15, నవంబర్ 2019, శుక్రవారం

కవిత నెం :336(నా భాషలో -నా తెలుగు)

కవిత నెం :336

* నా భాషలో -నా తెలుగు *

సంద్రంలో పొదిగిన ముత్యపు వర్ణం
పుడమిజడలో పరిమళిత ''పద కుసుమం ''
 గగనవీధిలో స్వరాగల గమగతుల సంగమం
వెన్నెల వెలుగులో ప్రకాశించే నా తెలుగు చందం

లక్షణమైన అక్షరాల అపూర్వ సోయగం
మధురిమ లిఖితం -కమనీయ వాచనం
రమణీయ సొగసుల లలితాత్మక కోమలం
సుమధుర సుందరం తెలుగునే ఈ మూలధనం

దేదీప్యమానంగా వెలుగొందే నా తెలుగు తేజం
అనిర్వచనీయమై అజరామరమై
అఖండ ఖండాలకు వ్యాపించిన నా తెలుగుకేతనం
దేశ భాషలందు తెలుగు లెస్స -ఇది తెలుగుతరం
పరభాషలెన్ని ఉన్నా దీటుగా నిలిచినా నా ద్రవిడ తెలుగు భాష

ప్రాచీనమైన భాష - అమ్మప్రేమలా లాలించే బాష
సుధ ధారలా ప్రవహిస్తూ ఇంపు సొంపయిన గ్రాంధిక భాష
చారిత్రక జానపద పలుకుబడులు భాష నా తెనుగు భాష
నిర్మలమై ,సంపూర్ణమై అచ్చమైన స్వచ్ఛమైన భాష

తెలుగువారిని గౌరవాన్ని విరాజిల్లుతూ వరమైన భాష
తెలుగునేల గర్వించే తేట తెల్లమైన భాష
గతమెంత ఘనకీర్తి గల తెలుంగు నా తెలుగు భాష
కవుల అక్షరపాత్రలా వికసించు నా తెలుగు  భాష
తరతరాలకు మూలాధారం మన తెలుగుభాష

తెలుగుని మరువకండి -తెలుగుని త్యజించకండి
తెలుగుని దశ దిశలా విస్తరింపచేయుటకు సిద్ధంకండి
జై తెలుగు తల్లి - ఇది తెలుగు వెలుగుల జావళి




19, అక్టోబర్ 2019, శనివారం

కవిత నెం :335 (అన్నపూర్ణా - వందనం )

కవిత నెం :335

అన్నపూర్ణా - వందనం

అమ్మలగన్నమాయమ్మ
ఏ దీవెన దక్కిందోయమ్మ
ఏ దేవత వరమైనవమ్మా
మా తల్లి డొక్కా సీతమ్మా

మా పాలిట అన్నపూర్ణమ్మ
మా ఆకలి తీర్చే బువ్వమ్మా
తెలుగుతల్లి ముద్దు బిడ్డమ్మ
మా తల్లి డొక్కా సీతమ్మా

మా గోదావరి తడిసిందమ్మా
నీ సేవలో తరియించదమ్మా
ఆంధ్రాయావత్తు మురిసిందమ్మా
మా తల్లి డొక్కా సీతమ్మా

కుల ,మత బేధం లేదమ్మా
అన్నదానమే నీ గుణమమ్మా
పునీతమైంది ఈ పుడమమ్మా
నీ అమ్మ ప్రేమే ఆదర్శమమ్మా

అరుదైన మాతృమూర్తి వమ్మా
మా కోసం వెలసిన దైవానివమ్మా
మా కాశీ విశ్వేశ్వరి నువ్వమ్మా
మా తల్లి - నీకు వందనమమ్మా

-గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్
హైదరాబాద్
9705793187

19, ఆగస్టు 2019, సోమవారం

కవిత నెం :334(నీ -నా లు)

కవిత నెం :334

నీ -నా లు
నేను నీకు ముఖ్యమనుకుంటే
నీవు కూడా నాకు ముఖ్యమే

నా అవసరం నీకుంది అనుకుంటే
సహాయానికి నేను సిద్ధమే

నీతో ప్రవర్తన బాగుండాలనుకుంటే
నీ పరివర్తనం కూడా అవసరమే

నా బంధం నీకు కావాలనుకుంటే
నీతో కలవటానికి నేను సుముఖమే

నా ప్రేమ నీకు దొరకాలనుకుంటే
నిన్ను ప్రేమించటానికి నేను ప్రధముడనే

నాలో మంచి నీవు చూడాలనుకుంటే
నీ మంచితనం కదలడమే

నా సహవాసం నీవు పొందాలనుకుంటే
నీ స్నేహహస్తాన్ని నాకు అందించటమే

నీ వైఖరిని తెలియచేయాలనుకుంటే
నా దారిని నీవు మళ్లించటమే

నా మాట సరళంగా ఉండాలంటే
నీ మాట మృదవుగా ఉండటమే

నీ విలువను నేను గ్రహించాలనుకుంటే
నా విలువను నీవు గుర్తించటమే







28, జూన్ 2019, శుక్రవారం

కవిత నెం :333(తెలంగాణ వేమన)

కవిత నెం :333
కవిత శీర్షిక : తెలంగాణ వేమన

''వినుడి  మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప
కనుడి కరకుప్ప కవికుప్ప కనకమప్ప''
ఈ యొక్క మకుటం తలచిన చాలు
జ్ఞప్తికొస్తాయి సిద్దప్ప గారి తత్వబోదాలు
తెలుసుకుంటూ పోతుంటే వీరి జీవితాన్ని
ఏదో జిజ్ఞాసతో కూడిన జ్ఞానంబు దక్కెనె

శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి తదుపరి
మనకు లభించిన మహా రాజయోగి - సిద్ధప్ప


సమాజం బాగుండాలని తపించిన తాత్వికుడు సిద్ధప్ప
కులవ్యవస్థను తూర్పారబట్టినాడు మన కవి సిద్దప్ప
గొప్ప సీస పద్యాలతో వెలుగిందినవారు  -సిద్దప్ప
సమాజహితాన్ని కోరిన ఏకైక గురువులు - సిద్దప్ప
ప్రతీ ఏటా గురుపూజోత్సవంలో కీర్తింపబడే -కవి సిద్ధప్ప
తొలి సమాజ వేదాంత కవి - మన వరకవి సిద్ధప్ప
40 కి పైగా గ్రంధాలను రచించిన జ్ఞానయోగి సిద్ధప్ప
తెలంగాణా వేమనగా ప్రసిద్ధి చెందినవారు - మన కవి సిద్ధప్ప

దక్షిణ భారతదేశంలో  ఎన్నదగిన వరకవులలో ఒకరు సిద్ధప్ప
తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నత స్థానంలో యున్న మహాకవి సిద్దప్ప


''గొప్పవాడను కాను కోవిదుడును గాను 
తప్పులున్నను దిద్దుడు తండ్రులారా '' 
అని చెప్పుకున్న నిరాడంబర వినయ సంపన్నుడు - ఈ కవి సిద్ధప్ప

                                                        - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్
                                                            హైదరాబాద్ ,9705793187

హామీ పత్రం 

తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో రాబోయే వరకవి సిద్దప్ప స్మారక కవితా సంకలనం కోసం మాత్రమే నా చేత రాయబడినది అలానే కవిసమ్మేళనం కు తప్పక హాజరవుతానని నా హామీని తెలియపరుస్తున్నాను 




27, మే 2019, సోమవారం

kavita samkya :332(నా మౌనం)

kavita samkya :332
శీర్షిక : నా మౌనం 
గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 
హైదరాబాద్

కకావికలమై క్రోధిస్తున్నది
జకాశకలమై జ్వలిస్తున్నది
తపోభూమిలో తపిస్తున్నది
ప్రళయపిలుపులో ప్రకంపిస్తుంది  - నా మౌనం

ఆర్తిగా పూర్తిగా ఎదురుచూడదు
చాటుగా మాటున లెక్కలేయదు  - నా మౌనం


కరకరమని విరులు నెగరగా
చరచరమని వాయువీయగా
నెత్తిన మండే జలము పొంగగా
జిహ్వమంచున జ్వాల పుట్టగా

తమాయింపులో తాంబూల సమర్పణ
తట్టుకోమని తాంత్రిక మర్దన
జట్టుకామని నెత్తుటి వరదా
హద్దు ఉందని స్వర ఘర్షణే  - నా మౌనం


25, ఏప్రిల్ 2019, గురువారం

కవిత నెం :331(కల)

కవిత నెం :331

''కల ''

కల
కలలో కదిలే కల
పాములా మెదిలే కల
నీడలా నడిచే కల
నిజంలా అనిపించే కల
అందంగా అగుపించే కల
అపురూపంగా మెప్పించే కల
క్రీడలా కవ్వించే కల
అదృశ్యం అవుతూ తేలే కల
దృశ్యమై కనిపించే కల
భయమై వేధించే కల
భ్రమలో ముంచే కల
బాధ పెడుతూ వేధించే కల
నవ్వుతూ పలకరించే కల
వింతలా వీక్షించే కల
చెంతనే ఉంటూ దాగే కల
దొంగలా దోచుకునే కల
మింగుడు పడకుండా చేసే కల
గుక్క తిప్పకుండా వెక్కిరించే కల
గురకను కూడా మింగేసే కల
ఎక్కడికో తీసుకుపోయే కల
మధ్యలోనే వదిలేసే కల
ఇక్కడ ఉన్నట్టుగానే ఉండే కల
అక్కడ ఉన్నానేమో ప్రశ్న కల
జవాబు దొరుకుతుందేమో చెప్పని కల
మంత్రాల విద్యలు తెలిసిన కల
మౌనంగా ఉండిపోయే కల
పీక మీద ఎక్కి కూర్చునే కల
శరీరం కదలికలు ఆపేసే కల
రెప్ప వేయకుండా రేయి చూపించే కల
చీకటికి భయపడని కల
వెలుగుకి అందని నీడ కల
అమాంతంగా ఆగిపోయే కల
మళ్లీ  మళ్లీ వెంటాడే కల
సువాసనలు వెదజల్లే కల
ఆకలి రుచులు చెప్పే కల
ఆర్తనాదాలు వినిపించే కల
అమావాస్యను దడపుట్టించే కల
కలలోనే ఎన్ని కలలో
కనులతో చేసే సావాసం కల
మనసుకి విరామం  కల
ఆత్మకు విహారం కల