Tuesday 7 April 2020

కవిత నెం :338(మట్టి మనిషి)

"మట్టి మనిషి "
మట్టిలో పుట్టాం 
మట్టిలో ఆడుతూ పెరిగాం 
మట్టితో సహవాసం సాగిస్తున్నాం 
మనం తినే తిండి మట్టిలోనుంచే 
మనం కట్టే బట్ట మట్టిలోనుంచే 
ఆఖరికి మనల్ని కాల్చే కట్టే కూడా మట్టిలోనుంచే 
పల్లెలో పెరిగిన వారిని అడుగు మట్టిగురించి 
పల్లెలో తిరిగిన వారినడుగు మట్టితనం గురించి 
తొలకరిజల్లు పడే వేళలో అనుభవించు మట్టివాసనని 
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మన కాయం ఆణువణువు కూడా మట్టి పదార్థమే 
పిడికెడు మన్నుతో అందమైన బొమ్మలు చెయ్యవచ్చు 
ఆ పిడికెడు మన్నుతో మన కాయాన్ని ఖననం చెయ్యవచ్చు 
ధనికుడైనా, పేదవాడైనా 
కమ్మరినైనా, కుమ్మరి అయినా 
క్షత్రియుడైనా, బ్రాహ్మణుడైనా 
అందరూ ఈ పసిడి లాంటి మట్టిలోనుంచి వచ్చిన వారు కాదా? 
నువ్వు సొంతంగా కొంప కట్టుకుని, సుఖంగా జీవించాలంటే ఈ పుడమి తల్లి ఆశీర్వాదం కాదా? 
నువ్వు నీరు పోసి నాటు వేసి వ్యవసాయం చేసి నువ్వు తిని నలుగురికి అందించాలన్న 
ఈ నేలతల్లి అందించే సిరిసంపదలు కాదా? 
ఎవ్వరు నీవు ఓ మనిషి? 
ఎటువైపు నీ పయనం ఓ మట్టి మనిషి? 
అంతా మిధ్యే అన్నట్టు అంతా మట్టే కాదంటావా? 
మధ్యలో వచ్చిన నీ సంపద, పేరు ప్రఖ్యాతలు 
శాశ్వతం అంటావా? 
నీతో పాటు వాటిని మోసుకెళ్తానంటావా? 
పుడమి తల్లి పొత్తిళ్లలో పెరిగిన నీవు 
ఏ పసిడిరంగులను చూసి ఆరాటం? 
వొట్టిమాటలు కట్టిపెట్టి 
నువ్వు మట్టిమనిషివని మరువకు ఓ మనిషి 

0 comments:

Post a Comment