కవిత నెం : 297
మన స్వాతంత్రం
తరాలు మారినా, యుగాలు మారినా
ఓ భావి భారత పౌరులారా!
మన దేశంపై పొరుగు దేశాల దండయాత్రలు
ఇప్పటికీ పుంకాలు పుంకాలుగా కొనసాగుతున్నాయి.
మనమేమో స్వాతంత్రం అంటే
మన ముందు తరాలు తెచ్చిపెట్టిన బహుమతి అనుకుంటూ,
“మన స్వేచ్ఛ” అంటూ,
ఏదో మచ్చలాగే తీసుకుంటూ,
బద్దకంగా బ్రతికే మూగజీవుల్లా మారిపోయాం.
లేవండి!
మన ఇంట్లో వారితోనో,
మన పక్కింట్లో వారితోనో,
మన కులం కాదని,
మన మతం కాదని,
లేదా నీ అహంకారం అడ్డొచ్చిందని,
నీకు ఏదో అవమానం జరిగిపోయిందని,
రగులుతూ, నిప్పులు రాచుకుంటూ
చావు వైపు పరిగెత్తకు.
మన దేశంలో పుట్టిన వారిలో ఎందరో,
పొట్టకూటి కోసం పొరుగుదేశం వెళ్లి
పడే అవస్థలు గుర్తుచేసుకో.
భగభగ మండే వారి హృదయాల ఆవేదనను తెలుసుకో.
తెలివిలో ముందుంది భారతీయుడు,
విలువలో ముందుంది భారతదేశం.
చరిత్ర పుటలను తవ్వితే — అది మనకే గర్వం.
మన దేశ ఐకమత్యాన్ని, మన జాతి ఔన్నత్యాన్ని
చూసి తట్టుకోలేని కొన్ని దేశాలు
మన అంతం కోసం పన్నాగాలు పన్ని కూర్చున్నాయి.
వారి గడ్డపై వారి పౌరులే ఉండాలని
మన విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ వద్ద ఆపుతున్నారు.
మన సరిహద్దులను చెరిపేద్దామంటూ
మన సైనిక బలగాలకే సవాల్ విసురుతున్నారు.
మనమేమో వారి వస్తువులనే కొనుగోలు చేసి,
మన విలాసాల సరదాల కోసం
మనమే ఆ దేశానికే అమ్ముడవుతున్నాం.
ఒకడికి వ్యాపారం బాగుండాలి,
మరొకడికి రాజకీయ జీవితం రాణించాలి,
ఇంకొకడికి బెట్టింగ్‌లు, స్మగ్లింగ్‌లతో కోట్లకు కోట్లు రావాలి.
చిన్నప్పుడు టీవీలు ఎక్కువగా లేనప్పుడు
మనలో పెరిగిన దేశభక్తి ఇప్పుడు కనిపించడంలేదు.
మీడియా ప్రచారాల కోసం ఈ దేశభక్తిని కూడా
తమ తమ TRP రేటింగుల కోసం మాత్రమే చూపుతున్నారు.
గుర్తుంచుకోండి —
స్వాతంత్రం అంటే మనకోసం సంపాదించబడింది కాదు.
మనం మన వారి కోసం, మన దేశం కోసం ఇవ్వాల్సినది.
ప్రతి ఒక్కరూ సైనికుడై యుద్ధం చేయాల్సిన పనిలేదు.
కానీ ఒక భారతీయ పౌరునిగా
మన బాధ్యత తెలుసుకుంటే చాలు.
నీ చేతిలో కలం ఉందా? — అదే నీ ఆయుధం.
నీ మాటలో పట్టు ఉందా? — అదే నీ శాసనం.
నీ కండలో సత్తువ ఉందా? — అదే నీ రాజసం.
మనమంతా ఒకటిగా ఉంటే ఎవరు ఏమి చేయలేరు.
తిరుగుబాటు అంటే యుద్ధాలే రావాల్సిన అవసరం లేదు.
మన సంస్థల, మన వ్యవస్థల సవరణలకై చేసే పోరాటమే చాలును.
జై హింద్ జై భారత్