Monday 27 October 2014

కవిత నెం60:బాల్య - భారతం

కవిత నెం :60
బాల్య - భారతం 
**********************************
ఓ అందమైన చందమామ కధ లాంటి పుస్తకం 
ఒక అపురూపమైన అద్దం లాంటి జ్ఞాపకం 
ఆ అనుభూతులనే నెమరువేసుకుంటే మనస్సు
ఆ తన్మయత్వంతో మరలా పురుడు పోసుకుంటుంది వయస్సు 
ఒక్కసారి ఎదలోతుల్లోకి చూసే బాల్యపు చూపులు 
కాలాన్ని నిలిపివేసి చెప్పుకుంటాయి ఎన్నో కబుర్లు 
గోరుముద్దల కేరింతలు - జోల పాటల లాలింతలు 
అమ్మ దగ్గర సుకుమారం - మారం చేసే గారాభం 
చిలిపి ఆటల కోలాహలం - అలసిపోని మది సంబరం 
పొంగిపోయే ఉత్సాహం - నిలచిపోయే సంతోషం 
మాటలకుండే మాయాజాలం - నడక నేర్చుకునే పసిపాదం
ఆ  మనసు స్వేచ్చా పావురం - కపటమెరుగని కర్పూరం 
స్వార్ధం లేని స్నేహాలవనం - కుళ్ళు లేని ఊహా ప్రపంచం 
విధేయత కల్గిన విత్తనం - సుగుణాలున్న గంధం 
ఆకర్షణల హరివిల్లు - ఏ ఘర్షణ లేని పొదరిల్లు 
ఏ భాద్యత తెలియని బంధం  -కష్టమెరుగని రూపం 
అనంతమైన ఆకాశం - అనురాగవల్లిత దరహాసం
బాల్యం  నుంచే జీవనం - ఎదుగదలకి ఆరంభం
బంగారు కలల సామ్రాజ్యం  - భవితకి మూల స్తంభం 
ఎప్పటికీ తిరిగి రాని బాల్యం - మలచబడిన ఓ శిల్పం 
కాని అందరికీ ఒకలాగా ఉండదు కదా ఈ బాల్యం 
పుట్టుకతోనే తోడులేని చెత్త కుప్పల పాలు ఒక బాల్యం 
అనాధలుగా అవతరించి ఆకలి కేకలతో మరో బాల్యం 
సుఖపడే స్థోమత లేక దుః ఖం తో రోదించే  బాల్యం 
బ్రతుకు నావ కోసం బిక్షాటన చేసే బీద బాల్యం 
కాలాన్ని ఎదురించి నేరగాళ్ళుగా మారి నేరచరితలో  బాల్యం 
లోకాన్ని చూడలేక అంధకారంలో అలమటించే బాల్యం 
స్వార్ధపరుల చేతుల్లో నలిగిపోతూ దిక్కులేని బాల్యం 
విది చేతిలో ఒక వస్తువులా దైవానుగ్రహం లేని బాల్యం 
ఏది ఏమైనా బాల్యం ఒకరికి స్వర్గం ... మరొకరికి నరకం 

//రాజేంద్ర ప్రసాదు // 28. 10. 2014//
సాహితీ సేవ చిత్ర కవితల పోటీ -5 కొరకు 











  

0 comments:

Post a Comment