Monday 1 October 2018

కవిత నెం : 330(నై -వేదం)

కవిత నెం : 330
కవితా శీర్షిక : నై -వేదం

మనుషులగానే కనపడతారు
మనసులోని విషయాన్ని నవ్వుతూ వెదజల్లుతారు

పొగడ్తలకు పొంగిపోయే రోజులు
నిశ్శబ్దాన్ని ఎలా సహించగలరు ?

కపటబుద్దితో కాసుకొని ఉందురు
నంగనాచి నాటకాలు ఆడుతూ ఉందురు

నమ్మకం అనే వస్తువుకై ఎదురుచూపులు
నమ్మినవారిని సునాయాసంగా ముంచుదురు

కోప -ప్రదర్శనకు కాదేది సంఘటనకు విరుద్ధం
ఇష్టంలేని చోటే చిరాకుకు పట్టాభిషేకం

చూడటానికి అందరూ బంధువులే 
అలవాటుపడ్డావా పీక్కుతినే రాబందులే 

కదిలిస్తే అందరూ భయపడేవాళ్లే 
గాంభీర్యం పైన కప్పుకునే వస్త్రం మాత్రమే 

నిజాయితీ ,నిబద్దత అంటూ నీటి సూత్రాలే 
అబద్దాల బాటలో మారిపోయే జీవితాలే 

ప్రేమకోసం వెతకకు ఎక్కడా దొరకదూ 
ప్రేమగా మాట్లాడుతూనే గొంతు కోస్తురు 

నచ్చిన వాళ్లు , నచ్చని వాళ్లు అంటూ లేరు 
మన స్వభావం లోనుంచే పుట్టుకొచ్చే శత్రువులు 

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 





Friday 24 August 2018

329(తెలంగాణ -జలధార)

కవిత నెం :329

*తెలంగాణ -జలధార *

తెలంగాణ జల మణిహార మాగాణం
కొత్త జలాశయంతో నిండుతుంది తెలంగాణం

నీటికొరతను రూపుమాపుటకు నిలచే జలద్వీపం
ప్రతి చినుకును ఒడిసిపట్టే విజయమంత్రం

ఆసియాఖండంలోనే అత్యద్భుత జలధామం
రైతన్నల ఆశల సౌధం ఈ కాళేశ్వర ఎత్తిపోతల పధకం

సాగు ,తాగు నీటి అవసరాలను తీర్చే గంగా తీరం
ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇది నిత్య నూతనీయం

మిడి గడ్డలో నిర్మించే రిజర్వాయరు నిర్మాణం
మేధస్సును తలపించే మన కాళేశ్వర ప్రాజెక్ట్ వైభవం

బతుకుల్లో పచ్చదనం నింపే బంగారం
కండ్లు మిరిమిట్లు గొలిపే సొరంగాల నైపుణ్యం

గోదావరితో  సరస్సు , నదీ జలాల అనుసంధానం
పరివాహిత ప్రాణహిత ప్రాంతాల సంగమం

తెలంగాణ పల్లెల గుండె నిండేంత సంబరం
మహాప్రసాదంగా సాక్షాత్కరించే ఈ కాళేశ్వర పుణ్యక్షేత్రం
----------------------------------------------------------------
ఈ కవిత కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాత్రమే వ్రాయబడినది
ఈ కవితపై సర్వ హక్కులు నావే మరియు ఎటువంటి ప్రచురణలకు
పంపబడలేదని హామీ ఇస్తున్నాను
-------------------------------------------------------------
గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
వృత్తి : ప్రవేట్ కంపెనీలో Dy .Manager
ప్రవృత్తి : కవితలు & పాటలు రాయటం
బీరంగూడ ,హైదరాబాద్
చరవాణి : 9705793187




 

Monday 16 July 2018

328(నా దేశం -ఒక సందేశం )

కవిత నెం :328

పేరు : గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 
శీర్షిక : నా దేశం -ఒక సందేశం
కవిత : 1
సంక్లిప్త చిరునామా :
బీరంగూడ ,హైదరాబాద్ 

ఫోన్ .నెం : 9705793187
హామీ పత్రం : కేవలం ఆగస్టు -15 కవితా సంకలనం కోసం రాసినది 
మరియు ఎటువంటి పత్రికలకు పంపబడలేదు

నా దేశం ఒక భగవద్గీత
నా దేశం అగ్నిపుణీత సీత

నా దేశం ఎగిరే భావుట
నా దేశం నిండుగుండే పంట

నా దేశం త్యాగ ధనుల తోట
నా దేశం సంస్కృతి -సాంప్రదాయాల కోట

నా దేశం సర్వమత సమ్మేళనమట
నా దేశం శాంతి -అహింసల చిహ్నమట

నా దేశం మాతృ గర్భ కోవెల
నా దేశం సమతా మమతల వెన్నెల

నా దేశం భారత వీరుల గడ్డ
నా దేశం భావి పౌరుల అడ్డా

నా దేశం స్వేచ్చా పావురం
నా దేశం హిమశైల గోపురం

నా దేశం పవిత్ర భారతదేశం
నా దేశం నాకు గర్వకారణం

నా దేశం తరతరాలకు  ఆదర్శం 
నా దేశం ఒక స్వచ్ఛమైన  సందేశం 



Friday 13 July 2018

కవిత నెం :327(యాదాద్రి -శిల్ప కళా వైభవం )

కవిత నెం :327

''యాదాద్రి -శిల్ప కళా వైభవం ''

నల్లరాతి శిలల నుంచి జీవం పోసిన  అద్భుత కళాఖండాలు
యాదగిరీశుడి సన్నిధిలో కొలువుదీరే సౌందర్య రూపాలు

రాజుల కాలాన్ని తలపించే మంటపాలు ,గోపురాలు
అద్భుతాలను ఆవిష్కరించే శిల్పుల కళా నైపుణ్యాలు

శైవాగమశాస్త్రానుసారం జరిగే శివాలయ నిర్మాణాలు
సాలహారంలో శక్తిపీఠాలు , ద్వాదశ జ్యోతిర్లింగాలు

కాకతీయుల శిల్పకళా ఒరవడికి నిలచే నమూనాలు
పల్లవుల ,చోళుల కాలంలో విరాజిల్లిన శిల్పకళా వైభవాలు

అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలు
సర్వాంగ సుందరంగా నిర్మింపబడే నవగ్రహ ఆలయాలు

కనువిందు చేస్తున్న ఆధ్యాత్మిక అద్భుత కళా సంపదలు
ఆధ్యాత్మిక రాజధానిగా రూపు దిద్దుకుంటున్న రూపు రేఖలు

కృష్ణ శిలల నిర్మాణాలు , ప్రాకార మండపాలు
మధ గజాల బొమ్మల మధ్య శాసించే అందమైన బాల పాద స్తంబాలు
గజరాజులు -సింహాలు ,లతలు -పద్మాలతో మించిన కళాఖండాలు 

తంజావూరు శిల్ప సౌందర్యాన్ని తలపించే ఆధునాతన సోయగాలు
ఆగమశాస్త్రోక్తంగా సాగుతున్న ప్రత్యేక నిర్మాణ కౌశలాలు
అబ్బురపరిచే ,ఆహ్లాదభరిత ఆధ్యాత్మిక అద్భుతాలు

నిష్టాతులైన శిల్పుల చేతులో ప్రాణం పోసుకుంటున్న శిల్పాలు
ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణాలు

యాదాద్రి ఆలయ విస్తరణకు సిద్దమవుతున్న శిల్పాలు
వేగంగా సాగుతున్న యాదాద్రి పునర్నిర్మాణ వైభవాలు
ఉగ్ర నరసింహుని ఆనందింపచేసే ఆలయ సౌధాలు

''ఉభయ కళానిధి ''వారి యాదాద్రి కవి సమ్మేళన ఆహ్వానాలు
వెయ్యి నూట పదహారు కవులతో కవితాక్షర నీరాజనాలు
బృహత్తర కార్యక్రమ నిర్వహణకు శ్రీ శిఖా గణేష్ గారికి నా అభినందనలు
అదృష్టమే సుమీ ఈ వేడుకలో మన కవితల పఠనాలు

(OR )

ఏమని చెప్పుడు ఓ నరసింహ నా సౌభాగ్యము
ఉగ్ర నరసింహుని ప్రశాంత నయనాలతో
కవి సమ్మేళనపు ఆనంద వీక్షణాలు చూడ !


- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్
హైదరాబాద్ , 9705793187






















Wednesday 4 July 2018

కవిత నెం :326 (సి.నా .రె)

కవిత నెం :326
*సి.నా .రె *

కవితా శీర్షిక : సి .నా .రె
క్రమ సంఖ్య : 68
రచన : గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్
బీరం గూడ ,హైదరాబాద్

తెలంగాణా ముద్దు బిడ్డ మన సినారె
తెలుగుజాతి వరపుత్రుడు మన సినారె

సాహితీలోకంలో సౌరభం మన సినారె
అక్షరాల సంపదను నిర్మించిన సినారె

అమృతమయ గేయాలెన్నో రాచే సినారె
జనులందరి మనసును దోచే సినారె

ఎన్నో అధ్యక్ష పదవులు వహించిన సినారె
ఎన్నో బిరుదులతో సత్కరింపబడిన సినారె

జ్ఞానపీఠ అవార్డుకు వన్నె తెచ్చిన సినారే
పద్మ భూషణుడై వికసించిన కవి వర్మ సినారె

కవనంలో ,కావ్యంలో ,గజల్ లో కలం శైలి సినారె
కవి సార్వభముడై వెలుగొందిన సినారె

కీర్తి ,ప్రశంసలకు లొంగని తత్వం సినారె
ఆదర్శ ప్రాయమయిన వ్యక్తిత్వం సినారె

''విశ్వంభర '' నారాయణుడు మన సినారె
విను వీధిలోకి వెనుతిరగని లోకాలకి వెళ్ళినారె మన సినారె






Tuesday 3 July 2018

కవిత నెం : 325


కనులు కలిసి
కబురు తెలిసి
గుండె పిలిచి

నిన్ను తలచి
మనసు అలసి
గొంతు సొలసి

నన్ను వలచి
నీవు మరచి
కధగా మలచి

నీ ప్రేమ పరచి
నా జెబ్బ చరచి
ప్రణయమే గావించి

గతము విడచి
గమ్యం తెరచి
పయనమే సాగించి

నిదుర కాచి
నీకై వేచి
ఊహలో తేలించి

నిన్ను కాంచి
నా చేయి చాచి
నా హృదయం తెరచి

ఆ దివి నుంచి
ఈ భువి కేంచి
నా దేవి గా నిలిచి

నీ భక్తుడుగా మార్చి
నీ ప్రేమ ప్రసాదముగా ఇచ్చి
నా జన్మ సార్ధకం చేసి







Monday 2 July 2018

కవిత నెం :324(నా అభిలాష)

కవిత నెం :324
*నా అభిలాష *

ఊసులాడుటకు ఊసు కావలెయును
నిన్ను పొగడుటకు ప్రాస కావలెయును

మిస మిస మనే నీ నొసల మధ్యన
ఎర్రటి తిలకమై నుదురు కావలెయును

నీ కళ్లకు కస్తూరి కాటుకై నుండవలెను
నీ తియ్యటి పెదవుల మధ్య మాట కావలెయును

నీ మెడలో సన్నటి ముత్యపు నగ కావలెయును
నీ వాలుజడ లాగా నిన్ను అంటియుండవలయును

ముద్దుల పొద్దుల జాడ కావలెయును
మాటల మత్తుల విందు కావలెయును

నిన్ను నవ్వించే చక్కిలిగింత కావలెయును
నిన్ను నడిపించే అడుగు కావలెయును

నీ అడుగుల వెమ్మటి నీడ కావలెయును
నీ కాలి వేళ్లకి మెత్తటి మెట్టె కావలెయును

నీ అరచేతిలో సన్నటి రేఖ కావలెయును
నీ స్పర్శలో నలిగే గాలి కావలెయును

నీకు నిదురనిచ్చే తలగడ కావలెయును
నీకు హాయినిచ్చే వెన్నెల కావలెయును

నిన్ను చూసుకునే అద్దం కావలెయును
నిన్ను చూపించే నా కల కావలెయును

నీవు పీల్చే శ్వాస కావలెయును
నీ శ్వాసలో ఊపిరి నేను కావలెయును

నన్ను వీడని నీ జ్ఞాపకం కావలెయును
నీపై నాకుండే వ్యాపకం కావలెయును

నీవున్నావనే నిజం కావలెయును
నీకోసమే నడిచే ఈ కాలం కావలెయును
నిన్ను నాకై సృష్టించిన ఆ బ్రహ్మ కావలెయును




కవిత నెం :323(ప్రియ మధనం)

కవిత నెం :323
*ప్రియ మధనం *

పిలిస్తే పలుకుతావు
పలకరించే పిలుపునివ్వవు

అందుకోమని చేయినిస్తావు
నీ చేతివేలు చివర్నైనా తాకనివ్వవు

ముద్దమందారంలా మెరిసిపోతావు
చూడబోతే ఇంతలోనే ముడుచుకుపోతావు

అందరాని సౌందర్యం నీది కాదు కదా !
వందిలించుకోలేని ఒక వలపు సరదా

తుమ్మెదలా చుట్టూతిరుగుతుంటావు
తుంటరిగా ''హైడ్ & సీక్ '' ఆడుతుంటావు

మధురమైన అధరాల మధువునివ్వరాదా
తనివితీరా నీ తనువు వీణని మీటనివ్వరాదా

నీ మనసొక మల్లెతీగ పందిరిరాధా
ఆ తీగల్లోనా చిక్కుకున్న ప్రాణం నాది రాధా

మరణమైనా శరణమే నీ పరువాల ఊడలతో
చిన్న ధైర్యమైనా చేయకనెటుల నీ ప్రణయాల ఊసులతో ...


Thursday 28 June 2018

కవిత నెం :322(నా జ్ఞాపకం)

కవిత నెం :322
* నా జ్ఞాపకం *

పుస్తకంలోని కొన్ని పేజీలు తిరగేస్తుంటే
ఆ పేజీల మాటున ఒక ఫోటో (చిత్రం)
అమాంతం గాలికి ఎగిరి
నా ఎదపై వచ్చి వాలింది

దాన్ని తిప్పి చూస్తే నీ రూపం
ఆ రూపం ఎప్పటికైనా అపురూపమే
అది చూసిన నేను కాసేపు విస్మయంలో
మరికాసేపు ఆనంద క్షణాల ఊడలలో
నెమరువేసుకుంటున్నా నీ జ్ఞాపకాల వలపులనీ
నిగ్రహించుకుంటూ నేటి నేనున్న పరిస్థితినీ

అవి ఎలా ఉన్నాయంటే సుమీ !
కొన్ని కుసుమాల పరిమాళాల గంధంలా
కొన్ని వెన్నెల కాంతుల ఆమని గ్రంధంలా
ఎండమావుల వర్షపు నీటి చినుకుల్లా
ఎడారిదారుల మధ్య ఇసుకతుఫానులా
ఎప్పుడో చెప్పుకున్న సంగతులు జ్ఞాపకం
నా ఎదురుగా నీవున్నట్టే కల ఓ జ్ఞాపకం
నీ అడుగుల గుర్తులను వెంటాడిన జ్ఞాపకం
నీ ఊపిరి శబ్దాలను కొలిచిన జ్ఞాపకం

ఇన్ని రోజులు ఏమయ్యావు
ఎందుకిలా ఈ పుస్తకంలో దాక్కున్నావు
నిన్ను విడిచిన నేను నిన్ను మరిచిపోవాలనా
నిన్ను మరిచానో లేదో అని తొంగి చూడాలనా
ప్రణయ విరహంతో పావులమయిన మనము
జీవన ప్రయాణంలో రెండు నావలమయ్యాము

చూసావా నిన్ను చెలీ అనాలా ఇది కలీ అనాలా
తెలియనే తెలియట్లేదు ఇన్నాళ్ల తర్వాత
నీతో గడిపిన ప్రతీ క్షణాలన్నీ
ఒక్కసారిగా నా ముందు ఫ్లాష్ బ్యాక్ రింగ్ లా
నువ్వు నాతో పలికిన ప్రతీ మాటలన్నీ
నా చెవులలో ఏవో వేద మంత్రాలుగా
అల్లరి చేద్దామని వచ్చావా ?
నన్ను హత్తుకుని ఏడుద్దామని వచ్చావా?

నిన్ను చూడగానే మరీ
గుండెలోతుల్లోంచి భావాలు
ఊటబావిలోనుంచి ఊరుతున్నట్టుగా
ఒక్కసారిగా వెనక్కి తగ్గిన సముద్రపు అల
ఎంతో వేగంతో ముందుకు విరుచుకుపడ్డట్టుగా
నాలో తుఫాన్ ని సృష్టించింది నీ జ్ఞాపకం
నన్ను నేనే మై మరచిపోయేంత జ్ఞాపకం

ఎన్ని జ్ఞాపకాలు నా మదిలో ఉన్నా
నాతో నీవున్నావనేదే అతి పెద్ద జ్ఞాపకం
నిన్ను ప్రేమించినా ,నిన్ను విడిచినా
ఎప్పటికీ నువ్వంటే నాకు ఏదో వ్యాపకం












Saturday 2 June 2018

కవిత నెం :321(మౌనం చెప్పే మాట

కవిత నెం :321
* మౌనం చెప్పే మాట *

మన చుట్టూ ఉన్న వారి నడవడి
సక్రమంగా లేనప్పుడు
వ్యంగంలో వక్రమార్గంలో పోతున్నప్పుడు
మన మనసు స్పందన
అందంగా లేనప్పుడు
కళావిహీనమైన మనుషుల మధ్య
చిన్ని స్థానం స్నేహానికి నోచుకోనప్పుడు
అప్రశాంతని అద్దం ముందుంచి
ప్రశాంతమైన చిరునవ్వుని చిందించ లేదు
ఎందుకో నచ్చవు కొన్ని మనసుకి
మనమెంత నచ్చ చెబుదామనుకున్నా
తన సేచ్ఛను తను నిర్మించుకునే
సౌలభ్యంలో,లాబోపేక్షణ కోరుకోలేదు
కూసింత కాలక్షేపం కోసం
అశాశ్వతమైన ఈ జీవన పయనంలో
మరికాసేపు ఏదో కాలయాపన కొనసాగిస్తూ
సమూహాలు నిర్మించుకునివాటి మధ్యే
గిరిగీసుకుని ఉండే కౌరవులని చూస్తుంటే
ఈ మనసు అభిమన్యుడిలా పద్మవ్యూహంలో
వీక్షించటం తప్ప ,యుద్ధం చెయ్యలేదు


Wednesday 23 May 2018

కవిత నెం : 320

కవిత నెం  : 320
నాకు నేనే రుబాబు
నాకు నేనే జవాబు
నాకు నేనే బాబు
ఇది అతిశయోక్తి అనుకుంటావా బాబు

గర్వమైనా , గారాభమైనా
సహనమైనా , సంతోషమైనా
చెలిమైనా , బలిమైనా
చిరాకు అయినా , పరాకు అయినా
అంతా నేనే బాబు
నాకు నేను డాబు
నాతో నేనే నవాబు

కష్టమైనా ,ఇష్టమైనా
కసి అయినా , కలత అయినా
మంచి అయినా , చెడు అయినా
నాకు నేనే ఫలితం బాబు

ఇది నాకే కాదు
ఎవ్వనికైనా వారి ఖర్మల
ఖాతాలు తెరచి చూడండి బాబు
అప్పుడు గుర్తొస్తాడు ఈ బాబు
మరీ ఎక్కువగా ఆలోచన వద్దు బాపు
ఎదో అలా అలా అల్లేసాను బేవు బేవు



Friday 13 April 2018

కవిత నెం :319

కవిత నెం :319
శవాలు తిట్టుకుంటున్నాయి
శవ  రాజకీయాలను చూసి
కళేబరాలు కబలిపోతున్నాయి
భూ కబ్జాల దందాలను చూసి
పచ్చని మొక్కలు విలవిలమంటున్నాయి
వికృతమయమైన వాతావరణాన్ని చూసి
పురాతన దేవాలయాలు పూడిపోతున్నాయి
కొత్త దేవాలయాల కుండపోత చూసి
కొండరాళ్లు బండరాళ్లుగా మారుతున్నాయి
మానవ నిర్మాణాల సావాసాలు చూసి
పూరిళ్లు ,పెంకుటిల్లు మట్టిపాలవుతున్నాయి
బిల్డింగులు , కాంప్లెక్సుల ఏరివేత చూసి
పాడిపంటలు పాటికి పరిగెడుతున్నాయి 
అన్నదాత ఆర్తనాదాలు చూసి
గృహాలు గోడలుగా మారిపోతున్నాయి 
గృహహింస రాక్షసత్వం చూసి 
భ్యాంకులు దివాలా తీస్తున్నాయి 
పెరుగుతున్న హవాలా మార్గాలు చూసి 
పల్లెటూర్లు ఏకాకిగా మిగులుతున్నాయి 
పెరుగుతున్న పట్నపు వ్యవస్థను చూసి
అనాధశ్రయాలు ఆవిష్కారమవుతున్నాయి 
మరుగున పడుతున్న మానవత్వం చూసి 

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్




Saturday 27 January 2018

కవిత నెం :318 (కొడుకు ఆవేదన)


కవిత నెం :318

* కొడుకు ఆవేదన *
అమ్మలకు ఎప్పుడూ కూతుళ్లపైనే అజా ,ఆరా
కొడుకులంటే ఎందుకు ఆమెకి కన్నెర్ర
కొడుకంటే కసాయివాడా ,కనికరం లేనివాడా ?
కూతురంటే కనిపెట్టుకునేదా ,అంటిపెట్టుకునేదా ?
కన్నపేగు తపిస్తుంది కదా కన్న వారి ప్రేమకై
కొడుకు హృది జపిస్తుంటుంది కదా అమ్మ పేరుని
ఎల్లకాలం తన కూతురు పక్కనే ఉండాలనుకుంటుంది
ఎంతదూరమైనా ఎన్నో గంటల కబుర్లు చెబుతుంది
కూతురంటే మమకారం -కోడలంటే గరం గరం
కూతురుంటేనే ప్రపంచం - కొడుకు దగ్గర  పంతం
ఎన్ని కష్టాలైనా భరిస్తుంది కూతురికోసం
కొడుకు కష్టాన్ని మాత్రం కొసరైనా ఒప్పుకోదు
ఆస్థులు పాస్తులేనా అమ్మదగ్గర లెక్కలు
అనురాగాలు పంచుకునే అర్హత కొడుక్కి లేదా ?
అల్లుడంటే చూపే విలువ కొడుకుపై అది నిప్పు రవ్వ
 ఆప్యాయతలు ఎన్ని ఉన్నా కొడుకు ఒక కొండ రూపేనా
నువ్విచ్చిన జన్మేకదమ్మా ఎందుకింత   విభజన
నువ్వు చూపిన బ్రతుకే కదా ఎందుకింత చులకన
నువ్వు పెంచిన మమతే కదా ఎందుకింత దండన
అమ్ముంటే చాలు అనే పిలుపు నీకు వినపడదా
అమ్మలాగ చూడరని నమ్మే మనసు నీదేనా అమ్మా






Tuesday 23 January 2018

కవిత నెం : 317 (పసిడి కిరణాలు)

కవిత నెం : 317

* పసిడి కిరణాలు *
ముద్దు ముద్దు పిల్లలు
ముత్యమల్లె ఉందురు
ఆ పాల బుగ్గలు
లేలేత మొగ్గలు
పసి బోసి నవ్వులు
పసిడి కాంతి మెరుపులు
అమాయకపు చూపులు
అల్లరల్లరి చేస్తురు
అచ్చమైన పాత్రలు
స్వచ్ఛమైన శ్రోతలు
చిట్టి పొట్టి చేతులు
చిన్ని కిట్టయ్య చేష్టలు
బొద్దు బొద్దు సొగసులు
బుంగమూతి పెడుతురు
మల్లెలాంటి బాలలు
మాటలెన్నో చెబుదురు
అందమైన ఆటలు
అంతరంగ బాటలు
కీచు కీచు కేరింతలు
కింద మీద తుళ్లింతలు
బోలెడన్ని ఆశీస్సులు
భవిష్యత్తు ఉషస్సులు
ఏవో ఏవో తేజస్సులు
ఈ చిన్నారుల రూపాలు
ఎన్నో మధురిమలు
మృదువైన క్షణాలు !!!

-




Monday 1 January 2018

కవిత నెం :316(తెలుగు భాష)

కవిత నెం :316

* తెలుగు భాష *

తేనెలొలుకు భాష మన ''తెలుగు భాష ''
అమ్మలాంటి కమ్మనైన భాష మన ''తెలుగు భాష ''
సంస్కృతిలో చక్కెరదనంబు నిచ్చు భాష మన ''తెలుగు భాష ''
నన్నయ్య కలం నుండి జాలువారిన భాష మన ''తెలుగు భాష ''
భాషలందు లెస్స పలికిన భాష మన ''తెలుగు భాష ''
భావుకతను చిలికించే భాష మన ''తెలుగు భాష ''
గరళంలో నుంచి సరళంగా పలికే భాష మన ''తెలుగు భాష ''
స్వరాక్షర స్వాగతాలను ప్రదర్శించే భాష మన ''తెలుగు భాష ''
ఆది నుంచి అభివృద్ధి చెందుతున్న భాష మన ''తెలుగు భాష ''
అందరికీ ఆత్మీయమైన భాష మన ''తెలుగు భాష ''
పుడమికి పసిడికాంతుల వెలుగులు తెచ్చే భాష మన ''తెలుగు భాష ''
హరితవర్ణ చంద్రకాంతుల సొగసు మన ''తెలుగు భాష ''
గంగిగోవుపాలవలె స్వచ్ఛమైన భాష మన ''తెలుగు భాష ''
కడలినుండి పుట్టిన అమృతం లాంటి భాష మన ''తెలుగు భాష ''
సూర్యకిరణాల తేజోమయ ఉషస్సు లాంటి భాష మన ''తెలుగు భాష ''
నిండు సింధూరంలా నిత్యయవ్వనాన్ని నిచ్చు భాష మన ''తెలుగు భాష ''
ఏ  దేశమేగినా,ఎందుకాలిడినా
మకుటంలేని మధురమైన మాతృభాష మన ''తెలుగు భాష ''
కాబట్టి
తెలుగు మాట్లాడటమూ ,నేర్వటమూ తప్పు కాదు
ఉగ్గుపాలతో నేర్చిన తెలుగు భాషను విడువద్దు ,మరువద్దు
తెలుగువానివని గర్వించు
తెలుగు భాషను నీవు గుర్తించ్చు
తెలుగు జాతి ఉనికిని కీర్తించు
తెలుగుతల్లి బిడ్డగా జీవించు

జై తెలుగు                                   జై జై తెలుగు





కవిత నెం : 315 (ధన దాసోహం)

కవిత నెం : 315

*ధన దాసోహం *

డబ్బుకు లోబడకు ఓ మనిషి
నీ సర్వం కోల్పోకు మరమనిషి

డాబుకు పోబోకు ఓ మనిషి
నీ దారిని మరువకు మరమనిషి

డబ్బును ప్రేమించకు ఓ మనిషి
కపటప్రేమను పొందకు మరమనిషి

డబ్బంటే ఇష్టం వద్దు ఓ మనిషి
నీ ఆప్తులను విడువవద్దు మరమనిషి

డబ్బంటే మోజెందుకు ఓ మనిషి
నువ్వు మనిషివన్నదే గుర్తురాదు మరమనిషి

డబ్బుతో ఆడవద్దు ఓ మనిషి
నిన్ను బొమ్మలాగా మిగులుస్తాది మరమనిషి

డబ్బుతో వెర్రవీగకు ఓ మనిషి
నిన్ను వెర్రివాడిని చేస్తుంది మరమనిషి

డబ్బుకోసం అర్రులు చాచకు ఓ మనిషి
నీ ఆర్తనాదాలు ఎవ్వరూ వినరు మరమనిషి

డబ్బంటే ఆశ వద్దు ఓ మనిషి
నీ ఆశయం అదృశ్యమే మరమనిషి