Thursday, 19 October 2017

కవిత నెం : 307(వెధవ జీవితం)

కవిత నెం : 307

వెధవ జీవితం

చిన్నప్పుడే హాయిగా ఉంది,
కష్టం తెలియదు;
తెలిసినా చేయనిచ్చేవాళ్లు లేరు.

సుఖం తెలియదు;
అందులోనుంచి రానిచ్చేవాళ్లు లేరు.

దుఃఖం తెలుసు,
కానీ బుజ్జగించేవాళ్లు…
మనసారా నవ్వేవాళ్లం.
మన నవ్వుకోసం ఎన్నో ఎదురుచూపులు.

తెలియనితనం, తుంటరితనం,
అమాయకత్వం, అంతులేని పంతం.
కులమంటే తెలియదు,
కలసిమెలసి ఉండేవాళ్లం.

ఒకరితో ముద్దలు తినిపించుకునేవాళ్లం,
ఏ వాకిలి అయినా ఒకటే మనకు –
మన ఇంటికి రావడమే మరచే వాళ్లం.

ఆకలేస్తే ఏ చేయి అయినా అన్నం పెట్టేది,
దాహమేస్తే ఏ గుమ్మమైనా సేదతీర్చేది.
నిద్రకు నేల–మంచం తేడా తెలియదు,
అలసటకు హాయి–రేయి ఉండదు.

పక్కవాడిది లాక్కునే సంస్కృతి తెలియదు,
అన్నదమ్ముల మధ్య ఆస్తులు తెలియవు.

ఎదుగుతున్న కొద్దీ ఏవో బరువులు,
రోజులు మారుతున్న కొద్దీ పెరిగే బాధ్యతలు.
ఆనందం ఉంటుందని గ్యారెంటీ లేదు,
బాధ కలిగితే ఓదార్పు ఉండదు.

ఎవరితోనైనా మాట కలుపుదామంటే
అడ్డువచ్చే అహంభావం ఆజ్ఞాపిస్తుంది.
మనమే సంపాదించి, మనమే ఖర్చు చేస్తుంటే
గుండెలు తరిగేలా బాధనిపిస్తుంది.

మన అవసరాల వరకే మనమంటే,
పక్కనోడి ఎదుగుదల పోటీ పడమంటుంది.

బంధముంటే బలగముండదు,
బలగమంటే డబ్బు ఉండదు.
డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు.
అన్నీ ఉన్నా ఇబ్బందే – ఏమీ లేకున్నా ఇబ్బందే.

ఒకరిపై ఒకరికి అధికారం కోసం,
ఒక వర్గంపై ఇంకో వర్గం ఆధిపత్యం కోసం,
వెంపర్లాటలు, వెక్కిరింపులు,
అవమానాలు, ఆందోళనలు.

భయానికి భయపడాలి,
ధైర్యానికి తలదించాలి.
రాజీపడుతూ జన్మించాలి,
రాణింపుంటే అణిగివుండాలి.

“ఏమి ఖర్మరా!” అనిపిస్తుంది ఒకసారి,
“ఇదే కర్మఫలం” అని గుర్తొస్తుంది మరోసారి.

సంతృప్తి లేని జీవితం,
ఆశకు హద్దులు లేని జీవనం.
మంచి–చెడు సంఘర్షణల మధ్య
కొట్టుమిట్టాడుతున్న ఈ వెధవ జీవితం.














0 comments:

Post a Comment