Monday 3 November 2014

కవిత నెం62(భూమి పుత్రుడు )

కవిత నెం :62

భూమి పుత్రుడు 
*******************************************

ఆరుకాలాలలో అన్నం పెట్టగలిగేది ఒక్క రైతు మాత్రమే 

నేడు అందరి అవసరాలు తీరుతున్నాయంటే అది రైతు ఫలమే 
ఎండనక వాననక ,రేయనక పగలనక రెక్కాడి డొక్కాడుతూ 
అలుపు సొలుపు లేకుండా ,ఆత్మ స్థైర్యం వీడకుండా ,ఆశల్నిపెంచుతూ 
సద్దన్నం తన సొంతం , కష్టం తన పంతం ,తన శ్రమ నెరుగదు అంతం 

భూమాత తనకి తోడు , ఆకాశం అయనకి జోడు ,ఒక్కడై సాగేడు 

చీకటిని గెలిచేడు ,వెలుగును పంచేడు ,నిద్రమాని కాపు కాసేవాడు 
హలం పట్టి ,పొలం దున్ని , మడి కట్టి ,నారు మడి  పోసేవాడు
ఇంటిలోన ఏమున్నా లేకున్నా పంటకి ఎరువు అరువు తెచ్చేవాడు 
కర్రతోటి పాయ తీసి ,బోదిలోని నీటిని పంటకి అందించేవాడు  

పంటకి తెగులు  వస్తే తల్లడిల్లి పోయే పసి హృదయం రైతన్నది 

పక్షుల భారి నుంచి కాపాడటానికి దిష్టి బొమ్మని అమరుస్తాడు 
గడ్డ పార చేతపట్టి ,చేను చుట్టూ గట్టు పెట్టి తొలిమెట్టు ఎక్కుతాడు 
కోత కోసి ,కుప్ప నూర్చి ,గింజ గింజ పోగు బెట్టి, గాదాంలకు చేర్చి  
పండిన పంట చూసి ,సంతోషించి సంతకొచ్చి,కన్నీటి రుచి చూస్తాడు 

పెట్టిన ధర మోసపోయి ,పెత్తందార్ల చేతిలో రైతు నలిగిపోయి 

నమ్ముకున్న ఆశలు అమ్మకానికి ఆవిరయ్యిపోయెను 
విపత్తు వచ్చినా ,విద్యుత్తు చచ్చినా చావు రేవు బ్రతుకేరా 
కల్తీల  మందులు ,నకిలీ విత్తనాలు రైతు ఊపిరికే ముప్పురా 
ప్రపంచమే మారుతున్నా,వారి దిన చర్య మారదురా


అందరికీ అన్నదాతగా నిలచిన తన తలరాతను మార్చేదెవరు
దేశానికి వెన్నెముకగా నున్నా తన దిశను రూపుమాపేదెవరు 

మట్టిలో పుట్టి ,మట్టిని నమ్మి,మట్టి బొమ్మగా బ్రతుకుతున్నాడు 
రాజకీయ రాబందులకు తన బంజరు భూమిని బలిఇస్తున్నాడు
జీత బత్యాలు లేకుండా తన జీవితాన్నే అంకితం చేస్తున్నాడు 

రైతన్నల ఆర్తులను తీర్చే రోజులు రావాలని కాంక్షిస్తున్నా 

ప్రకృతి ప్రకంపనలు తనని తాకకూడదని ప్రార్దిస్తున్నా 
రైతుని గౌరవించి ,వ్యవసాయాన్ని వృద్దింపచేయాలని కోరుతున్నా 
రైతు అవసరాలను తీర్చి ,వారి వేదన మాపాలని అడుగుతున్నా 
''జై కిసాన్ '' అనే అవార్డులను వారికి అందించమంటున్నా 

//రాజేంద్ర ప్రసాదు //04. 11. 2014//

సాహితీ సేవ చిత్ర కవిత  పోటీ -6 కొరకు 






















0 comments:

Post a Comment