Monday, 1 September 2025

368 (గణపతి వందనాలు)

 గురుదేవా! ఆదిదేవా! నమస్తుభ్యం,

మా హృదయమంతా నీవే వెలసిన స్వరూపం.

అలరించావు మాతో, ఆడుకున్నావు మాతో,
పూజలందుకున్నావు మాతో, పరమానందముతో.

నీ రాక మాకొక వేడుక, నీ ఉనికి మాకొక శక్తి,
నీ ప్రేమకు, నీ కృపకు లేవు ఎప్పటికీ పరిమితి.

నీవుంటే సంబరం, నీవే మాకు అంబరం,
భక్తితో నిన్ను కొలవడమే మా జీవిత ధ్యేయం.

శ్రద్ధగా పూజించగలగడం మాకొక మహా వరం,
ఇంకేమీ అవసరమూ లేదు తండ్రి వినాయక వరసిద్ది!

మనసంతా నీ ధ్యాసతో నిండిపోయినప్పుడు,
కోరికలకీ, ఆలోచనలకీ చోటుండదు ప్రభూ.

ప్రధమ పూజలందుకునే మా బుజ్జి గణపతి,
శతకోటి ప్రణామాలు నీకే మా బొజ్జ గణపతి.

వందనాలు వందనాలు – ఓ మా గణపతి,
ప్రణమ్యం శిరసా దేవం, గౌరిపుత్ర గణపతి.


Wednesday, 20 August 2025

367 (అద్భుతం)

 ఎండమావిలో నేనుంటే

వెన్నెలలా వచ్చావు

ఏడారిలో నేను అలమటిస్తుంటే

వర్షమై వర్షించావు

నా పెదవి చివర నీ పేరు

రివ్వున జారుతుంటే,

నా మౌనం నీ ధ్యానంలో

తపన చేస్తుంది

నా భాష నీ శ్వాసలో చేరి

నాకే ఊపిరినిస్తుంది

నీ ప్రేమలో పడి
నా పాదాలు కదలలేకున్నాయి.

సముద్రం అంతా ఉప్పు ఉన్నా

ఉప్పెనలా నీ ప్రేమ నన్ను చుట్టేస్తుంది


ఈ లోకం ఒక అద్బుతం అని

నిన్ను చూసాక తెలిసింది

ఆ అద్భుతమే నా జీవితమని
నీ స్పర్శ నాతో చెప్పింది.

నీ సేదలో, నీ మాయలో
నన్ను నేనే కోల్పోతున్నా,
నీ ప్రేమలో, నీ యాదలో
ప్రతి క్షణం నన్ను కనుగొంటున్నా.

Sunday, 13 July 2025

366(చలించని మనసు)

చెప్పినా విననంటివి — ఈ వెర్రి మాటలు,
ఆపినా ఆగనంటివి — ఇదే ఆఖరి చూపులు.
ఒక్కసారి ప్రేమగా పిలుపైనా లేదేమో,
నే పిలుస్తుంటే నీ గుండె తాకలేదేమో…

ఏదో ఏదో పిచ్చిగా పోతుందే చెదిరిపోతూ,
ఏంటో ఏంటో వింతగా – నీ యవ్వారం తంటగా.
చినుకైనా చెంపను తాకి – చిరు ప్రేమను పంచుతుంది,
కునుకైనా నిద్రపోమ్మని – జోలపాడుతుంది.

నువ్వుంటే చాలనేల – చిరుగాలి సంగీతం,
నేనుండే చోటనేగా – వెన్నెల హాయివాటం.
ఏది ఏమైనా పట్టనే పట్టదు,
ఎవ్వరేమన్నా మళ్లీ తిరిగి చూడని నీ మనసు.

ఎదగోల పెట్టి – ఎవ్వరు నువ్వంటూ,
ఎగురుకుంటూ పోతున్నావు.
తెలుసుకుంటావో? లేక తెలియనట్టే ఉంటావో?
మన మధ్య దాగి ఉన్న ఈ ప్రేమే నిజమని…