒక ''ప్రశ్న ''
అంతెందుకు ?
మనం డిగ్రీలు సంపాదించాలంటే ''ప్రశ్న '' ను  తృప్తి పరచాలి 
మనం ఉద్యోగాలు పొందాలంటే ''ప్రశ్న '' కు బదులివ్వాలి 
మన ప్రయాణం మొదలయ్యింది అంటే ''ఎక్కడికి '' అనే ప్రశ్న పిలవాల్సిందే 
మన చుట్టాలని ,స్నేహితులని కలుసుకున్నప్పుడు ''ఎలా ఉన్నారు '' అనే ప్రశ్న కుశలమడగాల్సిందే 
మనమే ఒక ప్రశ్న , మనిషి జీవితం ఒక ప్రశ్న 
మన చుట్టూ ఉండేది ప్రశ్న , మనసంతా తిరిగేది ప్రశ్న 
ఈరోజు ఏమి చెయ్యాలి అన్నది ఒక ''ప్రశ్న ''
రేపటి రోజు  మనం ఏమిటన్నది ఒక ''ప్రశ్న ''
మనకి మనమే ప్రశ్నలు వేసుకుంటూనే ఉంటాం మనకు తెలియకుండానే 
మనసులో ఒకటి ఉంటుంది అడగాలని మరొకటి అంటుంది అదే ''ప్రశ్న ''
మన జీవితంలో మనకు మనం ప్రశ్న వేసుకోకుంటే - రేపటి మన జీవితం ఒక ''ప్రశ్న '' లానే ఉంటుంది 
అవసరం ఉన్న ''ప్రశ్న '' లు కొన్నయితే 
అనవసరంగా విసుగు తెప్పించే  ''ప్రశ్న '' లు మరికొన్ని 
''ప్రశ్నలు '' లేకుండా కొన్ని కొన్ని చోట్లా పనులే జరుగవు 
''ప్రశ్న '' వేసే వారు లేకపోతే కొంతమంది పనులే చెయ్యరు 
''ప్రశ్న '' వేస్తె మరికొందరికి నచ్చనే నచ్చదు 
ఒకరికి ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకూడదని బాధ్యతగా మెలిగేవారు లేకపోలేదు 
ప్రశ్న ఒకరికి భయం అయితే మరొకరిది ఆయుధం ,ఆహ్లాదం 
ప్రశ్న మనకు ఉపకారం చేస్తుంది ... హానికరమూ చేస్తుంది 










Thursday 21 May 2015

కవిత నెం152:కవి అంటే ఎవడు ?(నేటి కాలంలో )

కవిత నెం :147

కవి అంటే ఎవడు ?
(నేటి కాలంలో )

తెల్ల చొక్కా ధరియించే వాడా !
మాసిన గడ్డం కల్గిన వాడా !
పదిమందిలో సాహిత్యం మాట్లాడేవాడా ! 
పలుగిరిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడా !
వందలు ,వేల సంఖ్యలో రచనలు చేసినవాడా ! 
పుస్తకాలతో జీవితం చదవగలిగేవాడా !
పత్రికలలో , వార్తలలో ప్రచారానికెక్కినవాడా ! 
తన రచనలను పుస్తకాలుగా విడుదలచేయువాడా !
ఏదైనా సంస్థలలో ముఖ్యపాత్ర వహించువాడా !
ఫేస్ బుక్ లలో కొన్ని సమూహాలకు నిర్వాహకుడా  ! 
ఎన్నో అవార్డులను ,జ్ఞాపికలను సంపాదించినవాడా !
కాపీ పేస్ట్ లతో కవిత్వాలను సృష్టించువాడా !

(ఇది ఎవ్వరినీ ఉద్దేశించింది కాదు )

Tuesday 19 May 2015

కవిత నెం 151:ఎందుకంత చిన్న చూపు ?

కవిత నెం : 151

ఎందుకంత చిన్న చూపు  ?

(ఇది ఎవ్వరిని ఉద్దేశించింది కాదు )

ఎందుకంత చిన్న చూపు  ?
మనుషులంటే , మమతలంటే 
ఎందుకంత చిన్న చూపు ?
నీతి అంటే , నిజము అంటే 
ఎందుకంత చిన్న చూపు ?
స్నేహమంటే , ఏకమైతే 
ఎందుకంత చిన్న చూపు ?
నవ్వు అంటే , నవ్వుతుంటే 
ఎందుకంత చిన్న చూపు ?
వెలుగు అంటే , వెలుగుతుంటే 
ఎందుకంత చిన్న చూపు ?
బాగు అంటే , బాగుపడితే 
ఎందుకంత చిన్న చూపు ?
మంచి అంటే , మంచి చేస్తే 
ఎందుకంత చిన్న చూపు ?
దైర్యమంటే ,అది దండుగుంటే 
ఎందుకంత చిన్న చూపు ?
ప్రతిభ ఉంటే ,అది పైకి వస్తే 
ఎందుకంత చిన్న చూపు ?
ప్రేమంటే ,ప్రేమిస్తుంటే 
ఎందుకంత చిన్న చూపు ?
ఎవ్వరంటే , నీకు ఎదురొస్తే 



Wednesday 13 May 2015

కవిత నెం150:హనుమాన్ జయంతి


కవిత నెం :150
హనుమాన్ జయంతి

"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం. 
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు
ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం
ఎంతటి ఉపద్రవాల నుండైనా కాపాడే ఆపద్బాందవుడు 
కలలో కలవరించినా చాలు ,చింతను పోగొట్టే కరుణామూర్తి . 
అయన నామస్మరణ చాలు సర్వ దుఃఖ పరిహారం 
ఆయన మనసు మానవ సరోవరం 
ఆయన తేజస్సు హిమాలయం 
ఆయన రూపం భజే రుద్రరూపం 
ఆయన శౌర్యం ప్రభాదివ్యకావ్యం 
విజయాన్ని కలిగించే వీరాంజనేయుడు 
పిలిస్తే పలికే ప్రసన్నాంజనేయుడు 
అనంత శక్తి కలిగి యున్నవాడు ఆంజనేయుడు 
మరణాన్ని గెలిచిన సంజీవుడు ,చిరంజీవుడు 
నమ్మిన చాలు నీడలా తోడుండువాడు 

శ్రీరామునికి నమ్మిన బంటు ,మహా భక్తుడు 
నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. 
అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది. 

ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము. ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది.

Friday 8 May 2015

కవిత నెం149:చరఖా

కవిత నెం :149

చరఖా

భారత స్వాతంత్రోద్యమంలో  మేటి రధసారధి
మువ్వన్నెల జెండాలో రూపుదిద్దబడిన తొలిచిహ్నం
చేనేత కళాకారులకు వారసత్వపు కల్పవృక్షం
స్వదేశీ వస్త్ర సంరక్షణకు  గాంధీ వాడిన ఆయుధం
విదేశీ వస్త్ర బహిష్కరణలో వినియోగించిన యంత్రం
ప్రాచీన వస్తు సంప్రదాయాలకు నిలువెత్తు రూపం
ఖద్దరు బట్టల రూపకల్పనకు మూలమైన రాట్నం
చేనేత సామాజిక వర్గానికి ఇది జీవనాధారం  
స్వయం సమృద్దికి ,సవాళ్ళను అధిగమించే  దైర్యంకి 
అనునిత్యం పనిచేస్తూ ఉండే చరఖానే ఒక స్పూర్తి 
బారతీయ సంస్కృతికి చరఖాతో అనుబంధం 
విడదీయలేని దేశాభిమాన ఆత్మీయబంధం 
కాలానుగమనంలో అదృశ్యమవుతున్న వైనం 
నేటి తరం వాళ్ళకు చరఖా అంటే తెలియనితనం 
చూసి నేర్చుకోవాల్సింది మన చరఖా నుంచి 
మన స్వదేశీ సరుకు లో దాగి ఉన్న ఖుషి 
దేశ కీర్తిని పెంచటంలో చరఖా యొక్క కృషి
మరువకండి ,మరువనీయకండి 
స్వదేశాన్ని ప్రేమించండి - స్వాభిమానాన్ని కాపాడండి