Monday 13 February 2017

కవిత నెం269: నిశీధిలో నేను

కవిత నెం :269

* నిశీధిలో నేను *

నిశీధిలో నేను 
దిక్కులు  చూస్తున్నాను 

ఆరుబయట మంచం మీద 
చల్లని గాలి మెల్లగా చేరి 
సేద తీరమని  నా  మేను ను తాకగా

ఆకాశంలోని చుక్కలు లెక్కెడుతూ
ఏదో ఆలోచనలో నా మనసు
పాలపుంతలను పరీక్షగా చూస్తూ
ఆ చందమామను చూసి పొంగిపోతూ

నిలబడిపోయాను నేను ఒక రూపుగా
చలనం లేని రాతి స్తంభంలా

కొంచెం కొంచెం నా కనురెప్పలు
తమ స్పర్శను నా కనుపాపలకందిస్తూ

ఏదో మౌనాన్ని నా చెవులను వినమంటూ
అప్పుడప్పుడు లాలాజలాన్ని గుటకలుగా వేస్తూ

అలసిపోయిన హృదిని ఊరుకొమ్మంటూ
ఏదో కాస్తయినా ఊరట కమ్మంటూ

ఒకవైపు వెలుతురు మరోవైపు మిణుగురులు
కరెంటు తీగపై ఓరగా చూస్తున్న గుడ్లగూబ
నన్ను అలరించాలనే మిడతమ్మల మిడిసిబాటు

తమ నివాసంలో నిద్రకు ఉపక్రమిస్తూ 
క్కు క్కు అని శుభరాత్రి అని చెప్పే మా ఇంటి కోళ్లు 

నిర్మలంగా ఆకాశం 
తన తెల్లటి తోలును కప్పుకుంటూ 

దూరంగా పైరుగాలి 
పసిడి చేలలో రెప రెప లాడుతూ 

మా ఇంటి పక్కనే ఉన్న కొలనులో 
బెక్ బెక్ మంటూ కప్పల కుప్పిగంతులు 

ఈ పూటకి ఏదో సాధించానని నేను 
చాల్లే ఊరుకోమని నా ఆత్మారావు 

నిశ్శబ్దం  నెమ్మదిగా నా చుట్టూ కమ్ముకొనగా 
నిద్రలోకి జారుకుంటూ 
ఆ నిశీధిలోనే మరో స్వప్నంలో నేను 


- 13. 02. 17
(గరిమెళ్ళ గమనాలు)





0 comments:

Post a Comment