Wednesday 21 October 2015

కవిత నెం 193:సమాజపు పోకడ

కవిత నెం : 193


*సమాజపు పోకడ *
నమస్కారానికి ప్రతి నమస్కారం - అది సంస్కారం 
ఆ నమస్కారాన్ని పాటిస్తున్నదెవరు ?
అదే సంస్కారం అని గుర్తిస్తున్నదెవరు ?

హాయ్ అని ,నమస్తే అని , సలాం అని 
తెలుగు భాషని ,సాంప్రదాయాన్ని పక్కన పెట్టి 
పొడి పొడి అక్షరాలను చేర్చి , సాగించుకుంటున్నారు 

నువ్వు ఎదుగుతున్న కొద్దీ ,నీలో మార్పు ఉంటుంది 
మరి నువ్వు నేర్చిన మాటలకెందుకు మౌనముంటుంది 

సిల్లీగా సారీ అంటారే ,క్షమించు అంటానికి శ్రమనా నీకు ?
ఓహ్ థాంక్యూ అంటారే ,ధన్యవాదముకు దండాలు ఎందులకు ?

ప్రతీ పదం ఆంగ్లం , ప్రతీ పద్దతిలో వెస్ట్రన్ 
బుద్దిగా బొట్టు పెట్టుకోవటం మరిచారు 
పద్దతిగా జుట్టు దువ్వుకోవటం విడచారు 
నీటుగా బట్టలు ధరించడాన్ని ఉతికారేశారు 

అడగకుండా సహాయం చెయ్యం అది మన రోగం 
అడిగినా సహాయం చెయ్యలేని అంధకారం 
పొరపాటున సహాయం చేసినా గుర్తించలేని అహంకారం 

మానవత్వం ఉంటుంది కాని మనకు హృదయమే ఉండదు 
పైకి మాత్రం అయ్యో అంటూ , లోలోపలే తిట్టుకుంటాం 

సరిగ్గా నడవటం తెలియదు - నడిపించటం అస్సలే తెలియదు 
నేర్చుకోవటానికి బద్ధకం - నేర్పించటానికి నిశ్శబ్దం 

ఎందాకపోతారు మీరిలా ఒకే రైలు పట్టాలల్లే 
మీ చుట్టూ జరిగేది అంతా - ఎండమావుల నీడలే 

మీరు మనిషైతే - మనిషంటూ మీకు మీరు గుర్తించండి 
మీకు మనసంటూ ఉంటే - మరొకరిని సాటి మనిషిలా చూడండి 

- గరిమెళ్ళ గమనాలు 

0 comments:

Post a Comment