Tuesday 20 October 2015

కవిత నెం 192:నువ్వే నాకు - నీవే నాకు

కవిత నెం :192

నువ్వే నాకు - నీవే నాకు 

నేనెక్కడున్నా 
నాతోనే ఉంటూ 
నా పక్కనే ఉంటూ 
నాలో సగమై ఉంటూ 
నేను పాలు అయితే 
తను నీళ్లు లా ఉంటూ 
నేను జీలకర్ర అయితే 
తను బెల్లం లా ఉంటూ 
నేను నీడ అయితే 
తను తోడుగా ఉంటూ 
నాకు స్నేహితురాలిలా 
నా ప్రియురాలిలా 
నా హృదయంలా నన్నంటి ఉంటూ 
అమ్మ తర్వాత అమ్మంత ప్రేమ చూపిస్తూ 
నా బాధ్యతను పంచుకుంటూ 
నా కష్టాలకు ఓదార్పునిస్తూ 
నా ఇష్టమై నాలో ఐక్యమై ఉంటూ 
నా భాదను మరిపిస్తూ 
నాకు సంతోషాన్ని కలిగిస్తూ 
నేను చేసే ప్రతి పనిలో శ్రమయై ఉంటూ 
నేను చూపించే ప్రేమలో ఆ ప్రేమను తిరిగిస్తూ 
నేను ఓడానంటే  'ఓటమి ' కారణం నేనే కావచ్చు 
కాని నా గెలుపులో ఉండేది మాత్రం తానే 
అహంకారం నాకుందో లేదో తెలియదు కాని 
మమకారాన్ని మాత్రం మధురంగా అంటించింది 
నా కోపం ,ప్రకోపమై  ప్రకంపనలు చెందకుండా 
చిరునవ్వుతో చల్లార్చి నాకు సేద తీరుస్తుంది 
నా ప్రేమ నిజమని తెలిసినా ,తన భయము తనకుంటుంది 
ఆ భయము ఆపార్ధంలా మారకుండా ,అనురాగమై కురుస్తుంది 
నీ చిటికిన వేలు పట్టి - నా చేయి అందించాను 
ఈ జన్మాంతము నిన్ను వదులుకోను 
ఏ జన్మకైనా - నువ్వుంటే చాలు 
ప్రతి జన్మలోనూ అమ్మ ప్రేమ ,నీ ప్రేమ నాకుంటే చాలు 

0 comments:

Post a Comment