Tuesday 3 January 2017

కవిత నెం 250 :గత సంవత్సరపు -జ్ఞాపకాలు

కవిత నెం :250

గత సంవత్సరపు -జ్ఞాపకాలు

కొన్ని సంఘటనలు గుర్తుండేవి  గుర్తుండి పోయేవి
కొన్ని వాస్తవాలు  కదిలించేవి కదిలించి చంపేవి

ప్రతీ మనిషికి విజయం - పరాజయం తప్పదు
ప్రతీ మనిషికి అవమానం - అపమానం అనుభవం తప్పదు

మంచితో పాటు చెడు కూడా వస్తుంది
కష్టం వెమ్మటే సుఖం దాగుంటుంది

ఎంత వేదన చెందినానో అంత ఆనందం పొందినాను
ఎంత అభిమానం పొందినానో అంత అవమానింపబడినాను

జీవితం అంటే బరువు ,బాధ్యతలతో పాటు సర్దుబాటు ఉండాలని
జీవితం అంటే కాయ , కష్టం లతో పాటు కళాపోషణం ఉండాలని

తెలిసింది పాతదే కానీ ఆచరణ కొత్తగా అనిపించింది
అయిన వారు కాని వారై విషాలు కక్కుతుంటే
ఏమీ కాని వారు ఆత్మీయులుగా మారి పలకరించారు
వారి ప్రేమకు నేను సదా నేను బానిసని   ........

రాజకీయాలు బయట చూస్తుంటాం కాని
వారి ఎదుగుదలకి మనల్నే ఒక పావులాగా వాడుకుని
మనపైనే రాజకీయ అస్త్ర ప్రయోగం చేయించుకున్నాను

నా నవ్వు అందరికీ తెలుసు .... నా చుట్టూ ఉన్నవారి సంతోషం కోరుకున్నా
నా కోపం మాత్రం కొందరికే తెలుసు కాని అది నన్నే దహించేస్తుంది కానీ మరలా బ్రతికాను 

ఎండమావులు చూసాను కానీ నా జీవితంలో పొందే ఫలం చేజార్చుకుని తెలుసుకున్నాను 
గౌరవించాను గౌరవింపబడ్డాను పాము నిచ్చెన లో పాము కాటుకు బలయ్యాను 

తప్పటడుగు వేయలేదు తప్పు అని చెప్పించుకున్నాను 
ఒప్పు చేసిన నాడు ఒక్కడూ వచ్చి అభినందించడు 

పుట్టిన పుట్టుక గుర్తొస్తుంది మన కష్టాలు గుర్తొస్తే 
భవిష్యత్తు వెక్కిరిస్తుంది ఆ కష్టాల కడలిలో ఈది నెగ్గకపోతే

ఎడబాటు చూసాను గ్రహాల పోటు చూసాను 
నాకు నేను సరి చేసుకుని తిరిగి పూల బాట వేసుకున్నాను

గమ్మున నా జీవితం సాగిపోతుంది నేడు 
గత సృతులు నెమరేసుకుంటూ కొత్త ఆశల్ని గుండె లోతుల్లో దాచుకుంటూ 

మారదు ప్రపంచం మారదు ఈ సమాజం 
తనవంతు తనకే స్వార్ధపు రెక్కల్ని కట్టుకుంటూ 

సొంతవారు అనే భావం కాని , జాలి కాని లేని బంధువర్గాలు 
పంతాలకు మాత్రం పుట్టిన ఊరుని , వారి రక్త సంబంధాన్ని కత్తెరతో కత్తిరిస్తారు 

రోడ్డున పడే చెత్త కంటే కడుపులో కుళ్లే పాకుడులా పేరుకునే రోజులివి 
యదార్ధం కన్నా సొల్లు వాగుడికి విలువిచ్చే సీమ టపాకాయలు 

ఏది ఉన్నా , ఎంత ఉన్నా మనోధైర్యం నన్ను ముంచలేదు 
తలతిప్పినా , తలవంచని నా మనో సంకల్పం ఓడిపోలేదు 

పాత ఆశలపై కొబ్బరి చినుకులు పడినా కొత్తగా పాలపుంతలా మారెను 
ఏదో సంశయం వెంటాడుతున్నా నా పై నమ్మకం నాకున్న ఆత్మ స్థైర్యం 

ఇది అందరికీ జరిగేవే కానీ నా గత సంవత్సరంలో నా ........ తో ఆడిన నీడక్రీడలు 

- గరిమెళ్ళ గమనాలు //03. 01. 2017//










0 comments:

Post a Comment