Tuesday 13 October 2015

కవిత నెం 190:పేగుబంధానికి విలువెక్కడ ?

కవిత నెం :190

పేగుబంధానికి విలువెక్కడ ?

అమ్మా నాకు చిన్న నలతగా ఉంటే 

నువ్వు కలత చెంది ,కన్నీళ్లు పెట్టుకునేదానివి 

అమ్మా నేను అడగకుండానే 

నాకు ఆకలివేస్తుందని గ్రహించి నా బొజ్జ నింపేదానివి 

చిన్నప్పుడు ఒక నిముషం నువ్వు కనపడకపోతే 

కిందపడి ,వెక్కి వెక్కి ఏడ్చే వాడిని 

నిన్ను విడిచి దూరంగా ఉండాల్సి వస్తే 

బెంగ పెట్టుకుని ,నీ కోసం ఎదురు చూసేవాడిని 

నాకు భయమనిపిస్తే 

నీ ఒళ్లో తలపెట్టి దాక్కుండేవాడిని 

నాకు నిద్దుర రాకపోతే 

నీ జోల పాట వింటూ హాయిగా నిద్రపోయేవాడిని 

నువ్వంటే ఎంతో ఇష్టం కదా నాకు అప్పుడు 

ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఎవ్వరూ తెలియదు కదా 

నువ్వెప్పుడూ నాకెదురుగా కనిపించాలనుకునేవాడిని అప్పుడు 

నీ తోడు లేకుంటే నేనేమౌతానో అన్న భయం కాబోలు 

నాకు చెమట పట్టకుండా చూసుకునేదానివి 

నీ రెక్కల కష్టంతో నాకు లోటు రాకుండా చూసుకున్నావు 

నీ గోరు ముద్దలతో ,నీ చేతి కమ్మదనం తెలియచేసావు అప్పుడు 

నీకు ఇష్టమైన వాటిని తినలేక పోతున్నావు ఇప్పుడు 

నాకోసం నీ కడుపు మాడ్చుకునేదానివి 

నాకు కావాల్సింది మాత్రం వెంటపడి మరీ పుచ్చుకునే వాడిని 

నీ కష్టాన్ని లెక్కచేయకుండా సుకుమారంగా నన్ను పెంచావు 

నీకు కష్టమని ఏనాడైనా నా మనసు ఆలోచించిందా చెప్పు 

నీకు నేనంటే చాలా ఇష్టం కదూ అమ్మా 

దానికోసం ,నాకు కష్టమంటూ తెలియకుండా చేసావు 

నీ ప్రాణం ,నీ ప్రపంచం నేనే కదూ 

మరి ఎందుకమ్మా నా ప్రాణం ,సర్వం అంటూ మరొకరిని ఇచ్చావు 

నాకోసం ఎన్నో అవమానాలు భరించావు 

మరి ఒక్కమాట నువ్వు నన్నంటే  ఎందుకు తట్టుకోలేను 

నేను గొప్పవాడిని కావాలని 

నవ్వు నీ జీవితాన్నే త్యాగం చేసి నాకు వారధిలా నిలచావు 

మరి నా కాళ్ల మీద నేను బ్రతకటం నేర్చాక 

నిన్నెందుకు అమ్మా ప్రేమగా చూసుకోలేకపోతున్నాను 

నేను పెద్దగా చదువులేకపోయినా , జీవితాన్ని చదివించావు 

అందమయినా ప్రపంచం లేకపోయినా ,అవకాశం ఇచ్చావు 

నాకోసం నీకు నువ్వే .... కంటి పాప లా మారావు 

నీ ఓర్పు ,నేర్పులతో ..... నన్నింత వాణ్ణి  చేసావు 

ప్రతీ క్షణం నిన్నే పలకరించేవాడినే 

ఈ కాలంతో ప్రయాణిస్తూ రోజుకోమారు పలకరిస్తున్నాను 

నన్నెంతో భాద్యతగా ,క్రమ శిక్షణ గా పెంచావే 

నిన్ను నా భాద్యత అని ఎందుకు తలంచలేకపోతున్నాను

నీ మాటలు ఒకప్పుడు ముద్దు నాకు 

మరి పదే పదే నువ్వు నాకోసం చెప్తుంటే వినలేకపోతున్నాను ఎందుకు ?

అబద్దం ఆడి ఎరుగను కదా నీ దగ్గర ఒకప్పుడు 

నేను బరువు ,బాధ్యతలు మోసేసరికి నిజాన్ని మాట్లాడలేకపోతున్నా నీ ముందు 

నీ చెంత ఉంటే అదే సంతోషం నాకు అప్పుడు 

నీకు దూరంగా ఎలా ఉండగల్గుతున్నా ఇప్పుడు 

నువ్వంటే ఇష్టమంటూ చెప్పుకోవటం తప్ప 

నిన్ను ఇష్టంగా చూసుకోవటం తెలియదా అమ్మా నాకు  

నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే 

నేనెలా హాయిగా నిదురించగల్గుతున్నాను 

నువ్వంటే నాకెంతో గౌరవం ,ప్రేమ అమ్మా 

నీవు లేకపోతే అవి నాకు దక్కవు అమ్మా 

నీ దీవెన నాకు బలం అమ్మా 

మరి నీవు కోరుకున్నది నేను చేయగల్గుతున్నానా ?

కాలం పరీక్షించవచ్చు అమ్మా 

నన్ను మాత్రం అపార్ధం చేసుకోకమ్మా 

నీ క్షేమమే నాకు సంతోషం 

నీ ఆజ్ఞ యే నాకు శిరోధార్యం 

ఇవి మాటల్లో చెప్పటానికే బాగుంటాయి 

మన నిజ జీవితంలో ఆచరణలో అమ్మ పై ప్రేమ చూపిస్తే ఇంకా బాగుంటాయి 

- గరిమెళ్ళ గమనాలు 




0 comments:

Post a Comment