Wednesday 26 November 2014

కవిత నెం 66:నా అంతర్వేది ప్రయాణం

కవిత నెం :66

నా అంతర్వేది ప్రయాణం ... సాహితీ సంతోషాల గమనం
**********************************************

అదిరేటి అందాలన్నీ ఎదురొస్తున్నాయి
నా చిన్ని మనసుని మొత్తం దోచేస్తున్నాయి
అల్లంత దూరంగా ఉండి కవ్విస్తున్నాయి
ఆనందం అంతు రుచిని చూపిస్తున్నాయి
ఎప్పుడెప్పుడా అని వేచిన ఎదురుచూపులకు
రెప్పపాటు కూడా కలుగని క్షణాలను అందించాయి
సాహితీవేత్తలు ,సేవకులను సాహితీయత ఉన్న
ఆత్మీయులుగా ,సన్నిహితులుగా పరిచయం చేసాయి
అందరి మనసులు స్నేహాన్ని మలుపుకొన్నాయి
అందరి అడుగులు ఒక్కటిగా ముందుకు సాగాయి
కేరింతల తుళ్ళింతలు ,తుంటరిగా కనిపించాయి
ఆర్బాటాన్ని  చూపిస్తూ ఆత్మీయతల్ని అద్దుకొన్నాయి
అంతర్వేది సాహితీపండుగకై ప్రయాణాన్ని మొదలుపెట్టాయి
నిండు వెన్నెల చీకట్లతో ,పరిగెడుతూ పర్యటించాయి
నిద్ర మరచి ,కాలాన్ని మరచి కబుర్లాడుకున్నాయి
ఆగమరచి ,మై మరచి అత్యుత్సాహంతో మేలుకొన్నాయి
అలసట చెందలేదు కాని ,విరామం కోసం విశ్రాంతికి చేరుకొన్నాయి
తెల్లవారుజామున ,తొలికిరణం రాకుండా పొగమంచు పోటులకు నిద్రలేచాయి
పచ్చదనం మధ్యన ,పసిడి కాంతులను చూస్తూ పరవశంతో కాసేపు ప్రకాశించాయి
ఉల్లాస ఉదయంతో ,ఉలిక్కిపడి లేచి మనసు బద్దకాన్ని వదిలించుకున్నాయి
అరకొర ఆకలితో అందుకొన్న అల్పాహారాన్ని ఆస్వాదిస్తూ ఆరగించాయి
క్లిక్ మని కెమేరాలతో రైలులోనుంచి కనపడిన వాటిని క్లిక్ మనిపించాయి
తాటిచెట్టు తిమ్మిరెలు ,కొబ్బరి చెట్టు తుమ్మెరలు ,మంచు దుప్పటి బిందువులు
నీటి మడుగు వాకిళ్ళు , చేప రొయ్య చెరువులు ,సూర్య కాంతి మిణుగురులు
అందుకుంటూ ,దాటుకుంటూ ,మా గమ్యం చేరుకుంటూ ఒకరికొకరు పలకరించుకుంటూ
పాలకొల్లు స్టేషన్లో ''స్నేహాల పల్లకిని '' కలుపుకుంటూ మమతల పాలవెల్లి లా మారిపోతూ
బయలుదేరినాము రెండు బస్సులలో మేము కోనసీమ కౌగిళ్ళలో బందీలవుతూ
దారిపొడవునా కోనసీమ కిలాడి అందాలను చూస్తూ జ్ఞాపకాలు నెమరువేస్తూ
పూరిళ్ళ గృహాలు  , కొబ్బరాకుల గోడలు ,చిన్న చిన్న కాలువలు ,తాటి వంతెనలు
మలుపు మలుపుల మార్గాలు ,చెక్కు చెదరని గోపురాలు ,కుప్పలుగా కొబ్బరి డొల్లలు
చిన్నతనం చెంగున ఎగురుకొచ్చింది గతం జ్ఞాపకాల పునాదులను చూడటానికి
ఆహ్లాదం అల్లుకుంటూ వచ్చింది మనసు సంబరాన్నిబాధ్యతగా మోయటానికి
త్వరగా అంతర్వేది స్థలం చేరుకోవాలని అనుకుంటుంటే ఆలస్యం ముందుకొస్తుంది
ఆ కాస్త సమయాన్ని మా వాళ్ళు చిత్రకారులై చిత్రించారు వారి వారి నేర్పులతో
రానే వచ్చింది అతిది గృహం అలసిన తనువులకి సేద తీర్చటానికి
పండుగ వాతావరణం కంగారు పెడుతుంది అందర్నీ త్వరగా ఆహ్వానించటానికి
సమయాన్ని వెచ్చించకుండా సమయపాలనతో అందరూ సమసిద్దులయ్యారు
ముఖ్య అతిధులతో వేదికను అలకరించి,కార్య నిర్వాహకులు  పండుగను ప్రారంభించారు
వారి వారి ప్రసంగాలు ముగిసాక ,సాహితీ ఆట పాటలతో శ్రోతలను అలరించారు
సన్మానాలను సమపాలుగా నిర్వాహకులకు అందించి తగు గౌరవాన్ని వారికందించారు
సాహితీ పోటీ విజేతలకు ''ప్రశంసా పత్రాలను '' జ్ఞాపికలను '' బగుమతిగా అందించారు
మంచి విందును ఏర్పాటు చేసి సాహితీ విందును కుటుంబసమేతంగా చూపించారు
బోజనాంతరం సముద్ర విహారానికి స్వాగతిస్తూ అందరినీ తీసుకు వెళ్లారు
సముద్ర తీరాన ,అలలతో ,హాయిలతో మేమందరం కాసేపు విహరించాము
అప్పటికే సాయంత్రం మాకు స్వాగతం చెబుతూ రేపు కలుద్దామని కబురంపేను
మరల అందరూ స్నానపానాలను ముగించి ,ఆ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించారు
ఆ స్వామి ఆలయంలో ప్రసాద స్వరూపమయిన బోజనప్రాప్తి కి బాగులయ్యాము
అనంతరం అందరం కలిసి ఆట పాటలతో ,అలరిస్తూ ఉర్రూతలూగాము
ఇది ఈనాటికి మొదటి రోజు పండుగ వాతావరణాన్ని ముద్దుగా ముగియించాము
మరుసటి రోజు పొద్దున్నే అంతర్వేది స్వామీ ఆలయ దర్శనం ఆద్యాత్మికంగా
ఆపై చూసుకోండి మన వారి చిత్రాలను చిత్రించు కుంటూ ఒకరి కొకరు పోటీపడుతూ
దర్శనం కాగానే అల్పాహార ,తీనీటి విందును రుచి చూసి మరలా మొదలు  కవిసమ్మేళనం
అందంగా సాగింది మన సాహితీమిత్రుల కవితా గానం ఒక్కోక్కరితో అందర్నీ ముగ్దుల్ని చేస్తూ
ఆ పిమ్మట కమ్మని భోజనం మరలా స్వామి వారి ఆలయ ప్రాంగణమున
తరువాత సాగింది మా ప్రయాణం అక్కా చెల్లెళ్ళ  గట్టుని చూపే సాగరసంగమం వైపు
ఒకవైపు గోదావరి ,మరో వైపు సముద్రావరి రెంటినీ ఒకేచోట చూపిన వైనం
ఆకట్టుకుంది మమ్మల్ని పరవళ్ళు ,ఒరవళ్ళును ఒకేసారి మా రెండు కళ్ళతో చూపుతూ
ఇసుక మేఘమై  కాలి వెంబడి వస్తున్న వేళ ,అక్కడి జీవరాసులతో అందాలను పొందిన వేళ
ఆ సముద్ర హోరులో జోరుగా మా మనసులు తేలియాడు వేళ ,సంబరాన్ని జరుపుకుంటూ
వీడలేక ,టైం లేక సముద్రున్ని వీడిన వేళ ,గోదావరి వంతెనను గుండె బరువుతో దాటిన వేళ
అందరి నోళ్ళూ విప్పాయి ,అంత్యాక్షరి ని గానం చేస్తూ ,అల్లరిని చిల్లరగా పెద్దది చేస్తూ
మాములుగా కాదు ఒకరిని ఒకరం పూర్తిగా గుర్తుపెట్టుకొనేటట్టు ,మౌనం చెదరిపోయేటట్టు
తిరిగి ప్రయాణం మరలా రైలు ప్రయాణం మది పైకి అల్లరి చేసినా లోపల భాదని చూస్తూ
అందరం కలిసి చేసిన ఈ ప్రయాణం మాతో పాటు మా ఇంటికి కూడా వచ్చేసింది
ఒకరిని ఒకరు మర్చోపోలేనంత ,ఏదో ఎదలో మొదలయ్యిన ఎడబాటు బాధ
(ఇదండీ సంగతి నా మనసు తెలికయ్యింది ఇది మీకు తెలుపుతూ ఎందుకంటే ఇది కూడా ఒక మంచి
మధురమైన జ్ఞాపకమే కదా మన సాహితీ కుటుంబాన్ని ఇలా అక్షరాలలో బందిస్తూ .... ఏమంటారు )
- మీ గరిమెళ్ళ గమనాలు (రాజేంద్ర ప్రసాదు )





0 comments:

Post a Comment