*కన్నప్రేమ *
కొడకా ఓ ముద్దు కొడకా
కొడకా ఓ కన్న కొడకా
కొడకా ఓ తల్లి కొడకా
ఏందిరయ్యా నీ పొలికేక
మారింది నీ నడక
మా గతి ఏడ చెప్పలేక
నువ్వంటే ఇష్టం కనుక
గత్యంతరం మాకు లేక
వెధవ జీవితం
చిన్నప్పుడే హాయిగా ఉంది,
కష్టం తెలియదు;
తెలిసినా చేయనిచ్చేవాళ్లు లేరు.
సుఖం తెలియదు;
అందులోనుంచి రానిచ్చేవాళ్లు లేరు.
దుఃఖం తెలుసు,
కానీ బుజ్జగించేవాళ్లు…
మనసారా నవ్వేవాళ్లం.
మన నవ్వుకోసం ఎన్నో ఎదురుచూపులు.
తెలియనితనం, తుంటరితనం,
అమాయకత్వం, అంతులేని పంతం.
కులమంటే తెలియదు,
కలసిమెలసి ఉండేవాళ్లం.
ఒకరితో ముద్దలు తినిపించుకునేవాళ్లం,
ఏ వాకిలి అయినా ఒకటే మనకు –
మన ఇంటికి రావడమే మరచే వాళ్లం.
ఆకలేస్తే ఏ చేయి అయినా అన్నం పెట్టేది,
దాహమేస్తే ఏ గుమ్మమైనా సేదతీర్చేది.
నిద్రకు నేల–మంచం తేడా తెలియదు,
అలసటకు హాయి–రేయి ఉండదు.
పక్కవాడిది లాక్కునే సంస్కృతి తెలియదు,
అన్నదమ్ముల మధ్య ఆస్తులు తెలియవు.
ఎదుగుతున్న కొద్దీ ఏవో బరువులు,
రోజులు మారుతున్న కొద్దీ పెరిగే బాధ్యతలు.
ఆనందం ఉంటుందని గ్యారెంటీ లేదు,
బాధ కలిగితే ఓదార్పు ఉండదు.
ఎవరితోనైనా మాట కలుపుదామంటే
అడ్డువచ్చే అహంభావం ఆజ్ఞాపిస్తుంది.
మనమే సంపాదించి, మనమే ఖర్చు చేస్తుంటే
గుండెలు తరిగేలా బాధనిపిస్తుంది.
మన అవసరాల వరకే మనమంటే,
పక్కనోడి ఎదుగుదల పోటీ పడమంటుంది.
బంధముంటే బలగముండదు,
బలగమంటే డబ్బు ఉండదు.
డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు.
అన్నీ ఉన్నా ఇబ్బందే – ఏమీ లేకున్నా ఇబ్బందే.
ఒకరిపై ఒకరికి అధికారం కోసం,
ఒక వర్గంపై ఇంకో వర్గం ఆధిపత్యం కోసం,
వెంపర్లాటలు, వెక్కిరింపులు,
అవమానాలు, ఆందోళనలు.
భయానికి భయపడాలి,
ధైర్యానికి తలదించాలి.
రాజీపడుతూ జన్మించాలి,
రాణింపుంటే అణిగివుండాలి.
“ఏమి ఖర్మరా!” అనిపిస్తుంది ఒకసారి,
“ఇదే కర్మఫలం” అని గుర్తొస్తుంది మరోసారి.
సంతృప్తి లేని జీవితం,
ఆశకు హద్దులు లేని జీవనం.
మంచి–చెడు సంఘర్షణల మధ్య
కొట్టుమిట్టాడుతున్న ఈ వెధవ జీవితం.
తరాలు మారినా, యుగాలు మారినా
ఓ భావి భారత పౌరులారా!
మన దేశంపై పొరుగు దేశాల దండయాత్రలు
ఇప్పటికీ పుంకాలు పుంకాలుగా కొనసాగుతున్నాయి.
మనమేమో స్వాతంత్రం అంటే
మన ముందు తరాలు తెచ్చిపెట్టిన బహుమతి అనుకుంటూ,
“మన స్వేచ్ఛ” అంటూ,
ఏదో మచ్చలాగే తీసుకుంటూ,
బద్దకంగా బ్రతికే మూగజీవుల్లా మారిపోయాం.
లేవండి!
మన ఇంట్లో వారితోనో,
మన పక్కింట్లో వారితోనో,
మన కులం కాదని,
మన మతం కాదని,
లేదా నీ అహంకారం అడ్డొచ్చిందని,
నీకు ఏదో అవమానం జరిగిపోయిందని,
రగులుతూ, నిప్పులు రాచుకుంటూ
చావు వైపు పరిగెత్తకు.
మన దేశంలో పుట్టిన వారిలో ఎందరో,
పొట్టకూటి కోసం పొరుగుదేశం వెళ్లి
పడే అవస్థలు గుర్తుచేసుకో.
భగభగ మండే వారి హృదయాల ఆవేదనను తెలుసుకో.
తెలివిలో ముందుంది భారతీయుడు,
విలువలో ముందుంది భారతదేశం.
చరిత్ర పుటలను తవ్వితే — అది మనకే గర్వం.
మన దేశ ఐకమత్యాన్ని, మన జాతి ఔన్నత్యాన్ని
చూసి తట్టుకోలేని కొన్ని దేశాలు
మన అంతం కోసం పన్నాగాలు పన్ని కూర్చున్నాయి.
వారి గడ్డపై వారి పౌరులే ఉండాలని
మన విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ వద్ద ఆపుతున్నారు.
మన సరిహద్దులను చెరిపేద్దామంటూ
మన సైనిక బలగాలకే సవాల్ విసురుతున్నారు.
మనమేమో వారి వస్తువులనే కొనుగోలు చేసి,
మన విలాసాల సరదాల కోసం
మనమే ఆ దేశానికే అమ్ముడవుతున్నాం.
ఒకడికి వ్యాపారం బాగుండాలి,
మరొకడికి రాజకీయ జీవితం రాణించాలి,
ఇంకొకడికి బెట్టింగ్‌లు, స్మగ్లింగ్‌లతో కోట్లకు కోట్లు రావాలి.
చిన్నప్పుడు టీవీలు ఎక్కువగా లేనప్పుడు
మనలో పెరిగిన దేశభక్తి ఇప్పుడు కనిపించడంలేదు.
మీడియా ప్రచారాల కోసం ఈ దేశభక్తిని కూడా
తమ తమ TRP రేటింగుల కోసం మాత్రమే చూపుతున్నారు.
గుర్తుంచుకోండి —
స్వాతంత్రం అంటే మనకోసం సంపాదించబడింది కాదు.
మనం మన వారి కోసం, మన దేశం కోసం ఇవ్వాల్సినది.
ప్రతి ఒక్కరూ సైనికుడై యుద్ధం చేయాల్సిన పనిలేదు.
కానీ ఒక భారతీయ పౌరునిగా
మన బాధ్యత తెలుసుకుంటే చాలు.
నీ చేతిలో కలం ఉందా? — అదే నీ ఆయుధం.
నీ మాటలో పట్టు ఉందా? — అదే నీ శాసనం.
నీ కండలో సత్తువ ఉందా? — అదే నీ రాజసం.
మనమంతా ఒకటిగా ఉంటే ఎవరు ఏమి చేయలేరు.
తిరుగుబాటు అంటే యుద్ధాలే రావాల్సిన అవసరం లేదు.
మన సంస్థల, మన వ్యవస్థల సవరణలకై చేసే పోరాటమే చాలును.
మేలుకో నవతేజమా
సమాజం పిలుస్తుంది రా – కదలిరా,
నవసమాజం పిలుస్తుంది రా – కదలిరా.
గుర్రుపెట్టి నిద్రపోతే ఏముంటుందురా?
కలం పట్టి గళం పాడే చోటుందిరా.
నాలుగు గోడల మధ్య ఏముందురా?
నలుగురితో కలసి చూడు రా – కదలిరా.
నవ్వుకుంటూ, తిట్టుకుంటూ ఎంతకాలంరా?
నిజమేంటో నీ సిరాతో రాసి చూడరా.
నీ సుఖం, నీ పక్షం ఎంతసేపురా?
ఎదుటివారి బాగుకోసం రా – కదలిరా.
న్యాయ–అన్యాయాల గుణింతమేలురా?
ఎదిరించే గుండె చాలు రా – కదలిరా.
కడుపులో కుళ్లు దాచుకుని కంపుకాకురా,
ఈ సమాజపు కుళ్లు–కంపు పెకలిద్దాం రా.
ఉడుకు నెత్తురుంటే చాలు, ఏమంటావురా?
ఉడుములా ఉరకలేసి ఆగిపోకురా.
“నీకెందుకు?” అనుకుని ఆగిపోకురా,
నీ ఒక్క ప్రశ్నతోనైనా ప్రశ్నిద్దాం రా.
అడుగులకు మడుగులెత్తే ఖర్మ ఏలరా
గొఱ్ఱెలా మందలో వలస ఎందుకురా?
ఎక్కడైనా రాజీపడని తత్వమేలురా,
అమాయకులపై నీ వెర్రి కేకలు చాలురా.
నీ సమాజం కోసం ఎక్కడా రాజీ పడకురా,
నీ ఆవేశం ఆలోచనతో ఆవిర్భవించరా.
నీ ఇల్లు, నీ కుటుంబం ఒక్కటే సొంతం కాదురా,
నీ సమాజం, నీ దేశం అని మరువకురా.
ఏవో నీతులు చెప్పి చల్లారిపోకురా,
నువ్వు తెలుగువాడివని ఎన్నటికీ మరువకురా.
పిచ్చి మా తల్లి
నువ్వెంత మగాడివైనా,
ఏదైనా భరించే శక్తి ఉన్నది –
ఒక్క స్త్రీలోనే ఉంటుంది.
కానీ ఆమెను,
ఆమె ప్రేమను భరించే శక్తి మాత్రం
నీలో ఉండాలి.
అమ్మ – తన ప్రేమను కలిపి తినిపిస్తుంది.
భార్య – తన ప్రేమను, జీవితాన్ని నీతో పంచుకుంటుంది.
సోదరి – నిన్ను శ్రీరామ రక్షగా భావిస్తుంది.
పొరపాటునైనా నీ విసుగు వారిపై చూపకుము.
ఎంత ఎదిగినా, ఎంత బిజీగా ఉన్నా
వారిని ఎప్పుడూ చులకనగా చూడకుము.
తను అలసిన వేళ – సుకుమారంగా ఆదరించు.
తను విసిగిన వేళ – నీ ఔదార్యం చూపించు.
నీ ఒత్తిడిని ఆమెతో పంచుకుంటే –
నీకు ఊరట లభిస్తుంది.
నీ ప్రేమ ప్రదర్శన కాదు,
ఆమెకు అది భరోసా కావాలి.
విలువను ఆశించకు –
ఎందుకంటే ఆమె వాటిని కోరుకోదు.
మేడలు, మిద్దెలు కట్టిపెట్టనవసరం లేదు,
నీ చెంత ఉంటే –
నువ్వే ప్రపంచమని భావించేలా చూడు.
ఆమె బాధపడే సమయం కూడా లేకుండా చూడు.
నీ బాధను తన గుండెల్లో దాచుకుంటుంది కాబట్టి,
నీ సంతోషంలో తన ఆశలను చూసుకుంటుంది.
నీ కుటుంబంలో తన బంధాలను కలుపుకుంటుంది.
నిన్ను నమ్మి దూర భారాలను దాటుకుంటుంది.
తన తాళి బరువు అని ఎప్పుడూ అనుకోదు,
తన మాంగళ్యమే తన బలం అనుకునే
పిచ్చి మా తల్లి.