గతాన్ని తలుచుకుంటూ
వర్తమానాన్ని వృథా చేయరాదు;
వర్తమానంలో కాలయాపన చేస్తూ
భవిష్యత్తుని కాలరాయరాదు.
నువ్వు భ్రమపడిన సంఘటనలనుంచి,
నువ్వు భయపడిన ఘట్టాల దాకా—
ఆ క్షణం, ఆ నిమిషం వరకే తప్ప
భ్రమలకు, భయబ్రాంతులకు ఆస్కారం లేదు.
నువ్వు భయపడేవి నిన్ను భయపెట్టలేవు,
నీ కల్పితమైన ఆలోచనలు తప్ప.
అసంకల్పిత ప్రతీకారచర్యలు ఎన్నున్నా,
నీ సంకల్పబలం ముందు అవి అల్పమే.
డబ్బులతో పుట్టుకొచ్చే జబ్బులెన్నో,
చికిత్సకు లొంగని వ్యాధులెన్నో;
ప్రశాంతంగా నీవుంటే ప్రకృతి వరమవుతుంది,
ఆస్వాదించే గుణముంటే నీ బాధ కూడా మాయమవుతుంది.
కంగారు పడి నీ ఖర్మని మార్చుకోకు;
చంద్రుడిలా వికసిస్తూ, సూర్యుడిలా ప్రకాశించు.
ఉజ్వలమైన భవిష్యత్తు నీకుండగా
ఉరుము, మెరుపులకే ఉలికిపాటు ఎందుకు?
జన్మనిచ్చాడు కదా ఆ జీవుడు,
అందమైన జీవితానికి ఆహ్వానం పలుకుతూనే.
పోరాటాలు, యుద్ధాలు చేయనవసరం లేదు;
పూజలు, యాగాలు చేయనవసరం లేదు.
అంతా మంచికేనని నమ్మి, అడుగేస్తూ ముందుకు సాగిపో;
'భయం' అనే అనుభూతి కూడా ఒక ఆటవస్తువు.
ఈ ఆటలో గెలుపుకోసం అన్వేషించరా?
నీ ధైర్యంతో భయమనే బలహీనతని గెలిచిపో.
మిటుకు మిటుకుమంటూ మొద్దుబారిపోకు;
ఆ కిటుకును తెలుసుకుంటూ, కృష్ణలీలను చూడు.










