Saturday, 28 January 2017

కవిత నెం263:మేలుకో నవతేజమా

కవిత నెం :263

మేలుకో నవతేజమా

సమాజం పిలుస్తుంది రా – కదలిరా,
నవసమాజం పిలుస్తుంది రా – కదలిరా.
గుర్రుపెట్టి నిద్రపోతే ఏముంటుందురా?
కలం పట్టి గళం పాడే చోటుందిరా.

నాలుగు గోడల మధ్య ఏముందురా?
నలుగురితో కలసి చూడు రా – కదలిరా.
నవ్వుకుంటూ, తిట్టుకుంటూ ఎంతకాలంరా?
నిజమేంటో నీ సిరాతో రాసి చూడరా.

నీ సుఖం, నీ పక్షం ఎంతసేపురా?
ఎదుటివారి బాగుకోసం రా – కదలిరా.
న్యాయ–అన్యాయాల గుణింతమేలురా?
ఎదిరించే గుండె చాలు రా – కదలిరా.

కడుపులో కుళ్లు దాచుకుని కంపుకాకురా,
ఈ సమాజపు కుళ్లు–కంపు పెకలిద్దాం రా.
ఉడుకు నెత్తురుంటే చాలు, ఏమంటావురా?
ఉడుములా ఉరకలేసి ఆగిపోకురా.

“నీకెందుకు?” అనుకుని ఆగిపోకురా,
నీ ఒక్క ప్రశ్నతోనైనా ప్రశ్నిద్దాం రా.
అడుగులకు మడుగులెత్తే ఖర్మ ఏలరా
గొఱ్ఱెలా మందలో వలస ఎందుకురా?

ఎక్కడైనా రాజీపడని తత్వమేలురా,
అమాయకులపై నీ వెర్రి కేకలు చాలురా.
నీ సమాజం కోసం ఎక్కడా రాజీ పడకురా,
నీ ఆవేశం ఆలోచనతో ఆవిర్భవించరా.

నీ ఇల్లు, నీ కుటుంబం ఒక్కటే సొంతం కాదురా,
నీ సమాజం, నీ దేశం అని మరువకురా.
ఏవో నీతులు చెప్పి చల్లారిపోకురా,
నువ్వు తెలుగువాడివని ఎన్నటికీ మరువకురా.


- 31.01. 2017
గరిమెళ్ళ గమనాలు
























0 comments:

Post a Comment