Saturday 4 February 2017

కవిత నెం267:భవిష్యత్తు ప్రణాళికలు

కవిత నెం :267



భావగీతి కవన సంకలనం కోసం 

కవిత నెం :2
*భవిష్యత్తు ప్రణాళికలు *

నిశ్శబ్దంగా మౌనం 
సంకోచంలో మనసు 
నన్ను నాలోనే కుదిపేసే ప్రశ్నలు 
నీ గమ్యం ఎటువైపు అని ఎదురుచూసే దిక్కులు 

మధ్యతరగతి ఈదురు బ్రతుకులు 
గాలి వానలో కొట్టుమిట్టాడే కిటికీలు 
వర్షం ఆగిపోయాక ఒక చోట నిలిచిపోయే నీరు 
ఒక్కసారిగా ప్రశాంతత వైపు చూసే నా చూపు 

ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటం 
తోచిందల్లా చేసుకుని పోతుంటాం 
కాసేపు కుందేలు పరుగులు 
పున : పరిశీలనతో తాబేలు నడకలు 

మన ఎదురుగా అల్లుకుపోయి అగ్గిపెట్టె మేడలు 
ఫోజులు కొట్టుకుంటూ దూసుకుపోయే బెంజ్ కారులు 
మనం మాత్రం ఎదో  ఒక సంస్థలో చిన్న ఉద్యోగం 
మన ఖర్చులను ఎక్కాల గుణింతంలో చూసుకుంటూ 
పడుకునే ముందు ఆకాశంలో చుక్కలు లెక్కెడుతూ 

ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రోజు గడిస్తే చాలని 
మరోమారు అనిపిస్తుంది ఇలాంటి రోజుల్లో ఉండకూడదని 
కాలం వెక్కిరిస్తుంటుంది నువ్వెప్పుడు ఎదుగుతావని 
నా మనసు సర్ది చెప్పకుంటుంది ఆశల్ని చంపుకుని 

పూరి గుడిసెలో నుంచి ఇప్పుడు అద్దె డాబాలో 
సైకిలు నుంచి ఇప్పుడు సొంత ద్విచక్రవాహనంలో 
కొబ్బరాకు  రింగుల నుంచి ఇప్పుడు బంగారు ఉంగరంతో 
మారాముగా కాస్తైనా ఉన్నవారి జాబితాలో చేరకపోయినా 
ఉంటున్నాముగా తృప్తిగా నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేలాగా 

ధనం మనిషులని గుడ్డి వాళ్ళని చేస్తుంది 
ఎక్కువ సంపాదించినా ప్రమాదమే కదా 
మన అవసరాలు మనకు తీరితే చాలుగా 
ఇదీ నేటి మధ్యతరగతి మనిషి భవిష్యత్తు 
ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా 
విధి రుణం నుంచి విముక్తి తీరేదాకా 
మన తీరు , మన గతి మారనే మారవు 

- గరిమెళ్ళ గమనాలు 
04. 02. 2017



0 comments:

Post a Comment