Wednesday 31 May 2017

కవిత నెం :293(మనిషి భాగవతం)

కవిత నెం :293
*మనిషి భాగవతం  *

ఒకరికి తెలిసిందే ధర్మం
మరొకరు అనుకునేదే న్యాయం

ఇంకొకరు చెప్తారు వేదం
మరొకరు చూపిస్తారు బేధం

ఒకరికొరకే నీతి
మరొకరు అది చేస్తే అవినీతి

తాను పలికితే ఒప్పు
మరొకరు చేస్తే అది తప్పు

మంచికొరకు ముందుకొచ్చేది ఒకరు
చెడు చెయ్యటమే పనిగా పెట్టుకుంటారు మరొకరు

నువ్వు హేళనగా మాట్లాడవచ్చు
ఎదుటివాడు నిన్ను అమర్యాదించకూడదు

నీకు ఉండదు బుద్ది
ఎదుటివారికి ఉండాలని తినమంటావ్ గడ్డి

నువ్వు సంపాదించవచ్చు డబ్బు
ఎదుటివాడు సంపాదిస్తుంటే నీ కొస్తుంది జబ్బు

నువ్వు నోరు తెరిస్తే అబద్దం
ఎదుటివాడు నిజాలు మాట్లాడినా అది నీకు అబద్దమే

పొగడ్తలతో పొంగిపోతుంటావ్
మరి విమర్శలంటే ఎందుకు భయపడతావ్

నీకు పొగరు అని వేలెత్తి చూపుతావ్
నీలోని అహాన్ని ఎందుకు దాచిపెడతావ్ ?

నమ్మకానికి నిదర్శనం నీవని చెప్తూ ఉంటావ్
కానీ ఎదుటివారిని కించిత్ కూడా నమ్మవ్

కొత్త స్నేహాలకు స్వాగతం చెప్తూ ఎదురెళ్తావ్
నీ సొంత బంధాలను ఎందుకు చెరిపేసుకుంటావ్ ?

నిన్ను ప్రేమతో పలకరించాలి అందరూ
నువ్వు మాత్రం ప్రేమతో ఎవర్నీ పట్టించుకోవు

ఇదే నేటి మనిషుల భాగవతం

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్






0 comments:

Post a Comment