Thursday 19 October 2017

కవిత నెం :308 (పట్నపు సోయగం)

కవిత నెం :308

* పట్నపు సోయగం *

ఇరుకిరుకు నగరాలు
వెనకెనుక బంగ్లాలు
అగ్గిపెట్టె మేడలు
మురికివాడల బ్రతుకులు
ప్రతీ ఇంట మురుగు కంపులు

కాలుష్యపు కిరణాలు
పొగచిచ్చు వాహనాలు
దుమ్ము-దూళితో కూడే రోడ్లు
అడుగడుగునా ట్రాఫిక్ సిగ్నల్లు

ఎవరికెవరు ఏమీ పట్టదు
ఏ బంధమూ ఆగమనీ చెప్పదు
ఉరుకూ-పరుగుల జీవితాలు
మంచీ చెడూ ఉండనీ పలుకులు

ప్రతీ క్షణమూ చిత్రము
ప్రతీ సెకనూ పైకము
ప్రేమలేని తత్వాలు
మనసు లేని మనుషులు

పండుగకు ,పబ్బాలకు తీనుమారులే
ప్రతీ ఇంటా చందాల దందాలులే
నీకున్న అవసరం వారికి ఆసరా
ఏ చిన్న సాయం దొరకదూ ఇక్కడ

గాలి వానలకు ఎగిరే విధ్యుత్తు
నీరుగాన రాని బోరుభావులు
గుర్తొస్తాయి నీకు ఇంకుడుగుంటలు
చెట్టులనీ మాయం - స్వచ్చగాలి గాయం

పరిశ్రమలు ,శ్మశానాలు పక్కపక్కనే
ఏ చిన్నభూమి ఖాళీ ఉందా అది కబ్జానే
రేపులకు ,దోపిడీకి ఇది దుకాణే
పోలీసోల్లు ఉన్నా అది ఖాతరే

నీకు నోరు ఉందా అది ముయ్యాలే
సలహాలు ఇస్తావా -పక్క కెళ్లాలే
ఆత్మీయత అంటావా -అది మన ఇంట్లోనే
నీ బ్రతుకు కోసమే - ఈ బరువు ఈడ్చాలే

కవిత నెం : 307(వెధవ జీవితం)

కవిత నెం : 307

* వెధవ జీవితం *

చిన్నప్పుడే హాయిగా ఉంది
కష్టం తెలియదు
తెలిసినా చేయనిచ్చేవాళ్లు లేరు
సుఖం తెలియదు
అందులోనుంచి రానించేవాళ్లు లేరు
దుఃఖం తెలుసు
కానీ బుజ్జగించేవాళ్లు
మనసారా నవ్వేవాళ్లం
మన నవ్వుకోసం ఎన్నో ఎదురుచూపులు
తెలియనితనం ,తుంటరితనం
అమాయకత్వం ,అంతులేని పంతం
కులమంటే తెలియదు
కలసిమెలసి ఉండేవాళ్లం
ఒకరితో ముద్దలు తినిపించుకునేవాళ్లం
ఏ వాకిలి అయినా ఒకటే మనకు
మన ఇంటికి రావటమే మరచే వాళ్లం

ఆకలేస్తే ఏ చేయి అయినా అన్నం పెట్టేది
దాహమేస్తే ఏ గుమ్మమైనా సేదతీర్చేది
నిద్రకు నేల -మంచం తేడా తెలియదు
అలసటకు హాయి - రేయి ఉండదు
పక్కవాడిది లాక్కునే సంస్కృతి తెలియదు
అన్న దమ్ముల మధ్య ఆస్తులు తెలియవు

ఎదుగుతున్న కొద్దీ ఏవో బరువులు
రోజులు మారుతున్న కొద్దీ పెరిగే బాధ్యతలు
ఆనందం ఉంటుంది గ్యారెంటీ లేదు
భాద కల్గుతుంది ఓదార్పు ఉండదు
ఎవరితోనైనా మాట కలుపుదామంటే
అడ్డువచ్చే అహంభావం ఆజ్ఞాపిస్తుంది
మనమే సంపాదించి మనమే ఖర్చు చేస్తుంటే
గుండెలు తరిగేలా బాధనిపిస్తుంది
మన అవసరాల వరకే మనమంటే
పక్కనోడి ఎదుగుదల పోటీ పడమంటుంది

బంధముంటే బలగముండదు
బలగమంటే డబ్బు ఉండదు
డబ్బువుంటే మన శ్శాంతి ఉండదు
అన్నీ ఉన్నా ఇబ్బందే - ఏమీ లేకున్నా ఇబ్బందే

ఒకరిపై ఒకరికి అధికారం కోసం
ఒక వర్గంపై ఇంకొక వర్గం ఆధిపత్యం కోసం
వెంపర్లాటలు , వెక్కిరింపులు
అవమానాలు ,ఆందోళనలు

భయానికి భయపడాలి
ధైర్యానికి తలదించాలి
రాజీపడుతూ జన్మించాలి
రాణింపుఉంటే అణిగివుండాలి

ఏమి ఖర్మరా అనిపిస్తుంది ఒకసారి
ఇదే కర్మఫలం అని గుర్తొస్తుంది మరోసారి
సంతృప్తి లేని జీవితం
ఆశకు హద్దులు లేని జీవనం
మంచీ -చెడు సంఘర్షణల మధ్య
కొట్టుమిట్టాడుతున్న ఈ వెధవ జీవితం

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు















Wednesday 18 October 2017

కవిత నెం :306(ప్రేమ సంకెళ్లు)

కవిత నెం :306


* ప్రేమ సంకెళ్లు *


ప్రతీ ప్రేమ నేడు పంతమే కాదు
తన ప్రేమని కూడా బాధ్యతతో నడుస్తుంది

తాను రాజీ పడుతూ త్యాగాన్ని తెరలా అడ్డం పెడుతుంది
ఒక పక్క మనసు కృంగదీస్తున్నా మౌనంగా నవ్వుతుంది

కన్నవారి కలల కోసం వీరి సౌధాల్ని చెరిపేసుకుంటుంది
ఆత్మబలంతో ముందుకుపోతూ అంతరంగాన్ని అద్దంలో చూసుకుంటుంది

ప్రేమ పేరుతో అవసరాలు ,వంచనలు ,వాంఛలు తీర్చుకునే వారున్నా
నిజాయితీగా శారీరక సుఖానికి లోబడక ,ఆరాధనతో ఎదురుచూస్తుంది

ఎక్కడున్నా ,ఎలాగున్నా -తన వారు పక్కనున్నా ,లేకున్నా
తన జీవితం తన చేతుల్లో లేకున్నా సమస్తం తన హృదయమే

విడిపోయి వరాన్ని పొందినా -వేధింపులు ఎదురయినా
మనసు తన సానిహిత్యం కోరుకుంటున్నా ,మనో స్థైర్యం తగ్గుతున్నా

తన యొక్క విది రాతకు తల వంచి బ్రతుకుతుందే తప్ప
స్వార్ధపూరిత పరిమళాలు పూసుకుని తిరగాలనుకోదు

కానీ ఓ కాలమా నీవే సమాధానం చెప్పు
కలవని మనసులను కలుపుతావు
కలిసిన హృదయాలను విడదీస్తావు

నిజమైన ప్రేమ వృక్షాలులా కాక అడవిలా ఉన్నచోట
వెన్నలను ఎందుకు ఆ ప్రేమకు అందించలేకపోతున్నావు

వెగటు కల్గించే ప్రేమలను చూసి ఉంటా
కాని వేడుకలా కనిపించే ప్రేమజంటలను కూడా చూసా

కానీ పవిత్రమైన ప్రేమను ఎదో పాపం చేసినట్టు
విరహతాపాలతో ,ఒక వైరాగ్యంతో మరో జన్మ వరకు ఎదురుచూడాల్సిందేనా !







కవిత నెం : 305(అత్యుత్సాహ అరంగేట్రం)

కవిత నెం : 305
* అత్యుత్సాహ అరంగేట్రం *

మీ గురించి మీరు ఆలోచించుకోండి
పక్కనోడి శ్రద్ధతో ఆరోగ్యం పాడుచేసుకోకండి

తరాలు మారినా మన తలరాతలు ఇంతేనా
ప్రేమ మంచిదే అతిప్రేమ చూపకండి

గౌరవం ఇవ్వాలనుకుంటే అగౌరవపరచకండి
పొగడాలనుకుంటే దొంగ పొగడ్తలు చేయకండి
మీపై శ్రద్ధ చూపే వారిని నిర్లక్ష్యం చేయకండి

ఎన్నో కలలు కనుంటాం చిన్నప్పటి నుంచి
మనకు జరగనిదో ఒకరికి లభిస్తుందేమో
కుదిరితే ప్రోత్సహించండి లేదా
నిశ్శబ్దం పెను ప్రమాదమేమీ కాదు
మన చెడు పైత్యాన్ని నిగ్రహించుకోగలిగితే

నీవు పోటుగాడివి కావచ్చు
అన్నన్నా నీ ముందు అందరూ తక్కువనే చులకనా !

మనం ఒక సమాజంలో ఉన్నాం
మనమంటేనో , మనముంటేనో అది సమాజం కాదు

ఒకరి కీర్తి ప్రతిష్టలు పెంచినవో, పొందినవో
వాళ్లని కించపరుస్తూ ,మనం వారిని కీర్తించటం ఎందుకు ?

నీ లక్ష సాధనకై కృషించు తప్పులేదు
ఒకరు సాధించిన సంస్ధానాన్ని కృంగనీయకు

మన మాటలో కుదిరితే మమకారం చూయించాలి
వెటకారాలతో వెర్రత్వంగా ప్రవర్తించకూడదు

(ఇది అందరినీ ఉద్దేశించి మాత్రం కాదు - నా భావన మాత్రమే )

Thursday 12 October 2017

కవిత నెం :304(అమ్మ -విలువ)


*అమ్మ -విలువ *
కవిత నెం :304

నువ్వెంత ఎదిగినా 'నాన్నా ' అనే ఓ పిలుపు
నువ్వెంత తిట్టినా మరుక్షణమే కదా లాలింపు

నీ జీవితం కోసం ఆమె సాంగత్యం నీకు మరుపు
తన జీవితభారం నీకు తెలియదు అది కొసమెరుపు

అమృతం రుచి చూసుంటావా ఓ బాపూ
అమ్మ పాలు తాగావే ఏమంటావు చెప్పు

వెళతావు కనపడని దేవుళ్ల గుళ్ల వైపు
కనిపెంచిన దేవతవైపు ఉందా నీ చూపు

ఆహర్నిశలు ఆమె శ్రమ నీకు చిన్న చూపు
ఆస్తులకోసం ఆమె పంపక భారాన్ని ఇక ఆపు

దెబ్బ తగిలితే గుర్తొచ్చేదే అమ్మా అనే పిలుపు
తల్లి మనసు నొప్పిస్తుందని గమనించావా చెప్పు

కష్టమొస్తే తట్టుకోలేని మనసు కదా నీది
నీ సుఖం కోసం ,ఎంత కష్టమైనా భరించే గుణం ఆమెది

పెరిగావని ,పెళ్ళాం తోడుండని వద్దంటున్నావ్ నీ నీడని
పరిపూర్ణమైన ప్రేమత్వాన్ని గ్రహించావా అది అమ్మలోని ఉందని

అమ్మ ఆరాటపడుతుంది నీ ప్రేమ కావాలని
పెళ్ళాం చాడీలు చెప్తుంది మీ అమ్మ ఇలా అందని

ఈ సృష్టిలో కల్తీ లేనిది ఒక్కటే అది అమ్మ ప్రేమ
మరణం లేని మనసుందంటే అది ఒక అమ్మ మనసే

వర్షించనీ అమ్మ ప్రేమను ఆటంకం చూపకుండా
ప్రవహించనీ ఆ ప్రేమ ధారను నీ గుండెల నిండా

- గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్






Sunday 1 October 2017

కవిత నెం :303 (జన్మ రహస్యం)



కవిత నెం :303



* జన్మ రహస్యం *

సంబరమా అంబరమా
శాస్త్రీయత్వమా అస్థిత్వమా
నాగరికమా అనాగరికమా
ఖర్మమా మర్మమా
లోక యుక్తమా లోక కళ్యాణమా

ఎందుకు జననం
ఎందుకు మరణం
జనన మరణాల నడుమ నలిగేదే జీవనం

విదితమా విధిరాతమా
సంకల్పితమా ప్రేరేపితమా

తెలియని ప్రశ్నలు కొన్నైతే
మదిని తొలిచేస్తున్న ప్రశ్నలు  ఎన్నో

వత్సరానికి ఒకసారి వేడుకనా
ఆయుష్షుకు దగ్గరని విచారణకా
ఈ మధ్యస్థమైన ఆలోచన తటస్థమేనా
నిర్మలత్వంలోనుంచి పుట్టిన నిజమేనా

సాధన చేయుట కొరకా
సాధ్యము అనిపించుట కొరకా

అండపిండ  బ్రహ్మాండాలను
ఛేదించుట కొరకా

పుట్టుక ఒక అండ రూపమైన
గిట్టుక పిండ ప్రధానమేగా

అర్థమా పరమార్ధమా
అన్వేషణలో ఆయువు సాగెనా

ఒక ఆనందం జన్మకు కారణమైతే
ఒక వేదన మిడతలా మిట్టాడునా

ఏది ఏమైనా ఈ జన్మకు సాఫల్యం
ఎప్పటికీ అర్ధమవ్వునో కానీ

ఈ జన్మకి ఇలా కానించాలని విదితమే కదా
ఎవ్వరైనా ..... ఏమైనా

* సమాప్తం *


కవిత నెం :302(మాతృత్వపు ధార)

కవిత నెం :302

*మాతృత్వపు ధార *

తాను తల్లి కాబోతున్న
అనే వార్త వినగానే
తన్మయత్వంతో పులకించిపోతుంది
ఆ తల్లి హృదయం

ఎన్నో ఆశలు కళ్లలో దాచుకుని
ఎన్నో ఊసులు తన పొత్తిలితో పంచుకుంటూ
అనుక్షణం అనురాగసరాగాలతో
ఆనంద విహారాలలో తేలియాడుతుంటుంది 
తన బిడ్డ ఏమి చేస్తుందో అనుకుంటూ
తన బిడ్డకోసం తననితాను మార్చుకుంటూ
లోలోపల భాదని దాచుకుంటూ
పైపైకి మురిపెంగా మురిసిపోతూ

నిద్రలో కూడా తన ధ్యాస మారనీయకుండా
తన బిడ్డకు జోల పాడుకుంటూ
తనకు కునుకు వాలుతున్నా
లోపలి బిడ్డకు అలికిడి తెలీనీకుండా
కమ్మని హాయిని అందిస్తుంది

అందరి దేవుళ్లను వేడుకుంటూ
కొత్త అలవాట్లను అందుకుంటూ
ఆనందసంబరాలతో ఆడుకుంటూ
ఆ బిడ్డకు ఆహ్లాదాన్ని అందించుకుంటూ

పగలూ -రాత్రి తేడా లేకుండా
పరిపూర్ణత్వాన్ని పంచుకుంటూ
తన ప్రేమను తరగనీయకుండా
తన బిడ్డ సుఖాన్ని కోరుకుంటూ