Thursday 27 November 2014

కవిత నెం67(రైలు నడుస్తుంటే)

కవిత నెం :67
రైలు నడుస్తుంటే 
*******************


రైలు నడుస్తుంటే.......
పొగమంచుల నుంచి
దూరపు కొండల మద్య నుంచి
పచ్చని పైరు చేల నుంచి
చల్లని హోరు గాలి నుంచి
పొడిచే సూరీడు వస్తున్నాడు
రైలు బండి వేగంతో
ఎర్రని సూరీడు ఎగురుతున్నాడు
పొడిపొడిగా సూర్యరశ్మిని
రైలు కిటికీలనుంచి
తలుపులనుంచి
మనకు అందిస్తున్నాడు

రైలు నడుస్తుంటే.....
చూస్తే పట్టాలు కొట్టుకుంటాయి
చూస్తే  పట్టాలు పరిగెడుతుంటాయి
రైలు కింద నుంచి భూమి
ఎంతో వేగంతో వెనక్కి వెళుతున్నట్టు ఉంటుంది
కంకర రాళ్ల రూపం కనుమరుగై
గాలిలో కలుస్తున్నట్లు ఉంటుంది

రైలు నడుస్తుంటే..................
పక్కన ఆగివున్న రైలు కూడా
వేగంగా పరిగెడుతున్నట్లు ఉంటుంది
మన రైలు ఆగినప్పుడు
పక్క రైలు కదులుతుంటే
మనదే కదులుతున్నట్లు అనిపిస్తుంది
పక్కన కరెంటు తీగలు ,స్తంభాలు
జివ్వు జివ్వు మంటూ ఎదురవుతూ ఉంటాయి
దూరంగా చూసే ప్రదేశాలు
చాలా చిన్నవిగా కనిపిస్తాయి
భూమి తిరుగుతూ ఉంటుంది
అనే దృశ్యాన్ని కనులార చూస్తునట్టు ఉంటుంది

రైలు నడుస్తుంటే..............
ఒక నదిపై ఉన్న బ్రిడ్జి నుంచి
రైలు గాలిలో నడుస్తుందా అన్నట్టు ఉంటుంది
ఊయలలో ఊగుతున్న భావం మనకు ఒక వైపు
ఏదో గుండె భారం తీరుతున్నట్టు అనే ఆహ్లాదం మరో వైపు
ప్రపంచమంతా మర్చిపోయినట్టు
మనం సరికొత్త గమనంలో ఉన్నట్టు
మన ప్రయాణం మనకే
మరో నయనంలా కనిపిస్తుంది
వినీలాకాశంలో
విహంగాపక్షివై నువ్వే
ఎగురుతున్నట్టు అనిపిస్తుంది

రైలు నడుస్తుంటే...................
ఏవో జ్ఞాపకాలు మనసుని అలా తాకి
గాలి స్పర్శకి అలా జారిపోతూ
మనకి గుర్తు చేస్తూ ఉంటుంది
ఎంతైనా అద్బుతమైనది
రైలు ప్రయాణం
భూలోక సుందర వర్ణంలో
అందమైన భోగి ప్రయాణం
అందరికీ ఇష్టమైన ప్రయాణం
అరుదుగా చేసినా
మంచి అనుభూతి

రైలు ప్రయాణం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
//గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు //28. 11. 2014//


Wednesday 26 November 2014

కవిత నెం 66:నా అంతర్వేది ప్రయాణం

కవిత నెం :66

నా అంతర్వేది ప్రయాణం ... సాహితీ సంతోషాల గమనం
**********************************************

అదిరేటి అందాలన్నీ ఎదురొస్తున్నాయి
నా చిన్ని మనసుని మొత్తం దోచేస్తున్నాయి
అల్లంత దూరంగా ఉండి కవ్విస్తున్నాయి
ఆనందం అంతు రుచిని చూపిస్తున్నాయి
ఎప్పుడెప్పుడా అని వేచిన ఎదురుచూపులకు
రెప్పపాటు కూడా కలుగని క్షణాలను అందించాయి
సాహితీవేత్తలు ,సేవకులను సాహితీయత ఉన్న
ఆత్మీయులుగా ,సన్నిహితులుగా పరిచయం చేసాయి
అందరి మనసులు స్నేహాన్ని మలుపుకొన్నాయి
అందరి అడుగులు ఒక్కటిగా ముందుకు సాగాయి
కేరింతల తుళ్ళింతలు ,తుంటరిగా కనిపించాయి
ఆర్బాటాన్ని  చూపిస్తూ ఆత్మీయతల్ని అద్దుకొన్నాయి
అంతర్వేది సాహితీపండుగకై ప్రయాణాన్ని మొదలుపెట్టాయి
నిండు వెన్నెల చీకట్లతో ,పరిగెడుతూ పర్యటించాయి
నిద్ర మరచి ,కాలాన్ని మరచి కబుర్లాడుకున్నాయి
ఆగమరచి ,మై మరచి అత్యుత్సాహంతో మేలుకొన్నాయి
అలసట చెందలేదు కాని ,విరామం కోసం విశ్రాంతికి చేరుకొన్నాయి
తెల్లవారుజామున ,తొలికిరణం రాకుండా పొగమంచు పోటులకు నిద్రలేచాయి
పచ్చదనం మధ్యన ,పసిడి కాంతులను చూస్తూ పరవశంతో కాసేపు ప్రకాశించాయి
ఉల్లాస ఉదయంతో ,ఉలిక్కిపడి లేచి మనసు బద్దకాన్ని వదిలించుకున్నాయి
అరకొర ఆకలితో అందుకొన్న అల్పాహారాన్ని ఆస్వాదిస్తూ ఆరగించాయి
క్లిక్ మని కెమేరాలతో రైలులోనుంచి కనపడిన వాటిని క్లిక్ మనిపించాయి
తాటిచెట్టు తిమ్మిరెలు ,కొబ్బరి చెట్టు తుమ్మెరలు ,మంచు దుప్పటి బిందువులు
నీటి మడుగు వాకిళ్ళు , చేప రొయ్య చెరువులు ,సూర్య కాంతి మిణుగురులు
అందుకుంటూ ,దాటుకుంటూ ,మా గమ్యం చేరుకుంటూ ఒకరికొకరు పలకరించుకుంటూ
పాలకొల్లు స్టేషన్లో ''స్నేహాల పల్లకిని '' కలుపుకుంటూ మమతల పాలవెల్లి లా మారిపోతూ
బయలుదేరినాము రెండు బస్సులలో మేము కోనసీమ కౌగిళ్ళలో బందీలవుతూ
దారిపొడవునా కోనసీమ కిలాడి అందాలను చూస్తూ జ్ఞాపకాలు నెమరువేస్తూ
పూరిళ్ళ గృహాలు  , కొబ్బరాకుల గోడలు ,చిన్న చిన్న కాలువలు ,తాటి వంతెనలు
మలుపు మలుపుల మార్గాలు ,చెక్కు చెదరని గోపురాలు ,కుప్పలుగా కొబ్బరి డొల్లలు
చిన్నతనం చెంగున ఎగురుకొచ్చింది గతం జ్ఞాపకాల పునాదులను చూడటానికి
ఆహ్లాదం అల్లుకుంటూ వచ్చింది మనసు సంబరాన్నిబాధ్యతగా మోయటానికి
త్వరగా అంతర్వేది స్థలం చేరుకోవాలని అనుకుంటుంటే ఆలస్యం ముందుకొస్తుంది
ఆ కాస్త సమయాన్ని మా వాళ్ళు చిత్రకారులై చిత్రించారు వారి వారి నేర్పులతో
రానే వచ్చింది అతిది గృహం అలసిన తనువులకి సేద తీర్చటానికి
పండుగ వాతావరణం కంగారు పెడుతుంది అందర్నీ త్వరగా ఆహ్వానించటానికి
సమయాన్ని వెచ్చించకుండా సమయపాలనతో అందరూ సమసిద్దులయ్యారు
ముఖ్య అతిధులతో వేదికను అలకరించి,కార్య నిర్వాహకులు  పండుగను ప్రారంభించారు
వారి వారి ప్రసంగాలు ముగిసాక ,సాహితీ ఆట పాటలతో శ్రోతలను అలరించారు
సన్మానాలను సమపాలుగా నిర్వాహకులకు అందించి తగు గౌరవాన్ని వారికందించారు
సాహితీ పోటీ విజేతలకు ''ప్రశంసా పత్రాలను '' జ్ఞాపికలను '' బగుమతిగా అందించారు
మంచి విందును ఏర్పాటు చేసి సాహితీ విందును కుటుంబసమేతంగా చూపించారు
బోజనాంతరం సముద్ర విహారానికి స్వాగతిస్తూ అందరినీ తీసుకు వెళ్లారు
సముద్ర తీరాన ,అలలతో ,హాయిలతో మేమందరం కాసేపు విహరించాము
అప్పటికే సాయంత్రం మాకు స్వాగతం చెబుతూ రేపు కలుద్దామని కబురంపేను
మరల అందరూ స్నానపానాలను ముగించి ,ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించారు
ఆ స్వామి ఆలయంలో ప్రసాద స్వరూపమయిన బోజనప్రాప్తి కి బాగులయ్యాము
అనంతరం అందరం కలిసి ఆట పాటలతో ,అలరిస్తూ ఉర్రూతలూగాము
ఇది ఈనాటికి మొదటి రోజు పండుగ వాతావరణాన్ని ముద్దుగా ముగియించాము
మరుసటి రోజు పొద్దున్నే అంతర్వేది స్వామీ ఆలయ దర్శనం ఆద్యాత్మికంగా
ఆపై చూసుకోండి మన వారి చిత్రాలను చిత్రించు కుంటూ ఒకరి కొకరు పోటీపడుతూ
దర్శనం కాగానే అల్పాహార ,తీనీటి విందును రుచి చూసి మరలా మొదలు  కవిసమ్మేళనం
అందంగా సాగింది మన సాహితీమిత్రుల కవితా గానం ఒక్కోక్కరితో అందర్నీ ముగ్దుల్ని చేస్తూ
ఆ పిమ్మట కమ్మని భోజనం మరలా స్వామి వారి ఆలయ ప్రాంగణమున
తరువాత సాగింది మా ప్రయాణం అక్కా చెల్లెళ్ళ  గట్టుని చూపే సాగరసంగమం వైపు
ఒకవైపు గోదావరి ,మరో వైపు సముద్రావరి రెంటినీ ఒకేచోట చూపిన వైనం
ఆకట్టుకుంది మమ్మల్ని పరవళ్ళు ,ఒరవళ్ళును ఒకేసారి మా రెండు కళ్ళతో చూపుతూ
ఇసుక మేఘమై  కాలి వెంబడి వస్తున్న వేళ ,అక్కడి జీవరాసులతో అందాలను పొందిన వేళ
ఆ సముద్ర హోరులో జోరుగా మా మనసులు తేలియాడు వేళ ,సంబరాన్ని జరుపుకుంటూ
వీడలేక ,టైం లేక సముద్రున్ని వీడిన వేళ ,గోదావరి వంతెనను గుండె బరువుతో దాటిన వేళ
అందరి నోళ్ళూ విప్పాయి ,అంత్యాక్షరి ని గానం చేస్తూ ,అల్లరిని చిల్లరగా పెద్దది చేస్తూ
మాములుగా కాదు ఒకరిని ఒకరం పూర్తిగా గుర్తుపెట్టుకొనేటట్టు ,మౌనం చెదరిపోయేటట్టు
తిరిగి ప్రయాణం మరలా రైలు ప్రయాణం మది పైకి అల్లరి చేసినా లోపల భాదని చూస్తూ
అందరం కలిసి చేసిన ఈ ప్రయాణం మాతో పాటు మా ఇంటికి కూడా వచ్చేసింది
ఒకరిని ఒకరు మర్చోపోలేనంత ,ఏదో ఎదలో మొదలయ్యిన ఎడబాటు బాధ
(ఇదండీ సంగతి నా మనసు తెలికయ్యింది ఇది మీకు తెలుపుతూ ఎందుకంటే ఇది కూడా ఒక మంచి
మధురమైన జ్ఞాపకమే కదా మన సాహితీ కుటుంబాన్ని ఇలా అక్షరాలలో బందిస్తూ .... ఏమంటారు )
- మీ గరిమెళ్ళ గమనాలు (రాజేంద్ర ప్రసాదు )





Tuesday 11 November 2014

కవిత నెం65(బాల ''కర్మ'' కులు)

కవిత నెం :65

బాల ''కర్మ'' కులు  
**************

అందమైన బాల్యం బురదలో జన్మించింది 

ఉగ్గుపాలరుచి ఎరుగకుండానే ఉలిక్కిపడుతుంది 
కేరింతలు వెయ్యకుండానే నడక సాగించేస్తుంది 
కన్నప్రేమ తెలియకుండానే ఒంటరై మిగిలిపోతుంది 
కడుపారా తినలేక ఆకలికేకలతో ఆక్రోశిస్తోంది 

విధి ఆడిన వింత నాటకంలో ముద్దాయిలు వీరు 

కామానికి బలైపోతూ పుట్టుకతోనే ఖైదీలు వీరు 
కాటువేయబడిన కాలంలో కటిక దరిద్రులు వీరు
కల్మషం తెలియని వయస్సుతో పెరిగే కార్మికులు వీరు 
కలలు కనే స్థోమతలేని ఆశల పేదవారు వీరు 

అవస్థలు పడుతూ అడుక్కుంటున్న బాల బిక్షకులు వీరు 

చేత అక్షరం నోచుకోలేని చిరు నిరక్షరాస్యులు వీరు 
సామాజిక జీవనంలో నెట్టివేయబడ్డ అనాధలు వీరు 
యాంత్రిక జీవనంలో ఏకాకిగా మిగిలే అభాగ్యులు వీరు 
ఆవేదనతో అలమడుతూ పోరాడుతున్న యోధులు వీరు  

బ్రతకలేక ,చావలేక బిక్కు బిక్కుమనే రెక్కలపురుగులు వీరు 

ఏడ్వలేక ,నవ్వలేక చిక్కుల్లో పయనించే శిలాహృదయాలు వీరు 
వరంలాగా పుట్టే శాపంతో ఆడుకునే బాల నేరస్తులు వీరు 
మండే గుండెలతో రోదిస్తూ ,విలవిలలాడే వెర్రివాళ్ళు వీరు 
కాలానికి ఎదురీదుతూ ఆయాసపడే ఆటగాళ్ళు వీరు 

ఆలోచించు ఓ మనిషి నీ జన్మ కారణం ఇలాగైతే 

నీ సుఖం ,సంతోషాలతో విషాన్ని పుట్టించకు 
మానవత్వాన్ని మరిచి మృగంలా కాపురం చేయకు 
సృష్టికి వ్యతిరేకంగా బాల్యాన్ని బలిచేయకండి 
ఎదుగుదలకి మూలమైన బాల్యాన్ని మాపకండి 

బాలల్ని లొంగదీసుకుని బలి చక్రవర్తులు కాకండి 

వారి పేర్లతో సొమ్ముల సంపాదించే జీవితాన్ని మార్చండి 
ఎక్కడినుంచో పుట్టరు కదా ఈ బాల కార్మికులు 
మన వ్యవస్థలో శిధిలమవుతున్న  బాల ''కర్మ ''కులు 
బాలల్ని ప్రేమించండి - బాల్యాన్ని బ్రతికించండి 

//రాజేంద్ర ప్రసాదు // 11. 11. 2014 //

సాహితీ సేవ చిత్ర కవితల పోటీ -7 కొరకు 


Friday 7 November 2014

కవిత నెం64:ఎవ్వరాపలేరు నిన్ను

కవిత నెం :64

ఎవ్వరాపలేరు నిన్ను
****************************
ముసురు కమ్మి చినుకునాపలేదు

గ్రహణం పట్టి సూర్యుని కాంతిని దాచలేదు
వెనుకడుగు వేసినా పులి పంజా వేట మానదు
నీటిప్రవాహం ఎంతవున్నా సుడిగుండాన్ని తప్పించలేదు
అగ్ని ఎంత ఎగిసిపడుతున్నా నీటిచుక్క ఓడిపోదు
విషనాగుల ముందు ముంగిస బెదరదు
నిండు కుండ తొణకదు
సంద్రమెన్నడూ ఎండదు
తోకచుక్కలు ఎన్నిరాలుతున్నా
అంతరిక్షం అంతరించదు
జీవితం అనేది ఒడిదుడుకుల సంగమం
కష్ట సుఖాల సాగరం
ఎదురుదెబ్బలు తగులుతూ వుంటాయి
స్పీడ్ బ్రేకర్స్ మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపుతూ వుంటాయి
ఎన్ని ఎదురు వస్తున్నా కాలాన్ని ఎవ్వడూ క్యాచ్ చేయలేడని తెలుసుకో
గోడను తన్నిన బంతిలా సాగిపో
దెబ్బతగిలితే కలిగే బాధ
మన విజయాన్ని గుర్తు చేసే సంకేతంలా వుండాలి
అవరోదాలు మన స్నేహితులు
ఆటంకాలు మన సన్నిహితులు
ఆపదలు మన ఆపద్బాందవులు
మంచిని ఆహ్వానించే మనసు నీకున్నప్పుడు
చెడును స్వాగతించే అబిలాష కూడా ఉండాలి
తప్పు జరిగిందని తల్లదిల్లవద్దు
చెడు జరుగుతుందని సంకోచించవద్దు
నిరాశతో నీ ప్రయాణాన్ని నిశ్రుహ పరచవద్దు
అతిశయం లేని జీవితంలో  నిర్విగ్నంగా ,నిర్మలంగా
నీ నడకను సాగించు నేస్తం
// రాజేంద్రప్రసాదు//07.11.14//

Thursday 6 November 2014

కవిత నెం63:కడలి -మజిలి

కవిత నెం :63
కడలి -మజిలి
*******************
కడలి ఆకాశానికి దూరంగా ఉంటూ ఆవిరై చేరుతుంది 
ఆ ఆవిరే వాన చినుకుగా మారి వర్షమై కురుస్తుంది 
ఆకాశాన్ని అందుకోవాలని కడలి అలై పొంగుతుంది 
ఆ అలే ఆత్మస్థైర్యానికి ఆదర్శంగా నిలుస్తుంది 
'ఇసుక పాన్పు ''తో జీవరాశులకు ఇల్లుగా తానుంటుంది 
అదే ఇసుక అద్బుత కళాఖండాలకు మూలమౌతుంది
ప్రకృతిసంపదను దాచుకుని పరవళ్ళు తొక్కుతుంటుంది 
పల్లెకారులకు ''ప్రకృతి దేవత '' యై ఆసరా అవుతుంది 
జలపాతాలను కలుపుకుంటూ ''జలావరణ్య'' మౌతుంది 
సృష్టిఅంతా వ్యాపించి ''జలపాదమై '' కదులుతుంది 
మనోవేదనను చెరిపి ఆహ్లాదాన్ని అందిస్తుంది 
మమతలతీరమై నిలచి ఆహ్వానం పలుకుతుంది 
అందంగా కనపడుతూ , ఆనందాన్ని పంచుతుంది 
అప్పుడప్పుడు కోపిస్తూ ,''సునామిభూతాన్ని '' సృష్టిస్తుంది 
నీలి వర్ణ రంగుతో ,నాజూగ్గా కదులుతుంటుంది 
నిర్మలమైన అలజడితో , మౌనంగా మాట్లాడుతుంటుంది 
ప్రళయాలను సృష్టిస్తూ ,పసిపాప నవ్వులా కనిపిస్తుంది 
ప్రేమకి వారధిగా నిలుస్తూ , ప్రేమసాగరమై ప్రవహిస్తూ
ఎన్నో కావ్యాలకు రూపునిస్తూ , కవికెరటమై ఉదయిస్తూ
విశ్వమంత విశాలమైనది కడలి - వెన్నెల కొంగు కడలి     

Monday 3 November 2014

కవిత నెం62(భూమి పుత్రుడు )

కవిత నెం :62

భూమి పుత్రుడు 
*******************************************

ఆరుకాలాలలో అన్నం పెట్టగలిగేది ఒక్క రైతు మాత్రమే 

నేడు అందరి అవసరాలు తీరుతున్నాయంటే అది రైతు ఫలమే 
ఎండనక వాననక ,రేయనక పగలనక రెక్కాడి డొక్కాడుతూ 
అలుపు సొలుపు లేకుండా ,ఆత్మ స్థైర్యం వీడకుండా ,ఆశల్నిపెంచుతూ 
సద్దన్నం తన సొంతం , కష్టం తన పంతం ,తన శ్రమ నెరుగదు అంతం 

భూమాత తనకి తోడు , ఆకాశం అయనకి జోడు ,ఒక్కడై సాగేడు 

చీకటిని గెలిచేడు ,వెలుగును పంచేడు ,నిద్రమాని కాపు కాసేవాడు 
హలం పట్టి ,పొలం దున్ని , మడి కట్టి ,నారు మడి  పోసేవాడు
ఇంటిలోన ఏమున్నా లేకున్నా పంటకి ఎరువు అరువు తెచ్చేవాడు 
కర్రతోటి పాయ తీసి ,బోదిలోని నీటిని పంటకి అందించేవాడు  

పంటకి తెగులు  వస్తే తల్లడిల్లి పోయే పసి హృదయం రైతన్నది 

పక్షుల భారి నుంచి కాపాడటానికి దిష్టి బొమ్మని అమరుస్తాడు 
గడ్డ పార చేతపట్టి ,చేను చుట్టూ గట్టు పెట్టి తొలిమెట్టు ఎక్కుతాడు 
కోత కోసి ,కుప్ప నూర్చి ,గింజ గింజ పోగు బెట్టి, గాదాంలకు చేర్చి  
పండిన పంట చూసి ,సంతోషించి సంతకొచ్చి,కన్నీటి రుచి చూస్తాడు 

పెట్టిన ధర మోసపోయి ,పెత్తందార్ల చేతిలో రైతు నలిగిపోయి 

నమ్ముకున్న ఆశలు అమ్మకానికి ఆవిరయ్యిపోయెను 
విపత్తు వచ్చినా ,విద్యుత్తు చచ్చినా చావు రేవు బ్రతుకేరా 
కల్తీల  మందులు ,నకిలీ విత్తనాలు రైతు ఊపిరికే ముప్పురా 
ప్రపంచమే మారుతున్నా,వారి దిన చర్య మారదురా


అందరికీ అన్నదాతగా నిలచిన తన తలరాతను మార్చేదెవరు
దేశానికి వెన్నెముకగా నున్నా తన దిశను రూపుమాపేదెవరు 

మట్టిలో పుట్టి ,మట్టిని నమ్మి,మట్టి బొమ్మగా బ్రతుకుతున్నాడు 
రాజకీయ రాబందులకు తన బంజరు భూమిని బలిఇస్తున్నాడు
జీత బత్యాలు లేకుండా తన జీవితాన్నే అంకితం చేస్తున్నాడు 

రైతన్నల ఆర్తులను తీర్చే రోజులు రావాలని కాంక్షిస్తున్నా 

ప్రకృతి ప్రకంపనలు తనని తాకకూడదని ప్రార్దిస్తున్నా 
రైతుని గౌరవించి ,వ్యవసాయాన్ని వృద్దింపచేయాలని కోరుతున్నా 
రైతు అవసరాలను తీర్చి ,వారి వేదన మాపాలని అడుగుతున్నా 
''జై కిసాన్ '' అనే అవార్డులను వారికి అందించమంటున్నా 

//రాజేంద్ర ప్రసాదు //04. 11. 2014//

సాహితీ సేవ చిత్ర కవిత  పోటీ -6 కొరకు